Monday, December 8, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకుక్కల నియంత్రణపైనా కక్కుర్తి

కుక్కల నియంత్రణపైనా కక్కుర్తి

- Advertisement -

– ఏటా కోట్లాది రూపాయల ఖర్చు..అయినా తగ్గని వీధికుక్కల సంఖ్య
– ఒక్కో కుక్కను పట్టేందుకు రూ.1500 చెల్లిస్తున్న జీహెచ్‌ఎంసీ
– శేరిలింగంపల్లి జోన్‌లో 6,599 కుక్కలు పట్టినందుకు రూ.2.42 కోట్ల ఖర్చు చూపెట్టిన వైనం
– కుక్కలను పట్టినట్టు, స్టెరిలైజ్‌ చేసినట్టు రికార్డుల్లో మాయాజాలం !
– సమాచార హక్కు చట్టం కింద అడిగినా లెక్కలు ఇవ్వని వైనం
– కుక్కల నియంత్రణపై సమగ్ర నివేదిక ప్రజల ముందుంచాలి : అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం, హెచ్‌సీఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కుక్కలకు స్టెరిలైజేషన్‌, వ్యాక్సినేషన్‌, నియంత్రణలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్టు తెలుస్తోంది. కుక్కలను పట్టినట్టు..స్టెరిలైజ్‌ చేసినట్టు…వ్యాక్సినేషన్‌ వేసినట్టు…కాంట్రాక్టు ఏజెన్సీ నిర్వాహకులు, జీహెచ్‌ఎంసీ అధికారులు కలిసి రికార్డుల్లో మాయాజాలం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుక్కలను పట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌, వ్యాక్సినేషన్‌ చేసే బాధ్యతను నగరంలోని పలు కాంట్రాక్టు సంస్థలు చూస్తున్నాయి. ఈ ఏజెన్సీలు కూడా జంతుప్రేమికులమని చెప్పుకునే పలు కీలక సంస్థలకు చెందినవేననే విమర్శలున్నాయి. ఒక్కో కుక్కను పట్టినందుకుగానూ రూ.1500లను ఏజెన్సీలకు జీహెచ్‌ఎంసీ ఇస్తున్నది. ఇప్పటివరకూ హైదరాబాద్‌లో 3.8 లక్షల నుంచి 4 లక్షల దాకా వీధి కుక్కలున్నట్టు, వాటిలో మూడు లక్షల వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కలు చూస్తే కుటుంబ నియంత్రణ దాదాపు 80 శాతం పూర్తయినట్టు కనిపిస్తున్నది. కానీ, వీధుల్లో మాత్రం కుక్కలు కొత్తగా పురుడు పోసుకుంటూనే ఉన్నాయి. వాటి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఏ వీధిలో చూసినా వీధి కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. రాత్రి, తెల్లవారుజామున సమయాల్లో అవి తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. చాలా అగ్రెసివ్‌తో కరిచేస్తున్నాయి. ఆ వీధి కుక్కలను అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. స్టెరిలైజ్‌ చేశాం, వ్యాక్సినేషన్‌ చేశాం అని దాటవేస్తున్నారు. సెర్టిలైజ్‌ చేసిన తర్వాత ఏ ప్రాంతం కుక్కలను ఆ ప్రాంతంలో వదిలేసిపోతున్నారు. అయితే, అగ్రెసివ్‌గా ఉండే కుక్కలను తిరిగి జనబాహుళ్యంలోకి వదలకూడదనే నిబంధన ఉంది. అది బుట్టదాఖలవుతున్నది. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు సైతం అగ్రెసివ్‌గా ఉండే కుక్కలను వీధుల్లో తిరిగి వదలట్లేదని హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. క్షేత్రస్థాయిలో దానికి భిన్నంగా పరిస్థితి ఉంటున్నది. హయత్‌నగర్‌లో బాలునిపై వీధికుక్కలు హృదయవిదారకంగా దాడి చేసిన ఘటన, పలుకాలనీల్లో వరుసగా అవి కరవటంతో మరోమారు చర్చనీయాంశం అవుతున్నది. కుక్కలు కరిచిన ఘటనలు చోటుచేసున్నప్పుడు సిబ్బంది హడావిడి చేసి రెండు, మూడు కుక్కలను పట్టుకుని వెళ్లిపోతున్నారు.

పై లెక్కలను చూస్తే చార్మినార్‌ జోన్‌ పరిధిలో ఉన్న వీధి కుక్కల సంఖ్యతో పోలిస్తే శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో మూడో వంతు మాత్రమే ఉన్నాయి. స్టెరిలైజేషన్‌, వ్యాక్సినేషన్‌ కూడా సగం కూడా పూర్తికాలేదు. ఖర్చు మాత్రం మూడు రెట్లు అధికంగా చూపెట్టారనేది ప్రభుత్వ గణాంకాలే ఘోషిస్తున్నాయి. ఈ రెండు జోన్ల మధ్యనే ఇంత వ్యత్యాసం ఉంటే మిగతా జోన్ల పరిస్థితి ఏంటి? జోన్ల మధ్య ఇంత తేడా ఎందుకు వచ్చింది? కాకి లెక్కలు చూపించి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నదెవరు? అనే విషయాన్ని చెప్పడానికి అధికారులు ససేమిరా అంటున్నారు. అసలు ఐదేండ్ల కాలంలో వీధి కుక్కలను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఎంత ఖర్చుపెట్టింది? ఎన్ని కుక్కలకు స్టెరిలైజ్‌ చేశారు? అనే వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం ద్వారా తెలంగాణ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం, హైదరాబాద్‌ సిటిజన్‌ ఫోరం వాళ్లు ఫిర్యాదు చేస్తే ఇచ్చేందుకు అధికారులు నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారు.

సమగ్ర నివేదిక ప్రజల ముందుంచాలి… వీధి కుక్కలను అరికట్టాలి

వీధి కుక్కల నియంత్రణ కోసం, వ్యాక్సినేషన్‌ కోసం ఐదేండ్ల కాలంలో జీహెచ్‌ఎంసీ ఖర్చుపెట్టిన వివరాలపై ప్రజల ముందు సమగ్ర నివేదిక ఉంచాలని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం కన్వీనర్‌ ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌ సిటిజన్స్‌ ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్‌రావు, వీరయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ‘వీధి కుక్కల స్టెరిలైజేషన్‌, వ్యాక్సినేషన్‌, నియంత్రణ విషయంలో సక్సెస్‌ రేటు చాలా తక్కువగా ఉంది. వీధి కుక్కల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. పైగా, పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటున్నది. జంతు ప్రేమికులమని చెప్పుకునే వారి సంస్థల పాత్ర ఉందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐదేండ్ల కాలంలో జీహెచ్‌ఎంసీలో వీధి కుక్కల నియంత్రణపై వెచ్చించిన నిధులెన్ని? వీధి కుక్కల సంఖ్య ఎంత తగ్గింది? ఏ సంస్థలు కాంట్రాక్టు పొందాయి? పబ్లిక్‌ ప్రదేశాల్లో వీధి కుక్కల తొలగించాలనే సుప్రీం కోర్టు ఆదేశాల అమలు ఎంత వరకు వచ్చింది? అనే దానిపై స్పష్టతివ్వాలి’ అని కోరారు. అన్ని మున్సిపాల్టీల్లోనూ ఏబీసీ సెంటర్లను ఏర్పాటు చేయాలని 2023లో హైకోర్టు నోటీసులు జారీ చేస్తే ఇప్పటి వరకూ ఎన్ని చోట్ల చేశారనే దానిపై స్పష్టత లేదనీ, గణాంకాలు అడిగినా అధికారులు ఇవ్వడం లేదని విమర్శించారు.
యూడీఎఫ్‌, హెచ్‌సీఎఫ్‌ డిమాండ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -