Thursday, July 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంలేబర్‌ కోడ్‌లు అమలైతే సమ్మె చేసే హక్కుండదు

లేబర్‌ కోడ్‌లు అమలైతే సమ్మె చేసే హక్కుండదు

- Advertisement -

– కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం :ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చే లేబర్‌ కోడ్‌లు అమల్లోకి వస్తే సమ్మె హక్కుండబోదని ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర, ఇతర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా చేసి అమలు చేస్తే కార్మికుల హక్కులు హరించబడతాయని చెప్పారు. సంఘం పెట్టుకునే హక్కును కోల్పోతామనీ, సమ్మె హక్కు ఉండబోదనీ, ఉమ్మడి బేరసారాల హక్కుండబోదని అన్నారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలనీ, ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలని కోరారు. లేబర్‌ కోడ్‌లు అమలైతే యాజమాన్యాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రయివేటీకరణ విధానాలను మరింత దూకుడుగా అమలు చేసేందుకు అవకాశముంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఏకీకృత పెన్షన్‌ స్కీం (యూపీఎస్‌)తో ఉపయోగం లేదన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కనీస పెన్షన్‌ రూ.తొమ్మిది వేలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ కోచైర్మెన్లు చావ రవి, జి సదానందంగౌడ్‌, నాయకులు ఎస్‌ఎం ముజీబ్‌, కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్‌, ఎ సత్యనారాయణ, కటకం రమేష్‌, దస్య నాయక్‌, హుస్సేన్‌, కె శ్రీకాంత్‌, పి హరికృష్ణ, రాజ్‌కుమార్‌, కురాడి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -