పలుచోట్ల రాత్రివరకూ సాగిన కౌంటింగ్
నవతెలంగాణ-విలేకరులు
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ తొలివిడత పోరు ప్రశాంతంగా సాగింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 3834 సర్పంచ్, 27,628 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించగా.. రాత్రి వరకు అన్ని ఫలితాలు వచ్చాయి.
పోరులో ఆసక్తికర ఘటనలు..
తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర విషయాలతో పాటు ఉప సర్పంచ్ ఎన్నికలో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బద్వాతండాలో ఒక్క ఓటు తేడాతో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందడంతో రీకౌంటింగ్ నిర్వహించారు. రెండోసారి అతనే గెలవడం గమనార్హం. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఇద్దరు అభ్యర్థులకూ సమానంగా ఓట్లు రావడంతో అధికారులు రీకౌంటింగ్ చేపట్టారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం చిన్న ఎల్కచెర్ల గ్రామంలో ఇద్దరు అభ్యర్ధులకు సమానంగా ఓట్లు రావడంతో రీకౌంటింగ్ నిర్వహించారు. అయినా సమానంగా రావడంతో టాస్ వేసి సర్పంచ్‌ను ఎన్నుకున్నారు. రేగోడ్ మండలం కొండాపూర్‌లో ఒక్క ఓటు తేడాతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బేగరి పాండరి గెలుపొందారు. యాదాద్రి జిల్లా లక్ష్మక్కపల్లిలోనూ సమానంగా ఓట్లు రావడంతో లాటరీ పద్ధతి ద్వారా సర్పంచ్ ఫలితాన్ని వెల్లడించారు.
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సూరం పల్లిలోనూ లాటరీ తప్పలేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్ధులకు సమానంగా 276 ఓట్లు వచ్చాయి. లాటరీ తీయగా బీఆర్‌ఎస్ బలపరిచిన మైలారం పోచయ్య సర్పంచ్ అయ్యారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గంగాపూర్ గ్రామంలో టాస్ పద్ధతిలో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచారు. జామ్ పల్లి లక్ష్మీ, గడ్డం శ్యామల ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు రావడంతో అధికారులు టాస్ వేసి విజేతను ప్రకటించారు. కొణిజర్ల మండలం పెద్ద గోపతి గ్రామ, మధిర మండలం అల్లినగరం గ్రామంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.
జగిత్యాల జిల్లాలో తల్లిపై కూతురు విజయం
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తల్లిపై కూతురు పోటీ చేసి గెలుపొందింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని తిమ్మాయపల్లి గ్రామంలో తల్లి గంగవ్వపై కూతురు పల్లెపు సుమలత పోటీ చేసి గెలుపొందింది. ఇద్దరి మధ్య హౌరాహౌరి పోటీ జరిగాక తల్లిపై కూతురు 91 ఓట్ల తేడాతో విజయం సాధించింది.
చావులోనూ విజయం
సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్‌ఠాణా గ్రామంలో రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన సర్పంచ్ అభ్యర్థికి అత్యధిక ఓట్టు రావడంతో ఫలితం ప్రకటనపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. తిరిగి ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
స్వీపర్ గెలుపు
మునుగోడు నియోజకవర్గం కచలా పురం గ్రామంలో గ్రామ పంచాయతీ స్వీపర్‌గా పనిచేస్తున్న ఏర్పుల బాబు సర్పంచ్‌గా రెండు ఓట్లతో గెలుపు..
సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో…
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు.
డబ్బుల పంపిణీ.. ఉద్రిక్తత
ఖమ్మం జిల్లాలో మొత్తం 90.09 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 10 గంటలు దాటినా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ రఘునాథపాలెం మండలం బద్యాతండా రిజల్ట్‌పై ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లిలో నిబంధనలను అతిక్రమించారంటూ పోలీసులు కొందరు నాయకులపై దాడి చేయడంతో ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా బుధవారం రాత్రి డబ్బుల పంపిణీ చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలపైనే అదే పార్టీకి చెందిన వ్యక్తులు దాడి చేశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల పోలింగ్ కేంద్రంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
95 ఏండ్ల వయసులో గెలుపు
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తండ్రి గంటకండ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్‌గా గెలుపొందారు. 95 ఏండ్ల వయసులో ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన మండల కేంద్రమైన నాగార సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అత్యధిక వయస్కుడైన సర్పంచ్‌గా రామచంద్రారెడ్డి రికార్డు నెలకొల్పారు.



