Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలగచర్లలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

లగచర్లలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

- Advertisement -

– ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి
– రెండేండ్లలో రూ.8.48 లక్షల పెట్టుబడులు :శానసమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

లగచర్లలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మంగళ వారం శాసన మండలిలో కొత్త పరిశ్రమల ఏర్పాటుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు రాద్దాంతం చేసి లగచర్లలో పరిశ్రమల ఏర్పాటును అడ్డు కున్నాయని విమర్శించారు. తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తాము యత్నిస్తుంటే ప్రోత్సహించాల్సిన విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రెండేండ్ల కాంగ్రెస్‌ పాలనలో 8.48 లక్షల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. రెండు దఫాలుగా దావోస్‌లో 1.78 లక్షల పెట్టుబడులు వచ్చాయనీ, అందులో ఇప్పటి వరకు 60 శాతం గ్రౌండింగ్‌ అయ్యాయని తెలిపారు. మిగతా వాటిని ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లాలనే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. అనంతరం టీచర్స్‌ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. 1,030 గురుకుల పాఠశాలలకు గత పన్నెండేండ్లలో రూ.3,500 కోట్ల అద్దె చెల్లించినట్టు వివరించారు. మంత్రి దామోదర రాజనర్సింహ సమాదానం చెబుతూ ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 225 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 79 స్కూళ్ల టెండర్లు ఫైనల్‌ అయినట్టు తెలిపారు. కామన్‌ టైంటేబుల్‌ కోసం కమిటీ వేశామనీ, నివేదిక వచ్చిన తర్వాత తగు నిర్ణరయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం బీజేపీ సభ్యులు మల్క కొంరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానం 2020ని ఎప్పటి నుంచి రాష్ట్రంలో అమలు చేస్తారని ప్రశ్నించారు. మంత్రి సమాధానమిస్తూ ఇందు కోసం ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు నేతృత్వంలో కమిటీ వేశామనీ, నివేదిక వచ్చిన తర్వాత అందులోని సిఫారసుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మన ఊరు..మన బడి బిల్లులు చెల్లించండి ప్రభుత్వానికి మండలి చైర్మెన్‌ గుత్తా వినతి
గత సర్కార్‌ హయాంలో చేపట్టిన మన ఊరు, మన బడి పెండింగ్‌ బిల్లులు రూ.360 కోట్లు చెల్లించాలని మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. గురుకుల పాఠశాలలపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. తన సొంత గ్రామంలో విద్యాకమిటీ చైర్మెన్‌ రూ.12 లక్షల పని చేస్తే ఇప్పటి వరకు బిల్లు రాలేదన్నారు. సీఎస్‌ నుంచి సీఎం వరకు అందరి దృష్టికి తీసుకు పోయినా ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదన్నారు. వాటి స్థానంలో ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శపాఠశాలను మైనింగ్‌ సెస్‌తో వచ్చే ఆదాయంతో నిర్వహించాలని చేసిన ప్రతిపాదన సక్సెస్‌ కావడం లేదని అన్నారు.

వీడీసీలపై కఠిన చర్యలు తీసుకోండి – సర్కార్‌కు మండలి వైస్‌ చైర్మెన్‌ బండ ప్రకాశ్‌ విజ్ఞప్తి
నిజామాబాద్‌ లాంటి కొన్ని జిల్లాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ(వీడీసీ)ల ఆగడాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మండలి వైస్‌ చైర్మెన్‌ బండ ప్రకాశ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగంతో సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకునే ఆదేశాలివ్వాలన్నారు. ఎర్త్‌ యూనివర్సీటి పాలక మండలిలో నిష్ణాతులైన నిపుణులతో పాటు విదేశీయులకు అవకాశం కల్పించాలని సూచించారు. విద్య, పరిశోధనలకు అధిక నిధులు కేటాయంచాలని కోరారు. కులగణన వివరాలను సభ్యులకు అందజేయా లని ప్రభుత్వానికి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -