నవతెలంగాణ-హైదరాబాద్: టాలీవుడ్ సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా ఖండించారు. ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశంలో, సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంపుపై తాను హామీ ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఫిలిం ఫెడరేషన్‌కు చెందిన కొందరు సభ్యులు తనను కలిశారనీ… వారి డిమాండ్లకు తాను అంగీకరించి, షూటింగ్స్ త్వరలో ప్రారంభిస్తానని హామీ ఇచ్చాననీ… మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని చిరంజీవి తన ప్రకటనలో తెలిపారు. “నేను ఫెడరేషన్ నుంచి ఎవరినీ కలవలేదు. అసలు వాస్తవాలు వెల్లడించడానికే ఈ ప్రకటన చేస్తున్నాను” అని ఆయన స్పష్టం చేశారు.
ఇది మొత్తం పరిశ్రమకు సంబంధించిన సమస్య అని, ఏ ఒక్క వ్యక్తి ఏకపక్షంగా హామీలు ఇచ్చి పరిష్కరించలేరని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఫిలిం ఛాంబర్ అత్యున్నత సంస్థ అని, ఆ సంస్థ మాత్రమే కార్మిక సంఘాలతో, ఇతర భాగస్వాములతో చర్చలు జరిపి న్యాయమైన పరిష్కారం కనుగొంటుందని చిరంజీవి వివరించారు.
అలాంటి పరిష్కారం లభించే వరకు ఇలాంటి నిరాధారమైన, దురుద్దేశపూర్వకమైన ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. పరిశ్రమలో గందరగోళం సృష్టించే ఇలాంటి కథనాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చిరంజీవి తన ప్రకటనలో తేల్చిచెప్పారు.



