తెల్ల బంగారాన్నైన నన్ను.. నల్లగున్నవని కొంటలేరు
అష్టకష్టాలు పడి మార్కెట్‌కు తెస్తే.. కొర్రీలు
నాకు ప్రాణం పోసిన అన్నదాతను ఆదుకోండి
ఓ పత్తి పంట మనస్సులోని మాట..
నవతెలంగాణ-గజ్వేల్
‘అయ్యా.. నేను దూదిని. నన్ను రైతులు తెల్ల బంగారం అని సంబరపడతరు. దేశదేశాల ఖ్యాతిని గడించాను. వేదికలపై, సమావేశాల్లో నా గురించి ప్రస్తావించినప్పుడల్లా నాగుండె ఉప్పొంగుతుంది. నన్ను నమ్మి నాకు ప్రాణం పోస్తున్న రైతన్నకు నేను ఆర్థిక భరోసాను ఇస్తుంటాను. నేను మనసారా నవ్వుతుంటే.. నన్ను చూసి నా రైతు కూడా మురిసిపోతుంటాడు. కానీ నేడు నా వల్లే నా రైతు కన్నీరు పెడుతున్నాడు. గుప్పెడు ఆశతో నన్ను మార్కెట్‌కు తీసుకు వస్తే.. తేమ, పింజ పొడవు, నాణ్యత ప్రమాణాలు అంటూ కొర్రీలు పెడుతూ.. నేను పనికిరాను అని చెబుతుంటే.. నాతో పాటు నా రైతు గుండెల్లో ఓ గునపం దించినట్టు అవుతున్నది. నేనేంటో.. రైతు నా కోసం పడే కష్టమే మిటో..? ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడే తీరేంటో ..? అందరికీ తెలిసిందే.. ఇన్ని తట్టుకుని మార్కెట్‌కు వస్తే నన్ను అవమానించడం.. నా రైతును ఏడిపించడం మీకు తగునా’ అంటూ పత్తికుప్పలు ఈ సమాజాన్ని ప్రశ్నిస్తు న్నాయి. ఓ రైతు గుండె ఈ పాలకులను నిలదీస్తున్నది.
తేమను నేనేమన్న తీసుకొచ్చిన్నా..
16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే.. నేను ఏమైనా తేమను తీసుకొచ్చానా.. ఇందులో నా తప్పేముంది. తేమ 8 నుంచి 12 శాతం అంటారు..? ఎలా సాధ్యం.. రైతు పరిస్థితి, ఉష్ణోగ్రత పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించారా..? సీసీఐ పెట్టే కొర్రీలు వ్యాపారులకు కలిసి వస్తున్నాయి. ఎకరాకు రైతుకు రూ25వేలు పై చిలుకు పెట్టుబడి పెడితే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.8110 వస్తుంది. కాగా తేమ పేరిట కోత పడగా వచ్చేది రూ.7 వేలే.. ప్రయి వేటు (దళారి) వ్యాపారి చేతికిపోతే రూ.6 వేలు రావడం కూడా గగనమే.. తప్పు ఎక్కడుందో నేతలు ధరిస్తున్న దుస్తుల ధారమైన నాపరిస్థితిని మీరైనా అర్థం చేసుకోవాలి.. రైతుకు న్యాయం చేయాలి. 70 రోజుల పాటు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాల వల్ల నా రంగు మారుతున్నది. తెలుపు రంగులో ఉండే నేను నలుపు గా మారుతున్నా. ప్రకృతి ప్రకోపానికి నేనేం చేయగలను. ఇవేం పట్టకుండా నన్ను(పత్తి) నమ్ముకున్న నా అన్నదాతను ఎందుకు కన్నీటిపాలు చేస్తున్నారు.
నా మాట వినండి..
సీసీఐ ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలు ఒక్కొక్క దానికి ఐదుగురు సిబ్బందిని చొప్పున జీతభత్యాలు. మార్కెట్ కమిటీకి సెస్ రూపంలో వచ్చే ఆదాయం రావాలనే కదా. అన్నీ తెలిసిన ఎంపీలు, ఎమ్మెల్యే లు నాపై ఎందుకు కనికరించి తోడ్పడటం లేదో నాకు అర్థం కావడం లేదు.. లేనిపోని నిబంధనలతో తోడు నీడనైనా రైతులకు అన్యాయం చేయొ ద్దని వేడుకుంటున్నా.. అంటూ ఓ పత్తి చేను రైతన్న గోసను ఈ పాలకుల దృష్టికి తేవాలనుకుంటున్నది. ఈ మాటలు రాని పత్తి అంతర్మథనాన్ని అర్థం చేసుకోనైనా పాలకులు రైతులకు అండగా నిలవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
స్లాట్ బుకింగ్ తలకు మించిన భారం
స్లాట్ బుకింగ్ ఎవరికి చేయవస్తది. కేంద్రం ఎందుకు పెట్టింది. పండించిన పంట మొత్తం కొనాలి కదా. ఏడు క్వింటాళ్లే కొంటమంటే ఎలా? ఇది మాలాంటి రైతును ఇబ్బంది పెట్టడమే.
-రేణుక, మహిళా రైతు
కేంద్ర సర్కారు తీరు బాగాలేదు
నాకు చదువు రాదు.. ఎట్లా బుక్ చేయాలి. మళ్లా ఒక్కరిని తోడు తెచ్చుకోవాలి. పోయిన సంవత్సరం బాగుండే. ఇదేం కష్టం. పంట పండించినప్పుడు కష్టం.. అమ్మాలంటే కష్టం.. తల పట్టుకుంటున్నాం అమ్ముకోవాలంటే.. పాత పద్ధతిలోనే కొనండి.
కిష్టయ్య, రైతు



