Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజనిరలంకార జీవిత సత్యాలు

నిరలంకార జీవిత సత్యాలు

- Advertisement -

చదవగల్గితే ప్రతి మనిషీ ఒక పుస్తకమే అంటారు. అట్లాగే, వినగలిగితే ప్రతి పుస్తకం ఒక మిత్రుడిలా మనతో మాట్లాడుతుంది. అలా, ఈ మధ్య కాలంలో ఒక అరవై ఏండ్ల అనుభవాల జీవిత బాటసారి ఒక మజిలీలో విశ్రాంతి తీసుకుంటూహొ మనుషుల గురించి గొప్ప తాత్వికుడు నాతో మాట్లాడుతున్నట్టు నాలో సూఫీ స్పూర్తిని నింపిన పుస్తకం ‘మనుషుల్రా మనుషులు!’
మనుషుల్ని సాటి మనుషులే రకరకాలుగా వేధిస్తున్నప్పుడు నాలోపల నిశ్శబ్దంగా ఎన్నో సార్లు వెర్రికేక అయిన మాట, ‘మనుషుల్రా మనుషులు!’. ఆ మాటే శీర్షికగాహొ ‘కవి యాకుబ్‌’ తీసుకొచ్చిన ఈ పుస్తకం చూడగానే ఎంతో ఆకట్టుకుంది. చదువుతూ ఉంటే ప్రతి పేజీలోనూ మనుషుల గురించిన తపనే కనిపించింది. మనషుల పట్ల ‘ఆ ప్రేమ’ అంకితం పేజీ నుండే కనిపించింది. ఈ పుస్తకాన్ని తన అమ్మానాన్నలకు అంకితమిస్తూ వాళ్ళను ‘అపురూప మానవులు’గా చెప్పడం చాలా గొప్పగా అనిపించింది.
అది మనుషుల్లో తీసుకొస్తున్న మార్పులను గురించి కవి యాకుబ్‌ మనతో ఒకింత బాధతో మాట్లాడడం ఉంది.
‘చెట్ల స్థానంలో సర్కారు తుమ్మలు/ నీళ్ల స్థానంలో మురుగునీరు/ మాటల స్థానంలో తిట్లు, బూతులు/ అనుబంధాలకు బదులు అమర్పులు/ ఇళ్లకు బదులు చెదిరిన బంధాలు/ ఆప్యాయతలకు బదులు ఒప్పందాలు/ చదువు జ్ఞానం కాదు, ఉద్యోగం. జీవితం బతకడం కాదు, రోజుల్ని దొర్లించడం’గా మారిపోడానన్ని నిరసిస్తారు.
ఇప్పుడు అంతా, ‘మనుషుల్లో విషం నింపి, మమతల్ని చంపి మనుషులను దూరం దూరంగా చేసి ఆడే అమానవీయ వికత క్రీడ’ను మనం గమనిస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం కాపాడుకోవాలి? ఎవరిని కాపాడుకోవాలి? అనే దాని గురించి ఈ పుస్తకం అంతా మనతో మాట్లాడుతుంది.
”మనసులు మమతలు ఉన్న మనుషులు, కరిగిపోయే కన్నీటి మనుషులు, కదిలిపోయే చలనం ఉన్న మనుషులు!
స్వరం లేనివాళ్లు, స్వేచ్ఛ అంటే తెలియని వాళ్ళు, చీము నెత్తురు కలగలిసిన గాయం లాంటి వాళ్లు, పడి లేస్తున్న వాళ్లు, లేచి పడుతున్న వాళ్లు మనుషులు, మనుషులు.
భుజం మీద ప్రేమగా తడితే కరిగిపోయే మనుషులు. కొంచెం దగ్గరగా జరిగితే ప్రాణం పెట్టే మనుషులు. మాయా మర్మాలు తెలియని మట్టి లాంటి మనుషులు. కొంచెం ప్రేమిస్తే పొంగిపోయే మనుషులు” – అలాంటి మనుషులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని ఎంతో ప్రేమగా, దయగా చెప్తుందీ పుస్తకం.
చీకట్లో తండ్లాడుతున్న మనుషులలోకి నీ లోపలి దయని విస్తరించు. చుట్టూ ఉన్న జీవితాలు ఎలా వెలిగిపోతాయో! చూడు అని, అప్పుడు నువ్వు ఎంత అపురూపంగా ఉంటావో గమనించు అనే గొప్ప స్ఫూర్తినిస్తుంది.
మనుషులంతా అందరూ ఒకే రకంగా ఎందుకు ఉంటారు? వాళ్ళకు బలాలు ఉన్నట్టే బలహీనతలూ ఉంటాయి. రకరకాల ఆలోచనలు, రకరకాల ఆచారాలు, రకరకాల రంగులు… మనుషులుకదా! వాళ్ళు అట్లాగే ఉంటారు!
”కొంచెం కలుపుదాం/ రంగుల్ని కలిపినట్టు మనుషుల్ని/ కలిపితే పోయేదేముంది/ వాళ్ళ వాళ్ళ రంగుల్ని/ కొంచెం అయినా మార్చుకొని కలిసిపోతారు/ ఇంకాస్త రంగుల్ని కలుపుదాం/ అసలు సిసలు మనుషులుగా మారే వీలుందేమో ఒకసారి ప్రయత్నిద్దాం” అని మనుషుల పట్ల గొప్ప ఆశాభావాన్ని మనలో నింపుతుంది ఈ పుస్తకం.
కాలం చలనశీలి. పరిణామశీలి! మనం క్షణాల వేలుపట్టుకొని నడవవాలి. ”నువ్విప్పడు ఇవాల్టిలో ఉన్నావు/ ఇవాల్టి కిరణాలు, వెలుగు, కాంతి, అన్నీ కొత్తవి/ నిన్నల్ని కుప్పబోసి ఆ కుప్పలోకి పదేపదే దొరకు/ నువ్విప్పుడు కొత్త నేత్రానివి” అంటూ ఎప్పటికప్పుడు జీవితాన్ని కొత్తగా చూసే స్ఫూర్తిని ఇచ్చింది ఈ పుస్తకం. ప్రతి కవితలోను, ప్రతి పేజీలోనూ గొప్ప జీవిత సత్యాలను నిరలంకార పద్యాలుగా నిండి ఉన్న ఈ పుస్తకం నాకు నిత్య స్ఫూర్తిదాయకం!

  • రహీమొద్ధీన్‌, 9010851085
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad