గతంలో అంగీకరించిన ట్రంప్
వెనిజులా దిగ్బంధం
కారాకాస్ : వెనిజులాపై అమెరికా సాయుధ దురాక్రమణకు పాల్పడింది. ఆదేశంపై ఆర్థిక, నావికాయాన ఆంక్షలతో ఒక దెబ్బకు రెండు రెండు పిట్టలు అన్నట్టుగా వెనిజులా, క్యూబాలను ఈ ఆంక్షలతో దెబ్బతీయాలని చూసింది. ఈ దిగ్బంధనంకు (టోటల్ అండ్ కంప్లీట్ బ్లాకేడ్) అసలు లక్ష్యం చమురేనని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ఇటీవల అంగీకరించారు. తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ఐదుసార్లు ‘చమురు’ అనే పదాన్ని ప్రస్తావించడం ద్వారా, వెనిజులాపై యుద్ధానికి డ్రగ్ ట్రాఫికింగ్ కారణమన్న వైట్‌హౌస్ వాదనల డొల్లతనాన్ని ఆయన తన పోస్టుల ద్వారా బహిర్గతం చేశారు. తొలుత చమురు ట్యాంకర్లపై ఆంక్షలు విధించి, తరువాత సైనిక కార్యకలాపాలు నిర్వహించేందుకు సిఐఎకు అనుమంతించి శనివారం వెనిజులాపై ప్రత్యక్ష సైనిక చర్యకు ట్రంప్ బరితెగించారు.
కార్పొరేట్ ప్రయోజనాలే లక్ష్యం
వెనిజులా ప్రపంచంలోనే అత్యధికంగా నాణ్యమైన చమురు నిల్వలను కలిగి ఉంది. ఈ చమురును శుధ్దిచేయడానికి ఖర్చు చాలా తక్కువ. అందుకే అమెరికా కన్ను దీనిపై పడింది. ట్రంప్ ఒక సందర్భంలో వెని జులా ”గతంలో తమ నుండి దొంగిలించిన చమురు, భూమి, ఇతర ఆస్తులన్నింటినీ అమెరికాకు తిరిగి ఇవ్వాలని” డిమాండ్ చేశారు. అయితే దాదాపు 20 సంవత్సరాల క్రితం మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ చమురు పరిశ్రమలను జాతీయం చేశారు. దీని ద్వారా వచ్చిన చమురు ఆదాయాలను గత కొన్ని దశాబ్దాలుగా వెనిజులాలో ఆరోగ్యం, విద్య, గృహనిర్మాణం వంటి సామాజిక కార్య క్రమాలకు ఆ నిధులను ఉపయోగించారు. మరోవైపు జాతీయికరణతో ఎక్సాన్‌మొబిల్, కోనోకోఫిలిప్స్ వంటి అమెరికా భహుళజాతి కంపెనీలకు భారీ నష్టం జరిగింది. వాటికి సహాయం చేయడమే ట్రంప్ లక్ష్యమని పలువురు విశ్లేషిస్తున్నారు.
వెనిజులా, క్యూబాపై ప్రభావం
వెనిజులాపై ఆంక్షలు విధించినప్పుడు అధ్యక్షుడు నికోలస్ మదురో ట్రంప్ చర్యను ”యుద్ధోన్మాద బెదిరింపు”గా అభివర్ణించారు. ”సామ్రాజ్యవాదం, ఫాసిస్ట్ శక్తులు మా మాతృభూమి సంపదను దొంగిలిం చడానికి వెనిజులాను వలసరాజ్యం చేయాలని చూస్తున్నాయి” అని ఆయన అన్నారు. మరోవైపు వెనిజులా చమురుపై ఆధారపడిన సోషలిస్ట్ దేశం క్యూబాపై కూడా ఈ దిగ్బంధనం ప్రభావం చూపుతుంది. అమెరికా ఆరు దశాబ్దాలుగా విధించిన ఆర్థిక దిగ్బంధనం కారణంగా ఇప్పటికే క్యూబా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది.
సామ్రాజ్యవాద లక్ష్యాలు
చమురు స్వాధీనం మాత్రమే కాకుండా, ఈ చర్యతో పశ్చిమార్ధగోళ కూటమిని అమెరికా ఆధిపత్యం వహించాలనే సామ్రాజ్యవాద కాంక్షలు కూడా ఉన్నాయి. చైనా, రష్యా, భారతదేశం వంటి పోటీదారులను నిరోధించడానికి, మార్కెట్లు, సహజ వనరులపై నియంత్రణ సాధించడామే అమెరికా లక్ష్యం.
అమెరికా కాంగ్రెస్‌లో వ్యతిరేకత
ట్రంప్ ప్రణాళికలను అమెరికా కాంగ్రెస్‌లో పలువురు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ సభ్యుడు (డి-టెక్సాస్) జోక్విన్ కాస్ట్రో ఈ దిగ్బంధనాన్ని ”ప్రశ్నించలేని యుద్ధ చర్య”గా పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారం ఇవ్వని యుద్ధాన్ని అమెరికన్ ప్రజలు కోరుకోవడం లేదని ఆయన ఇటీవలే అన్నారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా ట్రంప్ ప్రత్యక్ష సైనిక చర్య తీసుకోకుండా నిరోధించేందుకు ‘వెనిజులా యుద్ధ అధికారాల తీర్మానం’పై ఓటు వేయడానికి సన్నాహాలు జరుగు తున్నాయి.
కమ్యూనిస్ట్ పార్టీ యూఎస్‌ఏ (సీపీయూఎస్‌ఏ) కూడా ఈ తీర్మానాలకు మద్దతు తెలిపింది. ”చమురు కోసం జరిగే అంతులేని యుద్ధాన్ని 70 శాతం మంది వ్యతిరేకిస్తు న్నారు. ఇది యూఎస్‌కు, ప్రపంచానికి ప్రమాదకరం” అని సీపీయూఎస్‌ఏ పేర్కొంది. 2003లో ఇరాక్‌పై దాడికి ముందు జరిగిన పరిణామాలకు, ప్రస్తుత పరిస్థితికి మధ్య సారూప్యతలు ఉన్నాయని, కార్పొరేట్ గుత్తాధిపత్యం, సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసం ట్రంప్ ప్రారంభించిన యుద్ధాన్ని నిరోధించడానికి విస్తృత స్థాయిలో ఉద్యమం అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు.



