అమెరికా, ఇజ్రాయిలదే మధ్యవర్తిత్వ బాధ్యత
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్
టెహ్రాన్: మిసైళ్లు, రాకెట్లు, బాంబులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్, ఏమాత్రం తగ్గకుండా, ప్రతి దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్, అజర్‌బైజాన్, ఒమన్‌పైనా విరుచుకుపడింది. అటు ఇరాన్ నాయకత్వాన్ని లొంగిపోవాలని ఇజ్రాయిల్-అమెరికా హెచ్చరించినా వినకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇరాన్ ప్రజలను తక్కువగా అంచనా వేసి ఈ ఉద్రిక్తతలకు నాంది పలికింది అమెరికా, ఇజ్రాయిలే అని ఇరాన్ అధ్యక్షుడు అధ్యక్షుడు పెజెష్కియన్ ఆరోపించారు. ”ఇరాన్ ప్రజలను తక్కువగా అంచనా వేసినవారే ఈ సంఘర్షణకు నిప్పంటించారు. కాబట్టి మధ్యవర్తిత్వం చేయాలంటే ముందుగా వారితోనే మాట్లాడాలి” అని ఆయన పోస్టులో పేర్కొన్నారు.
పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా చూడాలంటే అసలు సమస్యను సృష్టించినవారే బాధ్యత తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వం చేయాలంటే అసలు ఈ ఘర్షణకు కారణమైన దేశాలపైనే దృష్టి పెట్టాలని అన్నారు. మరోవైపు ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేస్తామని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్-(ఐడీఎఫ్) ప్రకటించింది. ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో గత 100 గంటల్లో ఇరాన్‌లోని 750కి పైగా ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించినట్టు తెలిపింది. ఇరాన్‌లోని ప్రస్తుత నాయకత్వాన్ని, సైనిక సామర్థ్యాలను మరింతగా దెబ్బతీయడమే తమ లక్ష్యమని ఐడీఎఫ్ చెప్పింది.



