న్యూఢిల్లీ : మన దేశంలో ముస్లిం మహిళా నాయకులు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. వారు వివిధ పార్టీలలో కీలక బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే పాత్రికేయులు రషీద్ కిద్వారు, అంబర్ కుమార్ ఘోష్ రాసిన ఓ పుస్తకం ముస్లిం మహిళా నేతల ప్రాతినిధ్యం గురించి దిగ్భ్రాంతిని కలిగించే విషయాన్ని బయటపెట్టింది. 1951-52లో దేశంలో మొట్టమొదటి సారిగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి 2024 వరకూ మనకు కేవలం 690 మంది మహిళలు మాత్రమే ఎంపీలుగా పనిచేశారు. వారిలోనూ ముస్లింల సంఖ్య 18 మాత్రమే. ఈ ఏడాది వరకూ దేశంలో మొత్తం 18 దఫాలుగా లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఐదింటిలో ఒక్క ముస్లిం మహిళ కూడా లేకపోవడం గమనార్హం. ‘543 స్థానాలున్న పార్లమెంట్ దిగువసభలో ఒక పదవీకాలంలో చట్టసభకు ఎన్నికైన ముస్లిం మహిళల సంఖ్య నాలుగు దాటకపోవడం దిగ్భ్రాంతి కలిగించే విషయమే’ అని ఆ పుస్తకంలో రచయితలు ప్రస్తావించారు. రాజధాని ఢిల్లీలోని ఇస్లామిక్ కల్చర్ సెంటర్‌లో జగ్గర్‌నాట్ బుక్స్, ప్రభా ఖైతాన్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా హసన్ ప్రసంగిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లులో ఇచ్చిన హామీ మేరకు చట్టసభలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభించాలంటే పార్టీలోనూ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు.