Sunday, July 13, 2025
E-PAPER
Homeకరీంనగర్బంగారం షాప్ లో చోరీ..

బంగారం షాప్ లో చోరీ..

- Advertisement -

నవతెలంగాణ – జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని ధనాల కొండయ్య కాంప్లెక్స్ లోని బ్రాండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ లో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు గడ్డపారతో షెటర్ ను లేపి షాప్ లో ఉన్న మూడు తులాల బంగారము, నాలుగు కేజీల వెండి ఆభరణాలను దొంగిలించారు. వాటి విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని షాపు యజమాని భోగి వంశీకృష్ణ తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా బంగారం షాపును నడుపుతున్నా నని తెలిపారు. శనివారం ఉదయం కాంప్లెక్స్ లో పనిచేసే వర్కర్ చూసి షాపు యజమానికి తెలుపగా, పోలీసులకు సమాచారము అందించారు. జమ్మికుంట పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.

కరీంనగర్ నుండి వచ్చి న క్లూస్ టీం ఎస్సై స్వర్ణ జ్యోతి ఆధ్వర్యంలో ఆధారాలను సేకరించారు. డాగ్ స్క్వాడ్  వచ్చి దొంగలు ఎటువైపు నుండి వచ్చారో గుర్తించారు. షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దొంగలను త్వరలో పట్టుకుంటామని పట్టణ సీఐ తెలిపారు. హుజురాబాద్ ఏసిపి మాధవి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు . షాపు యజమాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ నెల 10 న రాత్రి కొండూరి కాంప్లెక్స్ లోని మహాలక్ష్మి కిరాణం షాపు షట్టర్ ను గడ్డపారతో పైకి లేపి షాపులో ఉన్న 20వేల రూపాయలను దొంగిలించారు. షాపు యజమాని కొలకాని గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి శ్రీకృష్ణ వైన్స్ షెటర్ ను గడ్డపారతో లేపడానికి ప్రయత్నం చేశారు. కానీ షట్టర్ పైకి పోకపోవడంతో దొంగలు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది.

గత పది రోజుల క్రితం మండలం లోని సైదాబాద్ గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటిలో పట్టపగలే తాళం పగలగొట్టి ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. వరుస దొంగతనాలతో జమ్మికుంట పట్టణ ప్రజలు బెంబే లెత్తుతున్నారు.  రాత్రిపూట పోలీస్ గస్తీ పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రతి షాప్ లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్ తెలిపారు. ఇలాంటి దొంగతనాలు జరిగినప్పుడు దొంగలను పట్టుకోవడానికి కొంత ఈజీగా ఉంటుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -