కవిత్వం మనసులో మెల్లగా పుట్టే భావం. అది అక్షరాల రూపంలో బయటపడతుంది కానీ దాని మూలం మాత్రం హదయం లోంచి వెలువడే స్పందన. ప్రతి కవికి తనదైన శైలి ఉంటుంది, తనదైన స్వరం ఉంటుంది, తనదైన అక్షర ప్రపంచం ఉంటుంది. మనం కొన్ని కవితలు చదివినప్పుడు అవి ఎవరి రచనో చెప్పకపోయినా ఆ పదాల నడక, ఆ భావాల వంపులు, వాక్యాల గమనం చూసి వెంటనే కవిని ఊహించగలుగుతాం. ఈ ప్రత్యేకత ఒక రచయితకు యాదచ్ఛికంగా రాదు. అది సంవత్సరాల అనుభవం, పదాలపై ఉన్న పట్టు, ఆలోచనలోని పార్శ్వాలు, భావాల లోతు, ముఖ్యంగా అక్షరాలను ఆరాధించే హదయం కలిసినప్పుడే వచ్చే శిల్పసంపద. రాయలసీమ నుడికారం, దాని ప్రత్యేకతను తన సాహిత్యయాత్రలో ముద్రగా మార్చుకుని కవిత్వాన్ని శ్వాసగా ప్రయాణం సాగిస్తున్న కవి పల్లిపట్టు నాగరాజు.
ఇప్పుడు పల్లిపట్టు నాగరాజు తన సరికొత్త కవితా సంపుటి ‘నీలికళ్ళ నేల’తో పాఠకుల ముందుకు వచ్చారు. ”నీలికళ్ళ నేల” అంటే కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు, అది ఒక భావం, ఒక అనుభూతి, ఒక మనోభూమి. ఈ సంపుటి చదివే వరకు మనకు తెలియని ఒక ‘లోపలి నేల’ను కూడా మనమందరం మనలో కనుగొంటాం.
చినుకుగా మొదలై భారీ తుఫాన్ గా వర్షం ఎలా బీభత్సాన్ని సష్టిస్తుందో అదే విధంగా పల్లిపట్టు నాగరాజు మొదటగా లేలేత పువ్వులవలె మెత్తగా మొదలై తన కవితలు ‘అణగారిన వర్గాల గుండె పగిలి ముక్కలై రోదిస్తున్న శబ్దాన్ని’ పిడుగుల్లా కురిపిస్తాయి. తన కవిత్వంలోకి వెళ్లి చూసినట్లయితే.. ”ఎప్పటికప్పుడు నన్నో కవిత్వపు తీగనుచేసి అల్లుకుంటున్న వెన్నెల ముఖం దానా..!/ ఎప్పటిలా…/ పొద్దంతా బరిచేలో కలుపు తీసి చేవదేలిన అందమైన నీ బురద చేతులను ఇప్పటికిప్పుడే ముద్దాడాలని ఉంది…!”. ఇది శరీర సౌందర్యాన్ని కాదు, శ్రమలోని అందాన్ని, ప్రేమించే భావంను తెలుపుతుంది . వెన్నెల ముఖం, బురద చేతులు ఈ రెండు విరుద్ధ బింబాలు కవితకు ఒక లోతైన భావపరంపరను అందిస్తాయి. అందం అంటే వెలుగు మాత్రమే కాదు, శ్రమ మరియు నిబద్ధతలో పుట్టే నిర్మలత కూడా అన్న భావాన్ని కవి చక్కగా వ్యక్తం చేశాడు.
‘దుఃఖమణిపురం’ అనే కవితలో కవిలోని ఆవేదనను మనం చూడొచ్చు ”వీధులన్నీ దుఃఖాన్నే కళ్ళాపుజల్లి/ దుఃఖాన్నే ముగ్గులేసుకుంటున్న/ నా దుఃఖమణిపురమా.!.” కవికి అతని అంతఃకరాణమంతా ప్రతిబింబమై కనిపించే అంతరంగం, జ్ఞాపకం, నొప్పి అన్నీ ఈ ఒక్క పదంలో కనిపించే ప్రధాన లక్షణాలు. ‘నా దుఃఖమణిపురమా!’ అని అనడంలో కవి మనసును మనముందుకు ఆవిష్కరిస్తుంది. ఇంకా ఈ కవితలో కవి ఇలా ప్రశ్నిస్తున్నాడు ”తమ పబ్బాలను గడుపుకునేకి/ తంటాలు పెట్టిన తోడేళ్లుగుంపు/ ఏ గెవిలో సుఖంగా నిద్ర పోతుందో ?”. ఇక్కడ ”తోడేళ్ల గుంపు” అనేది వ్యంగ్యమైన సామాజిక ప్రతీకగా తీసుకొని ప్రజల కష్టాల మీద, వ్యవస్థల వైఫల్యాల మీద, వేదన మీద తమ ప్రయోజనాలను కట్టుకుంటూ, శాంతిని దోచుకున్న వారి గురించి కవి ప్రశ్నించడం పాఠకుడిలో ఆలోచనను రేపి, మన సమాజం గురించి ఎన్నో సంగర్షాలను, అసమానతలను, వ్యవస్థల వ్యర్థతలను, బాధను మోసం చేసే చేతులను గుర్తుకు తెస్తాయి.
సాహిత్యంపై అతనికి ఉన్న భక్తి, అంకితభావం అతని ఒక్కో పంక్తిలోనూ పలుకుతుంది. కవిత్వాన్ని రాయడమే కాక, అందులో జీవించే కవి పల్లిపట్టు అని చెప్పొచ్చు. ‘కులం వాసన’ కవితలో ”నీ కులం వాసన ముందు/ నా కూర వాసన ఏపాటిది”. మరొక కవితలో ‘మత్తుసీసాలో మందురంగు/ యిత్తుతున్న మతం రంగు ఒకటే’. ఇలా రెండు పాదాలలోనే ఎంతో బలమైన భావాన్ని పొందుపరచగల కవి ఇతను. కేవలం పదాలు రాయడమే కాదు, ప్రతి అక్షరాన్ని అనుభూతిగా మలిచి పాఠకుడి ముందుకు తెస్తాడు. అతని కవిత్వంలోని సరళత, అదే సమయంలో కనిపించే లోతు ఇవి రెండు కలిసి ఒక బలమైన భావజాల కవిత్వంగా అనిపిస్తాయి.
”కాలానికి చెవుడయితే/ పేగులుతెగేలా అరచి మరీ చెబుదునుగాని/ నటించే బానిసకి ఏ భాసలో చెప్పగలను?/ ఎన్నితూర్లని చెప్పగలను??”.
”కాలానికి చెవుడయితే ” అనే ప్రారంభం సమాజపు మూగత్వంపై గల వ్యథను ప్రతిబింబిస్తే, ”నటించే బానిస” అన్న ఉపమానం మనిషి స్వీయ అబద్ధాల బంధాన్ని స్పష్టం చేస్తుంది. మాటలతో చేరని సత్యాన్ని ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని ప్రపంచంపై కవి చూపిన అసహనం, బాధ, నిరాశ ఇక్కడ గాఢంగా వ్యక్తమవుతాయి.
పాఠకుడు అతని కవిత చదివినప్పుడు, అది కేవలం పఠనం మాత్రమే కాదు, కళ్లముందే రాలిపోతున్న జీవితాల దశ్యాలు సాక్షాత్కారమవుతాయి. అక్షరాల గర్భంలో దాగిన ఒక శ్వాస, భావాల అంతర్లీన ప్రవాహాన్ని నిలబెట్టే నిశ్శబ్దపు అడుగుచప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది.
”నా లోపలి రగిలే/ అరణ్యాల భాషే నా కవిత్వం/ నా లోపలి దూకే/ నయాగరాల మెరుపే నా కవిత్వం”
ఈ పాదాలను చదివినప్పుడు కవి ఉపయోగించిన రెండు ప్రధాన ప్రతీకలు ‘రగిలే అరణ్యం’ మరియు ‘దూకే నయాగరాలు’ అంతరంగ ప్రపంచానికి బలమైన రూపకాలుగా నిలుస్తాయి. రగిలే అరణ్యం అనే ఉపమానం మనిషి లోపల కొలతలేని అసంతప్తి, దహనమయ్యే ఆవేశం, తన్ను తానే భస్మం చేసుకునే అంతర్మథనం. ఈ పోలికలు కవిత్వానికి కేవలం అందాన్ని మాత్రమే కాదు, అంతరంగ వికాసం, స్వీయవ్యాఖ్యానానికి ఒక గాఢమైన తాత్విక బలం కూడా అందిస్తున్నాయి. కవి లోపలి ప్రకతి ఎంత శక్తివంతంగా ఉంటే, ఆ సజన కూడా అంతే ఘనంగా మారుతుందని ఈ పాదాలు సూచిస్తున్నాయి.
‘నీలికళ్ళ నేల’ పల్లిపట్టు నాగరాజు కవితా పయనంలో ఒక కొత్త అధ్యాయం మాత్రమే కాదు పాఠకుల హదయాల్లో కొత్తగా పూసే ఒక నీలి పువ్వుల తోట కూడా. కవిత్వానికి కొత్తదనం కావాలంటే, ఆనందానికి సున్నితత్వం కావాలంటే, భావాలకు ఒక ప్రతిధ్వని కావాలంటే ఈ సంపుటి తప్పక చదవాల్సిందే.
- గాజోజి శ్రీనివాస్, 9948483560


