ఐదుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్
ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్‌ఎస్ పిటిషన్ల కొట్టివేత..సింగిల్ లైన్ స్టేట్‌మెంట్‌తో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీర్పు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీర్పు వెలువరించారు. సాంకేతికంగా ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ సభ్యులుగానే ఉన్నారనీ, వారు పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవని తీర్పులో పేర్కొన్నారు. దీనిపై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను తిరస్కరించారు. ఎమ్మెల్యే లు తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, టి ప్రకాష్‌గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఐదుగురు శాసనసభ్యులు పార్టీ మారినట్టు ఆధారాలు చూపలేకపోయారనీ, అందువల్ల అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవనీ, సాంకేతికంగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోనే ఉన్నట్టుగా తీర్పులో స్పష్టం చేశారు.
గురువారం మధ్యాహ్నాం మూడు గంటలకు అసెంబ్లీకి వచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ షెడ్యూల్ ప్రకారం మూడున్నర గంటలకు ట్రిబ్యునల్ చైర్మెన్‌గా ఓపెన్ కోర్టులో ‘ఈ ఐదుగురు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు’ అనే సింగిల్‌లైన్ స్టేట్‌మెంటు’ ఇచ్చారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. ఈ తీర్పుతో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, టి ప్రకాష్‌గౌడ్, అరికెపూడి గాంధీకి భారీ ఊరట లభించింది. బీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఓపెన్‌కోర్టులో వెలువరించిన తీర్పు కార్యక్రమానికి రాగా, తీర్పు ఇచ్చిన తర్వాత మీడియా పాయింట్‌కు మరో ఎమ్మల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు.
రాజ్యాంగబద్ధ తీర్పు-అసెంబీ కార్యదర్శి
అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ రాజ్యాంగబద్దంగా తీర్పు ఇచ్చినట్టు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు తెలిపారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్‌లు ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని వివరించారు. ఈ పిటీషన్‌పై రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న ఆరవ పేరాలో అధికారాల ఆధారంగా స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మెన్‌గా వ్యవహరిస్తూ తీర్పు ఇచ్చారని తెలిపారు.
నేడు మరోతీర్పు
మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో 8 మందికి సంబంధించి స్పీకర్ విచారణ పూర్తిచేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లను సంబంధించిన విచారణ ఇంకా పూర్తికాలేదు. ఆ ఇద్దరు మరింత సమయం కోరడంతో విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అనర్హత పిటిషన్లపై సభాపతి త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై ఈనెల 19న మరోమారు విచారణ జరగనుంది. ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తిచేసిన స్పీకర్, బుధవారం ఐదుగురికి సంబంధించి తీర్పు ఇచ్చారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్య, సంజరుకుమార్‌కు సంబంధించి గురువారం తీర్పు వెలువడే అవకాశం ఉంది. సుప్రీం తీర్పు సమయానికంటే ముందే స్పీకర్ తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
రాజ్యాంగ విరుద్ధం : కేపీ వివేకానంద, కె సంజయ్
ట్రిబ్యునల్ చైర్మెన్‌గా ఉన్న తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళతామని చెప్పారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పుపై వారు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ‘మావాదనలు పట్టించుకోకుండా ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. తీర్పు కాపీని అధ్యయనం చేసి, హైకోర్టుకు వెళ్తాం’ అని చెప్పారు. స్పీకర్ సింగిల్‌లైన్ స్టేట్‌మెంట్‌తో పిటిషన్లను తిరస్కరించడం సరికాదనీ, సమగ్ర విచారణ చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు.
పార్టీ మారిన వారు బాహటంగా కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారనీ, సుప్రీంకోర్టు కఠినంగా హెచ్చరించేంత వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు. 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. పది నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఉన్నికలు వస్తాయని అభిప్రాయపడ్డారు. స్పీకర్ తీర్పుపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. తీర్పు కాపీ ఇవ్వమని కోరినా స్పీకర్ నుంచి సమాధానం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లెజిస్లేటివ్ లా ప్రకారం కాపీ ఇవ్వాలనే నిబంధన ఉందనీ, అయినా ఇవ్వలేదని పిటిషన్లు దాఖలు చేసిన ఎమ్మెల్యేలు చెప్పారు. కేవలం సింగిల్ లైన్ తీర్పు కాపీ మాత్రమే ఇచ్చారని తెలిపారు. తమకు ఈ వ్యవస్థలపై నమ్మకం పోయిందన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ రాజు నుంచి ఎప్పుడో జడ్జిమెంట్ వచ్చిందనీ, ఆర్డర్ కాపీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచే వచ్చిందని విమర్శించారు. ట్రెజరీ బెంచ్‌కి టాయిలెట్ దగ్గరగా ఉంటుందని కాంగ్రెస్ వాళ్ల పక్కన కూర్చున్నామని తమ ఎమ్మెల్యేలు చెబుతున్నారని చెప్పారు.



