న్యూఢిల్లీ : ఎర్రకోట వద్ద సోమవారం జరిగిన భారీ పేలుడు ఘటనను ‘ఉగ్రదాడే’ అని కేంద్ర క్యాబినెట్ ప్రకటించింది. ఈ ఘటనలో జరిగిన ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు పాల్పడిన నేరస్థులు, సహకరించినవారిని, ప్రోత్సాహించిన వారిని కఠినంగా శిక్షించడానికి దర్యాప్తును వేగంగా నిర్వహించాలని ఆదేశించింది. దర్యాప్తు కొనసాగుతున్న తీరు, భద్రతా చర్యలు, ఆయా సంస్థల మధ్య సమన్వయంపై క్యాబినెట్ పరిశీలించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో క్యాబినెట్ సమావేశం జరిగింది. పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా రెండు నిమిషాల పాటు కేంద్ర క్యాబినెట్ మౌనం పాటించింది.
సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనను ఖండించిన కేంద్ర క్యాబినెట్ ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ఘటనకు కారకులైన వారిని చట్టం ముందు నిలబెడతామని ఉద్ఘాటించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ వివరాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. దీని ద్వారా ఆరేండ్లపాటు రూ.25,060 కోట్లు కేటాయించనున్నారు. ఎగుమతుల ఎకో సిస్టమ్ బలోపేతానికే ఈ మిషన్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ఎగుమతిదారుల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకం విస్తరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
బాధితుల్ని పరామర్శించిన మోడీ
ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన భారీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న వెంటనే నేరుగా క్షతగాత్రులు చికిత్స పొందుతన్న ఎల్‌ఎన్‌జెపి ఆస్పత్రికి మోడీ వెళ్లారు. గాయపడిన వారితో మాట్లాడి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రుల పరిస్థితిని అక్కడి వైద్యులు ఆయనకు వివరించారు. బాధితులను పరామర్శించిన దృశ్యాలను ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. ”దాడి వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెడతాం” అని హామీ ఇచ్చారు. బుధవారం ఉదయం ముందుగా మోడీ నివాసంలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోడీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతాసలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధికారులు పాల్గొన్నారు.
ఉగ్రదాడే కేంద్ర క్యాబినెట్ ప్రకటన
- Advertisement -
- Advertisement -



