ఇజ్రాయిల్ దళాల దుశ్చర్య
ఇద్దరు పాలస్తీనియన్లు మృతి
ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్
అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత
జెరూసలేం : పాలస్తీనాపై ఇజ్రా యిల్ అణచివేత కొనసాగుతున్నది. వెస్ట్‌బ్యాంక్‌లో ఉద్రికతలు మళ్లీ ముదురుతున్న వేళ.. ఇజ్రాయిల్ దళాలు మరో దుశ్చర్యకు పాల్పడ్డాయి. చేతులు ఎత్తి లొంగిపోయిన ఇద్దరు పాలస్తీ నియులను ఇజ్రాయిల్ దళాలు కాల్చి చంపాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. అరబ్ న్యూస్ ఛానెళ్లలో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. దీంతో ఇజ్రాయిల్ సైన్యం అమానవీయ తీరు పట్ల అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ ఘటనపై పాలస్తీనా ఆగ్రహం వ్యక్తం చేయగా… ఇజ్రాయిల్ విచారణకు ఆదేశించింది.
వీడియోలో ఏముంది?
ఇజ్రాయిల్ దళాలు జరిపిన దుశ్చర్యకు సంబంధించిన వీడియోలు.. ఘటన జరిగిన విధానాన్ని స్పష్టంగా చూపెడుతున్నాయి. ఇజ్రాయిల్ దళాల కఠిన మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఇద్దరు పాలస్తీనియులు సరెండర్ అయిన తర్వాత కూడా ఇజ్రాయిల్ దళాలు కాల్పులు జరిపినట్టు వీడియోలో ఉన్నది. గ్యారేజ్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరు చేతులు పైకెత్తి, తమ వద్ద ఆయుధాలు లేవని చూపించడానికి తమ చొక్కాలను పైకి ఎత్తారు. ఆ తర్వాత పోలీసులు వారిని నేలపై కూర్చోబెట్టారు. కాలితో తన్నారు. తర్వాత వారిని మళ్లీ గ్యారేజ్ లోపలికి పంపారు. అనంతరం సైనికులు వారిని చుట్టుముట్టగా.. వెంటనే కాల్పుల శబ్దం వినిపించింది. ఇద్దరూ అక్కడికక్కడే కుప్పకూలారు. ఈ ఘటనలో ఓ సైనికుడు కాల్పులు జరిపినట్టుగా కనిపిస్తోంది.
అంతర్జాతీయ మానవ చట్టం ఉల్లంఘన : పాలస్తీనా
ఈ ఘటనపై పాలస్తీనా ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ఈ కాల్పులు అంత ర్జాతీయ మానవ చట్టా నికి వ్యతిరేకంగా జరిగిన ‘అక్రమ హత్య’లుగా అభివర్ణిం చింది. కాగా ఇజ్రాయిల్ తీరుపై పాలస్తీ నియన్లు, మానవ హక్కుల సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి దర్యాప్తులు చాలా తక్కువ ఫలితాలను ఇస్తాయని అంటున్నాయి. ఇజ్రాయిల్ దళాలపై చాలా అరుదుగా విచారణ జరుగుతుందని చెప్తున్నాయి. కాగా చనిపోయిన వారిని అల్-ముంతసిర్ అబ్దుల్లా (26), యూసుఫ్ అసాసా (37) గా పాలస్తీనా అధికారులు గుర్తించారు. వారి మృతదేహాలను ఇజ్రాయిల్ తీసుకెళ్లిందని చెప్పారు.
లెబనాన్‌పై ఇజ్రాయిల వైమానిక దాడులు
ఇటు లెబనాన్ పైనా ఇజ్రాయిల్ విరుచుకు పడుతున్నది. లెబనాన్ దక్షిణ ప్రాంతాలపై గురువారం మరోసారి వైమానిక దాడులు జరిపింది. హెజ్బోల్లా తిరిగి శక్తివంతం కాకుండా ఉండడమే తమ లక్ష్యమని చెప్తున్న ఇజ్రాయిల్.. ఇలాంటి దాడులకు పాల్పడుతుండటం గమనార్హం. ఐక్యరాజ్య సమితి ప్రకారం.. గతేడాది అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత లెబనాన్‌లో ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 127 మంది పౌరులు మరణించారు. ఇందులో చిన్నారులూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పోప్ లియో 14 ఆదివారం లెబనాన్ పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
దళాలు సరిగ్గానే వ్యవహరించాయి : ఇజ్రాయిల్ మంత్రి
ఇజ్రాయిల్ తమ తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ ఇద్దరూ జెనిన్ ప్రాంతానికి చెందిన ‘వాంటెడ్ మిలిటెంట్లు’గా ఆరోపించింది. వీరు ముందుగా సైనికులపై పేలుడు పదార్థాలను విసిరారనీ, కాల్పులు జరిపారని ఇజ్రాయిల్ సైన్యం వివరించింది. అయితే ఆ ఇద్దరు లొంగిన తర్వాత కూడా జరిగిన కాల్పులపై సమీక్ష జరుగుతోందని సైన్యం ప్రకటించింది. ఇజ్రాయిల్ మంత్రి ఇతమార్ బెన్-గ్వీర్ మాట్లాడుతూ… ‘ఉగ్రవాదులు చనిపోవాలి.. దళాలు సరిగ్గా పని చేశాయి” అని అన్నారు. ఇజ్రాయిల్ సైనికులను ప్రశంసించారు.
వెస్ట్‌బ్యాంక్‌లో ఉద్రిక్తతలు
తాజా కాల్పులు వెస్ట్‌బ్యాంక్ ఉత్తర భాగంలో జరుగుతున్న విస్తృత ఆపరేషన్‌లో భాగంగా జరిగాయి. మంగళవారం నుంచి టుబాస్ ప్రాంతంలో వంద మందికి పైగా పాలస్తీనియుల అరెస్టులు
జరిగినట్టు పాలస్తీనా ప్రిజనర్స్ క్లబ్ తెలిపింది. 2023 అక్టోబర్ 7న తర్వాత నుంచి ఇజ్రాయిల్ వెస్ట్‌బ్యాంక్‌లో తన ఆపరేషన్‌లను మరింతగా పెంచింది. ఇటీవల సెటిలర్ల హింస కూడా పెరుగుతోందని పాలస్తీనియులు చెప్తున్నారు.
గాజాలో కొనసాగుతున్న మారణహోమం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన
గాజాలో పాలస్తీ నియన్లపై ఇజ్రాయిల్ ఇప్పటికీ మారణ హౌమానికి పాల్పడు తోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పష్టం చేసింది. గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. ఇజ్రాయిల్ గాజాలో మారణ హౌమం కొనసాగిస్తోందని పేర్కొంది. ఇజ్రాయిల్, హమాస్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంలో సున్నితమైన కాల్పుల విరమణ రెండేండ్ల యుద్ధం తర్వాత అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వచ్చింది. ”కాల్పుల విరమణ గాజాలోని ప్రజల జీవితం సాధారణ స్థితికి చేరుకుంటుందనే ప్రమాదకరమైన భ్రమను సృష్టించే అవకాశం ఉంది ” అని ఆమ్నెస్టీ చీఫ్ ఆగెస్ కల్లామర్డ్ పేర్కొన్నారు. ” ఇజ్రాయిల్ ప్రభుత్వం, సైన్యం తమ దాడుల స్థాయిని తగ్గించి, గాజాలోకి పరిమిత మొత్తంలో మానవతా సాయాన్ని అనుమ తించినప్పటికీ.. ప్రపంచం మోసపో కూడదు.
ఇజ్రాయిల్ మారణ హౌమం ముగియలేదు” అని అన్నారు. దేశాన్ని, జాతిని, జాతిసంబంధమైన లేదా మతపరమైన సమూహాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో చేసే ఐదు చర్యలలో ఏచర్యనైనా ‘మారణహౌమం’ గానే పరిగణించాలని 1948 ఐక్యరాజ్యసమితి నిర్వచించింది. గాజాలోని పాలస్తీనియన్ల భౌతిక విధ్వంసానికి దారితీసేలా ఉద్దేశపూర్వకంగా జీవన పరిస్థితులపై ఆంక్షలు విధించడం సహా .. మూడు చర్యల ద్వారా ఇజ్రాయిల్ గాజాలో మారణహౌమానికి పాల్పడుతోందని 2024 డిసెంబర్‌లో, ఆమ్నెస్టీ తేల్చింది. గురువారం ఈ నివేదికను నవీకరిస్తూ ఈ విధంగా వెల్లడించింది.
”పౌర జనాభా మనుగడకు అవసరమైన సామగ్రి, సేవల పునరుద్ధరణపై ఇజ్రాయిల్ ఆంక్షలు విధిస్తూనే ఉంది. దాడుల స్థాయి తగ్గినప్పటికీ, కొంత పరిమిత మెరుగుదల ఉన్న ప్పటికీ, గాజాలో పాలస్తీ నియన్లపై ఇజ్రాయిల్ అమలు జరుపుతున్న విధానాల్లో అర్థవంతమైన మార్పు లేదు. ఇజ్రాయిల్ ఉద్దేశం మారిందని సూచించడానికి ఎటువంటి ఆధారాలూ లేవు”. ”గాజాలో ఇజ్రాయిల్ ప్రవర్తనా విధానం, పాలస్తీనియన్ల ప్రాణాలను రక్షించే సహాయాన్ని ఉద్దేశపూర్వకంగా, చట్టవిరుద్ధంగా తిరస్కరించడం సహా వీరిలో చాలా మంది గాయపడ్డారు, పోషకాహార లోపంతో ఉన్నారు. తీవ్రమైన వ్యాధుల ప్రమాదంలో ఉన్నారు. వారి మనుగడకు ముప్పు కలిగిస్తూనే ఉన్నారు” అని కల్లామర్డ్ పేర్కొన్నారు.
ఇజ్రాయిల్ దాష్టీకంపై ఐక్యరాజ్యసమితి నిర్ధారణ
సెప్టెంబర్ 2025లో, ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్ ”గాజాలో మారణ హౌమం జరుగుతోంది. 1948 మారణహౌమం జాబితా చేసిన అక్టోబర్ 2023 నుంచి ఇజ్రా యిల్ ప్రభుత్వం, దళాలు ‘ఐదు జాతి విధ్వంసక చర్యల్లో నాలుగు” చర్యలకు పాల్పడ్డాయి” అని దర్యాప్తులో తేల్చింది.



