నగరం ఓ మాయసభ!
చినుకు పడితేగాని
నిజస్వరూపం తెలీదు!
అప్పటిదాకా ఆకాశాన్ని అంటే
అందమైన ఆకాశ హర్మ్యాలు
జూలా వంతెనలు, తీర్చిదిద్దిన తటాకాలు
శిల్పారామాలు,షాపింగ్‌మాళ్లు
అబ్బుర పరిచే
విద్యుత్ కాంతుల ధగధగలు
సామాన్యుడు అసూయ పడేలా
పెద్దభవంతులు
చినుకు పడితే చాలు చిత్తడి చిత్తడే!
ఏ మడుగులో అడుగు పడుతుందో
ఏ నిర్మాణం ఏ నాలా మీదనో!
ఏ చెరువులో ఏ ఇల్లు వుందో
ఏ పునాదులు ఏ సమాధుల్లో వున్నాయో
అన్నీ బయటపడతాయి!
పై వంతెనలు వరద కాలువలవుతాయి!
దొరబాబుల విల్లాలు దారి తెన్నూ తెలీక
తెల్లమొహం వేస్తాయి!
వరదలో చిక్కుకున్న వాహనాలు
పడవలవుతాయి!
ఇంటికి చేరేవాడెవడో
కొట్టుకు పోయేవాడెవడో!
ఉన్నోళ్లు కొన్నాళ్లు
ఊరిడిచి పారిపోతారు!
బస్తీలు కన్నీటి వరదలో చిక్కి
అతలాకుతమవుతాయి!
పాలకుల ధనదాహం
మానవుడి దురాశల ఫలితం
భాగ్యనగరానికి ‘జల’శాపం!!
-సత్య భాస్కర్, 9848391638