నవతెలంగాణ – మల్హర్ రావు (మహముత్తారం)
ఎరువుల కొరత రాకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం మహా ముత్తారం మండల పర్యటనలో భాగంగా కలెక్టర్ ఎరువుల లభ్యత, స్టాకు వివరాలను వ్యవసాయ శాఖ ఏఓ అనూషను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని,ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని సూచించారు. ఎరువుల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. యూరియా పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. టాస్క్ ఫోర్స్ టీములు నిరంతరం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. యూరియా అవసరం బాగా పెరిగిపోయిందని రైతులు పంట సాగును దృష్టిలో ఉంచుకుని యూరియా ఇవ్వాలని తెలిపారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా యూరియా పంపిణీ జరిగేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. మండల్లాల్లోని సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న యూరియా నిల్వలను నిరంతరం తనిఖీ చేస్తూ, అవసరం ఉన్న ప్రాంతాలకు కొరత రాకుండా సర్దుబాటు చేయాలని సూచించారు. యూరియా స్టాక్ లేదు అనే అభద్రతా భావం రైతుల్లో నెలకొనకుండా, వారి అవసరాలకు సరిపడా యూరియాను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువుల స్టాక్ కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ, వాస్తవ పరిస్థితులను తెలియచేయాలని సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసు శాఖ క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. యూరియాను అవసరానికి మించి వినియోగించకుండా, ఒకేసారి ఏకమొత్తంలో యూరియా కొనుగోలు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సహకార పరపతి సంగం ఎరువుల దుకాణం ద్వారా రైతులకు ఎరువులు సరఫరా జరుగుతున్నదని, ఎలాంటి కొరత లేదని సమృద్ధిగా అందుబాటులో ఉన్నట్లు ఏఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏఓ అనూష, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.