లోక్‌సభలో రాహుల్ డిమాండ్
న్యూఢిల్లీ : దేశంలోని ప్రధాన నగరాల్లో నెలకొన్న వాయు కాలుష్యంపై లోక్‌సభలో చర్చ జరగాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం కోరారు. జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవెనెత్తుతూ, ఈ అంశంపై చర్చ జరిగే సమయంలో ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరినొకరు నిందించుకోకుండా సమస్యకు ఒక పరిష్కారం కనుగొనేలా వుండాలని, ఆ రకంగా చర్చ జరిగేలా చూడాలని కోరారు. ఇదేమీ సైద్ధాంతికపరమైన అంశం కాదు, ఈ సభలో వున్న ప్రతి ఒక్కరూ గాలి కాలుష్యం సమస్య వుందని అంగీకరిస్తారు, దాని వల్ల ప్రజలకు కలిగే నష్టంతో ఏకీభవిస్తారు. కాబట్టి ఈ విషయంపై మనందరం పరస్పరం సహకరించుకుని చర్చ జరిగి పరిష్కారం కనుగొనేలా చూడాలని రాహుల్ కోరారు.
అప్పుడు అందుకు సంబంధించిన ప్రణాళికను ప్రధాని అమలు జరిగేలా చూస్తారన్నారు. దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా వుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. లోక్‌సభ సభా కార్యకలాపాల కమిటీ దీనికి సమయాన్ని కేటాయించవచ్చన్నారు. విషపూరితమైన గాలితో కూడిన వాతావరణంలో మన ప్రధాన నగరాల్లో ప్రజలు చాలా వరకు జీవిస్తున్నారని, లక్షలాది మంది ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులతో బాధ పడుతున్నారని చెప్పారు. వారి భవిష్యత్తు నాశనమై పోతోందన్నారు. ప్రజలకు కొన్ని రకాల కేన్సర్లు వస్తున్నాయన్నారు. వృద్ధులు గాలి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
వాయు కాలుష్యంపై చర్చ జరగాలి
- Advertisement -
- Advertisement -


