Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంనష్ట పరిహారంపై స్పష్టత లేదు

నష్ట పరిహారంపై స్పష్టత లేదు

- Advertisement -

జీఎస్టీలో రెండు శ్లాబులే
రేటు హేతుబద్ధీకరణకు జీఎస్టీ కౌన్సిల్‌ ఆమోదం
రూ.2,500 వరకు ధర ఉన్న పాదరక్షలు, దుస్తులపై జీఎస్టీ 5 శాతం
సెప్టెంబర్‌ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలతో రాష్ట్రాలకు వాటిల్లే నష్టాన్ని పూడ్చేందుకు పరిహారంపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ సంస్కరణలతో రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడుతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల ఆర్థిక మంత్రులు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా రేటు హేతుబద్ధీకరణకు జీఎస్టీ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో ఇక రెండు శ్లాబులే ఉండనున్నాయి. బుధవారం నాడిక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ 56వ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు, కేంద్ర ప్రతినిధులు పాల్గొన్నారు. రూ.2,500 వరకు ధర ఉన్న పాదరక్షలు, దుస్తులపై జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గించడానికి కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రూ.1,000 వరకు ధర ఉన్న పాదరక్షలు, దుస్తులపై 5 శాతం పన్ను విధిస్తున్నారు.

అయితే పరిమితికి మించి వస్తువులపై 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. 5 శాతం శ్లాబ్‌లో పాదరక్షలు, దుస్తుల పరిమితిని రూ.1,000 నుంచి రూ.2,500కి పెంచాలని నిర్ణయించింది. అలాగే 12 శాతం, 28 శాతం శ్లాబులను తొలగించి, ఈ శ్లాబుల నుంచి ఎక్కువ వస్తువులను 5 శాతం, 18 శాతానికి మార్చాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘నెక్స్ట్‌-జెన్‌’ జీఎస్టీ సంస్కరణలు, తప్పనిసరి ఉత్పత్తులపై పన్ను భారాన్ని తగ్గించడానికి రెండు పన్ను రేట్లు కలిగిన నూతన విధానం చర్చించారు. ప్రస్తుతం 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబ్‌లలో ఉన్న ఉత్పత్తులను తక్కువ రేట్లకు మార్చడం, కొన్ని ఎంపిక చేసిన ఉత్ప త్తులపై 40 శాతం ప్రత్యేక పన్ను విధించడం ఈ ప్రతిపాదనలో భాగంగా ఉన్నాయి. సెప్టెంబర్‌ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వస్తాయి. పన్ను రేట్ల తగ్గింపును సాధారణంగా స్వాగతించినప్పటికీ, ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలు సంస్కరణల వల్ల కలిగే ఆదాయ నష్టాన్ని కేంద్రం భర్తీ చేయాలని సాధారణ వైఖరిని తీసుకున్నాయి. ఎనిమిది ప్రతిపక్ష రాష్ట్రాలు ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. జమ్మూ కాశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతం కూడా ప్రతిపక్ష రాష్ట్రాలకు అండగా నిలుస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఆదాయ నష్టం గురించి ఆందోళన చెందుతున్నాయి. జీఎస్టీ సంస్కరణల వల్ల ఏటా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం నష్టం జరుగు తుందని భావిస్తున్నారు. ఇవి ప్రధాన మంత్రి ప్రకటించిన సంస్కరణలు కాబట్టి, బీజేపీ రాష్ట్రాలు వాటిని బహిరంగంగా వ్యతిరేకించటం లేదు. ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ.. ఆంధ్రప్రదేశ్‌ సంస్కరణలకు తన మద్దతును ప్రకటించింది.

బీజేపీయేతర రాష్ట్రాల ఆర్థికమంత్రుల వాదన తెలంగాణకు తీరని నష్టం..డిప్యూటీ సీఎం భట్టి
”కేంద్రం తమకు కలిగే నష్టానికి పరిహారం ఇవ్వడానికి అంగీకరిస్తే, కౌన్సిల్‌ ముందు ఎజెండాను ఆమోదించడంలో మాకు ఎటువంటి సమస్యలు ఉండవు. ఈ అంశం ఓటింగ్‌కు వస్తుందని నేను అనుకోను. సమాఖ్య నిర్మాణంలో రాష్ట్రాల ఆదాయ నష్టానికి పరిహారం చెల్లించడం కేంద్రం బాధ్యత” అని అన్నారు. జీఎస్టీ సంస్కరణ రాష్ట్రాలకు భారీ ఆర్థిక నష్టాలను కలిగిస్తుందని కేరళ ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ అన్నారు. రాష్ట్రాల నష్టాలను భర్తీ చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉండాలని, తగినంత అధ్యయనాలు నిర్వహించ కుండానే ఈ సంస్కరణను తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. ఒక్క కేరళకు మాత్రమే దాదాపు పది వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని, కేంద్రం నష్టాలను భర్తీ చేయడానికి సిద్ధంగా లేకపోతే, రాష్ట్రాల ఉనికిపైనే ప్రభావం పడుతుందని బాలగోపాల్‌ పేర్కొన్నారు. తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఈ సంస్కరణలతో రాష్ట్రాలపై ప్రభావం పడుతోందని అన్నారు. రాష్ట్రాల ఆదాయ నష్టంపై చర్చించామని కోరుతున్నామని హిమాచల్‌ ప్రదేశ్‌ సాంకేతిక విద్యా శాఖ మంత్రి రాజేష్‌ ధర్మాని అన్నారు. తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టీ విక్రమార్క మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు ఏకపక్షంగా తీసుకొచ్చారని, దీనిపై కౌన్సిల్‌లో చర్చ జరుగుతోం దని అన్నారు. జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ కారణం గా మొత్తం ఆదాయ నష్టం రూ.47,700 కోట్లుగా ఉంటుందని పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి చంద్రిమ భట్టాచార్య తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad