Friday, September 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంటాప్‌ డిగ్రీ కాలేజీల్లో సీట్లున్నారు…

టాప్‌ డిగ్రీ కాలేజీల్లో సీట్లున్నారు…

- Advertisement -

నిజాంలో 205 సీట్లు, మహిళా వర్సిటీలో 263 సీట్లు మిగిలారు
15, 16 తేదీల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్లు
18,19 తేదీల్లో ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో స్పాట్‌ ప్రవేశాలు : ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ బాలకిష్టారెడ్డి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రముఖ డిగ్రీ కాలేజీల్లో సీట్లు హాట్‌ కేకుల్లా నిండుతాయి. వాటిలో సీటు దొరకాలంటే అంత సులువు కాదు. ఎక్కువ మార్కులు రావడంతోపాటు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) మొదటి లేదా రెండో విడత కౌన్సెలింగ్‌లోనే పాల్గొనాలి. అప్పుడే సీట్లు వస్తాయి. త్వరగా వాటిలో మొత్తం సీట్లు నిండుతాయి. కానీ మూడు విడతల కౌన్సెలింగ్‌తోపాటు ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ జరిగినా ఆయా కాలేజీల్లో సీట్లు మిగలడం గమనార్హం. రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచిన నిజాం కాలేజీలో 1,197 సీట్లుంటే ఇప్పటి వరకు 992 మంది ప్రవేశాలు పొందారు. ఇంకా 205 సీట్లున్నాయి. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం కోఠిలో 1,850 సీట్లుండగా, ఇప్పటి వరకు 1,587 మంది చేరారు. ఇంకా 263 సీట్లు ఖాళీగా ఉన్నాయి. బేగంపేట మహిళా డిగ్రీ కాలేజీలో 1,860 సీట్లకుగాను 1,593 మంది ప్రవేశాలు పొందారు. ఇంకా 267 సీట్లున్నాయి. ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీలో 486 సీట్లు, సైఫాబాద్‌ యూనివర్సిటీ సైన్స్‌ కాలేజీలో 265 సీట్లు, ప్రభుత్వ సిటీ కాలేజీలో 261 సీట్లు, వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 236 సీట్లు, బీజేఆర్‌ కాలేజీలో 228 సీట్లు, ఖైరతాబాద్‌ డిగ్రీ కాలేజీలో 225 సీట్లు, హుస్సేనీఆలం ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో 171 సీట్లు, ఫలక్‌నుమా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 133 సీట్లు, సికింద్రాబాద్‌ పీజీ కాలేజీలో 118 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ డిగ్రీ కాలేజీల్లోనూ సీట్లు ఖాళీగా ఉండడంతో వాటిలో చేరేందుకు విద్యార్థులకు స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా అవకాశమున్నది.

డిగ్రీలో మిగిలిన సీట్లు 2.41 లక్షలు
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తిని కనబరచడం లేదు. 2025-26 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో 967 డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిలో 4,38,387 సీట్లున్నాయి. ఇప్పటి వరకు కేవలం 1,96,451 (44.81 శాతం) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. డిగ్రీ కాలేజీల్లో ఇంకా 2,41,936 (55.19 శాతం) సీట్లు మిగిలాయి. డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) పరిధిలో 830 కాలేజీలున్నాయి. వాటిలో 3,77,907 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 1,69,012 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 2,08,895 సీట్లు మిగిలే ఉన్నాయి. 79 గురుకుల డిగ్రీ కాలేజీల్లో 23,614 సీట్లుంటే 11,257 మంది చేరారు. ఇంకా 12,357 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దోస్త్‌ పరిధిలో లేనివి 58 కాలేజీల్లో 36,866 సీట్లుండగా, 16,182 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 20,684 సీట్లు మిగిలి ఉన్నాయి.

నేటినుంచి డిగ్రీ స్పాట్‌ అడ్మిషన్లు : బాలకిష్టారెడ్డి
బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్‌, బీకాం ఆనర్స్‌, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మెన్‌, దోస్త్‌ కన్వీనర్‌ వి బాలకిష్టారెడ్డి, వైస్‌ చైర్మెన్‌ ఇటిక్యాల పురుష్తోం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌ విడుదల చేశారు. గురువారం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. శుక్రవారం కాలేజీల వారీగా ఖాళీ సీట్ల వివరాలను ప్రకటిస్తాయని వివరించారు. ఈనెల 15,16 తేదీల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతోపాటు ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో (రెగ్యులర్‌ కోర్సులు మాత్రమే) స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని అన్నారు. వాటిలో స్థానికులకే ప్రవేశాలు కల్పించాలని చెప్పారు. ఈనెల 17న ఆయా కాలేజీలు స్పాట్‌ అడ్మిషన్ల వివరాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఈనెల 18,19 తేదీల్లో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియను చేపడతామని వివరించారు. స్థానికులతోపాటు స్థానికేతరుల (ఇతర రాష్ట్రాల విద్యార్థులు) కు ప్రవేశాలు కల్పిస్తామని అన్నారు. ఈనెల 20న అప్‌లోడ్‌ చేయాలని కోరారు. స్పాట్‌ అడ్మిషన్లలో చేరిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌నకు అనర్హులని స్పష్టం చేశారు. విద్యార్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలను తెచ్చుకోవాలని సూచించారు. సీటు కావాలనే కాలేజీలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://సశీర్‌.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -