Monday, December 8, 2025
E-PAPER
Homeజాతీయంన్యూస్‌ ఛానెళ్ల ఇష్టారాజ్యం

న్యూస్‌ ఛానెళ్ల ఇష్టారాజ్యం

- Advertisement -

ఎన్‌బీడీఎస్‌ఏ మౌనం
ఐదేండ్లలో 416 ఫిర్యాదులు
12 సందర్భాల్లోనే జరిమానాలు
సంస్థ పనితీరుపై సర్వత్రా ఆందోళన

భారత్‌లో టీవీ న్యూస్‌ ఛానెళ్ల ప్రవర్తన, తీరుపై గత ఐదేండ్లలో 400కు పైగా ఫిర్యాదులు వచ్చినా, కేవలం 12 సందర్భాల్లోనే జరిమానాలు విధించబడ్డాయి. న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ డిజిటల్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (ఎన్‌బీడీఎస్‌ఏ) ప్రభావం తగ్గిందనడానికి ఇది ఒక ఉదాహరణ. నిబంధనలను ఉల్లంఘించాయని పలు ప్రధాన వార్త ఛానెళ్ల ప్రసారాలపై ఎన్‌బీడీఎస్‌ఏ ముందుకు ఫిర్యాదులు వచ్చినా, తప్పు చేసిన ఛానెళ్లపై చర్యలు తీసుకోకుండా, కేవలం నియమాలను గుర్తు చేయడానికే పరిమితమైంది. కఠినమైన శిక్షలు మాత్రం అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ సంస్థ పనితీరుపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : భారత్‌లో టెలివిజన్‌ న్యూస్‌ రంగానికి స్వీయ నియంత్రణ సంస్థగా ఏర్పడిందే ఎన్‌బీడీఎస్‌ఏ. అయితే ఎన్‌బీడీఎస్‌ఏ పని తీరు మాత్రం ఆశించ నంతగా కనబడటం లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తూ వార్తా కథనాలను ప్రసారం చేస్తున్న న్యూస్‌ ఛానెళ్లపై కొరడా ఝుళిపించటం లేదు. వాటిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎన్‌బీడీఎస్‌ఏ వెను కాడుతోందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సంస్థ తీరు కొన్ని న్యూస్‌ ఛానెళ్లకు బలాన్నిస్తున్నదనీ, తమకిష్టమైన రీతిలో వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నా యని ఆరోపిస్తున్నారు.
ఎన్‌బీడీఎస్‌ఏ ట్రాక్‌ రికార్డ్‌ ఆందోళనకరంగా ఉన్నది. 2019 నుంచి ఐదేండ్లలో భారత్‌లోని పలు ఛానెళ్లపై 416 ఫిర్యాదులు నమోదయ్యాయి. నిబంధనలను ఉల్లంఘిస్తూ, ద్వేషాన్ని రగిల్చేలా, మత విద్వేషాలు పెంచేలా, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రసారాలు చేస్తున్నాయంటూ భారత ప్రధాన టీవీ ఛానెళ్లపై ఈ ఫిర్యాదులు అందాయి. వీటిలో 12 సందర్భాల్లోనే ఎన్‌బీడీఎస్‌ఏ జరిమానాలు విధించటం గమనార్హం. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు ఈ సంస్థ ముందుకు 26 ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఇందులో తొమ్మిది కేసుల్లో స్పష్టమైన కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌ ఉల్లంఘనలు ఉన్నాయని ఎన్‌బీడీఎస్‌ఏ గుర్తించింది.

హెచ్చరికలకే పరిమితం
తమ ముందుకు వచ్చిన ఫిర్యాదుల విషయంలో కఠిన శిక్షలు విధించటంలో ఎన్‌బీడీఎస్‌ఏ విఫలమవుతున్నది. కేవలం హెచ్చరికలకే పరిమితమవుతున్నది. మదర్సా లను ఉగ్రవాదంతో అనుసంధానం చేయడం, ముస్లింలపై దుష్ప్రచారాలు, వారిపై ద్వేషం పెరిగేలా ప్రసారాలు, ‘థూక్‌ జిహాద్‌’ అంటూ చర్చలు, ఓటర్లను మత కోణంలో ఆలోచించేలా ప్రోత్సహించే కథనాలు.. ఇవన్నీ ఎన్‌బీడీఎస్‌ఏ దృష్టికి వచ్చాయి.
అయితే వీడియోలు, కథనాలను తొలగించాలంటూ ఆర్డర్లను (టేక్‌డౌన్‌ ఆర్డర్స్‌) జారీ చేయటం వరకే ఇది పరిమితమవుతున్నది. మరికొన్ని సందర్భాల్లో వీడియోలను ఎడిట్‌ చేయాలం టూ ఆదేశించింది. మిగతావన్నీ కేవలం నియ మాలను గుర్తు చేయడం వరకే పరిమితమైంది. తప్పులను పునరావృతం చేసిన ఛానెళ్లు కూడా జరిమానాలు తప్పించుకున్నాయి.

కఠిన నిబంధనలున్నా…
స్వీయ నియంత్రణ వ్యవస్థకు విశ్వసనీయతను తీసుకురావటం కోసం ఎన్‌బీడీఎస్‌ఏకు కఠినమైన అధికారాలు ఉన్నాయి. రూ.25 లక్షల వరకు జరిమానా, ఒక వారం ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌, యాంకర్‌ను ఒక నెల పాటు ‘ఆఫ్‌-ఎయిర్‌’ చేయడం, క్షమాపణల కోరటం వంటివి ఇందులో ఉన్నాయి. కానీ ఇవేవీ అమల్లో మాత్రం కనబడటం లేవని విశ్లేషకులు అంటున్నారు. ఇది ఎన్‌బీడీఎస్‌ఏ తన అసలు బాధ్యతల నుంచి వెనక్కి తగ్గడమేనని చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -