అమెరికాపై మండిపడిన జిన్‌పింగ్
బీజింగ్ : అంతర్జాతీయ వ్యవహారాలలో అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, బెదిరింపులకు పాల్పడు తోందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మండిపడ్డారు. ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలన్నీ అంతర్జాతీయ చట్టాన్ని, ఐరాస ఛార్టర్ సూత్రాలను గౌరవించాలని హితవు పలికారు. వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా దళాలు అపహరించిన నేపథ్యంలో జిన్‌పింగ్ సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. బీజింగ్‌లో ఐరిష్ ప్రధాని మైకెల్ మార్టిన్‌తో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇతర దేశాల ప్రజలు ఎంచుకున్న అభివృద్ధి పంథాను అన్ని దేశాలు గౌరవించాలి. అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉండాలి. ఐరాస ఛార్టర్ సూత్రాలు, ఉద్దేశాలను గౌరవించాలి. ముఖ్యంగా శక్తివంతమైన దేశాలన్నీ ఈ విషయంలో ముందుండాలి’ అని చెప్పారు. ప్రపంచ క్రమం ఇబ్బందులు ఎదుర్కొంటోందని జిన్‌పింగ్ హెచ్చరించారు. మార్పులు, గందరగోళానికి లోనవుతున్న ప్రపంచంలో ఏకపక్ష, బెదిరింపు చర్యలు అంతర్జాతీయ క్రమాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. కాగా వెనిజులాపై అమెరికా సైనిక చర్యను చైనా ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. ప్రపంచ పోలీసులా లేదా అంతర్జాతీయ న్యాయమూర్తిలా వ్యవహరించే అధికారం ఏ దేశానికీ లేదని చైనా సీనియర్ అధికారులు వ్యాఖ్యానించారు. బీజింగ్‌లో జరిగిన చైనా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల ఏడో విడత వ్యూహాత్మక చర్చల సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ అమెరికా చర్యను తీవ్రంగా విమర్శించారు. ‘చైనా ఎల్లప్పుడూ బలప్రయోగాన్ని వ్యతిరేకిస్తుంది. ఒక దేశం యొక్క అభిప్రాయాన్ని మరో దేశంపై రుద్దడాన్ని కూడా వ్యతిరేకిస్తుంది’ అని ఆయన అన్నారు. మదురో అరెస్టుపై వ్యాఖ్యానిస్తూ వెనిజులాలో చోటుచేసుకున్న ఆకస్మిక మార్పు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. మదురోను, ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలని చైనా ఇప్పటికే డిమాండ్ చేసింది. అమెరికా చర్య అంతర్జాతీయ చట్టాన్ని, ఐరాస ఛార్టర్‌ను ఉల్లంఘిస్తోందని విమర్శించింది.
ఏకపక్షంగా వ్యవహరిస్తూ బెదిరిస్తున్నారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



