Monday, January 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్‌ఎంపీలను గుర్తించే ఆలోచన లేదు

ఆర్‌ఎంపీలను గుర్తించే ఆలోచన లేదు

- Advertisement -

నిమ్స్‌ను ఏయిమ్స్‌ స్థాయిలో అభివృద్ధి చేస్తాం
కంటివెలుగు పున:ప్రారంభంపై కమిటీ వేశాం : వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి వారిని డాక్లర్లుగా గుర్తించే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. శనివారం శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ సభ్యులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ”ఆర్‌ఎంపీ, పీఎంపీలకు గతంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. అనంతరం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) తెలంగాణ శాఖ వారికి శిక్షణ ఇవ్వటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును అశ్రయించింది. ప్రస్తుతం వివాదం కోర్టు పరిధిలో ఉంది. న్యాయపరమైన అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతానికి వారికి సర్టిఫికెట్‌ ఇవ్వడం లాంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదు. కోర్టు నిర్ణయం తర్వాత వారి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తాం. సభ్యులు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటాం” అని మంత్రి తెలిపారు. నిమ్స్‌లో వైద్యుల కొరత లేదని చెప్పారు. జిల్లా స్థాయిలో నిమ్స్‌ తరహా వైద్యం అందుబాటులో లేక పోవడంతో రోగులు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారనీ, నిమ్స్‌పై తీవ్ర ఒత్తిడి పెరుగు తోందని సభ్యులు లేవనెత్తిన ప్రశ్నల కు ఆయన సమాధానం చెప్పారు.

నిమ్స్‌లో వైద్యం, విద్య, రిసెర్చ్‌ కొనసాగుతున్నాయనీ, ఇప్పటికే ఏయిమ్స్‌ స్థాయిలో సేవలందిస్తున్నప్పటికీ మరింతగా విస్తరిస్తామని చెప్పారు. గత సర్కార్‌ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమంపై నిపుణుల కమిటీ వేశామని బీఆర్‌ఎస్‌ సభ్యులు వంటేరు యాదవరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కమిటీ సిఫారసుల అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా డే కేర్‌ కేన్సర్‌ సెంటర్లు ప్రారంభించామనీ, కేన్సర్‌ స్క్రీనింగ్‌, డయాగసిస్‌, కీమోథెరపీ వంటి సేవలు ఈ క్లినిక్‌లలో అందిస్తు న్నామని మంత్రి వెల్లడించారు. కేన్సర్‌ పేషెంట్లు కీమో థెరపీ కోసం హైదరాబాద్‌ వరకూ రావాల్సిన అవసరం లేకుండా, జిల్లా కేంద్రాల్లోని డే కేర్‌ కేన్సర్‌ సెంటర్లలో సేవలు అందిస్తున్నామన్నారు. దీంతో ఎంఎన్‌జే హాస్పిటల్‌ మీద పేషెంట్‌ లోడ్‌ కూడా తగ్గిందని తెలిపారు. కేన్సర్‌ కేర్‌ సెంటర్ల తరహాలోనే, ప్రజలకు నిరంతర కంటి వైద్య సేవలు అందు బాటులో ఉండేలా ఐ కేర్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.

కమీషన్లు తీసుకుని కార్పొరేట్‌ ఆస్పత్రులకు పంపిస్తున్నారు
శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

కమీషన్లు తీసుకుని కొంతమంది ఆర్‌ఎంపీ, పీఎంపీలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన రోగులను కార్పొరేట్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారని శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖెందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలిలో ఆర్‌ఎంపీ అంశంపై జరిగిన చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. తన వద్దకు వచ్చిన రోగుల అనుభవాలను సభలో ప్రస్తావించారు. స్కూళ్లల్లో లైబ్రరీలు లేకపోవడంపై స్పెషల్‌ మెన్షన్‌ సందర్భంగా ఆయన టీచర్ల పైనా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టీచర్లు తాము పని చేసే చోట నివాసం ఉండటం లేదనీ, సాయంత్రం నాలుగెప్పుడైతదా అని గడియారం వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. పని చేసే చోట నివాసముంటే విద్యార్థులతో టీచర్లకు అనుబంధం ఏర్పడుతుందని అన్నారు. ఫలితంగా విద్యలో పిల్లలు రాణిస్తారని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -