Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeమానవిఅధ్యాపక వృత్తికి ద‌క్కిన గౌర‌వం ఇది

అధ్యాపక వృత్తికి ద‌క్కిన గౌర‌వం ఇది

- Advertisement -

అధ్యాపకులంటే సమాజాన్ని తీర్చిదిద్దే మేధావులు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు సమాజంలో మంచి పౌరులుగా ఎలా మెలగాలే చెప్పే గురువులు. సరైన సౌకర్యాలు లేకున్నా సమస్యలనే సవాలుగా స్వీకరించి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేసే మార్గదర్శకులు. మన సమాజానికి భావిభారతాన్ని అందించే హహోన్నతులు. ఇలా నేడు చాలా మంది గురువులు వారి పాత్రను పోషిస్తున్నారు. అలాంటి వారిలో కొండ కవిత ఒకరు. విద్యార్థులను ఆర్థిక శాస్త్రం(ఎకనామిక్స్‌)లో ప్రతిభావంతులగా తీర్చిదిద్దుతున్నారు. ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధ్యాపకురాలిగా రాష్ట్ర పురస్కారం అందుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

మీ కుటుంబ నేపథ్యం..?
నల్లగొండ పట్టణంలో పుట్టి పెరిగాను. అమ్మ కొండ సత్తమ్మ. నాన్న లచ్చయ్య(ఫిజికల్‌ డైరెక్టర్‌), నల్లగొండలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్‌ కాలేజీలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. నల్లగొండలోని లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్లో 10వ తరగతి, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌, ఉమెన్స్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. నాకు ఇద్దరు అన్నలున్నారు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగానే విధులు నిర్వహిస్తున్నారు. 1995లో నాగర్‌ కర్నూల్‌కు చెందిన జీవశాస్త్రం లెక్చరర్‌ వేముల శ్రీధర్‌ గౌడ్‌తో నా వివాహం జరిగింది. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి నాగసాయి అభిషేక్‌ సోషల్‌ మీడియాలో ఎంబీఏ పూర్తి చేశాడు. రెండో అబ్బాయి అభిరామ్‌గౌడ్‌ సిద్దిపేట ఎస్‌ఎంఎస్‌ మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌ పూర్తి చేశాడు.

అధ్యాపక వృత్తిలోకి ఎలా వచ్చారు?
నాకు మొదటి నుండి ఆర్థిక శాస్త్రం(ఎకనామిక్స్‌)అంటే ఇష్టం. హైదరాబాదులోని కోటి ఉమెన్స్‌ కాలేజీలో ఎకనామిక్స్‌ పూర్తి చేశాను. తర్వాత ఏడాదిలోనే 1995లో కాలేజ్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ పడింది. రాత పరీక్షల్లో ఎకనామిక్స్‌ అధ్యాపకురాలుగా ఎంపికయ్యాను. 1996లో అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్‌ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలోని గురుకుల జూనియర్‌ కళాశాలలో ఆర్థిక శాస్త్రం (ఎకనామిక్స్‌) అధ్యాపకురాలిగా విధులు ప్రారంభించాను. 2016లో హైదరాబాదులోని నాగోల్‌లోని కులీకూతుబుషా మైనార్టీ గురుకులం ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించాను. గురుకులం సొసైటీ కింద రెండే జూనియర్‌ కళాశాలలు సర్వేలుతోపాటు హసనపర్తిలో ఉండడంతో అక్కడికి బదిలీ అయ్యాను. హసనపర్తి బాలికల జూనియర్‌ కళాశాలలో 2016 నుంచి 2025 వరకు విధులు నిర్వహించాను.

మీకు ప్రోత్సాహం ఎవరు?
ఆడవాళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని మా అమ్మ ఎంతో తపన పడేది. ఎలాగైనా మా అమ్మ కోరిక తీర్చాలనుకున్నాను. ఆ ఆలోచన నాలో మరింత పట్టుదల పెంచింది. ఎట్లాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని తపనతో బాగా చదివేదాన్ని. దీనికి తోడు మా నాన్న, అన్నలు, అత్తవారింటి తరఫున మామ, భర్త, ఆడపడుచు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో మరింత ప్రోత్సాహం దొరికింది. అమ్మ కోరికకు తోడు అన్నలు, భర్త సహకారం తోడైంది. ఆర్థిక శాస్త్రంలో ఎమ్మే పూర్తి చేయడంతో 1995లో కాలేజ్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ పడడంతో రాత పరీక్ష రాసి ఎకనామిక్స్‌ లెక్చరర్‌గా ఎంపికయ్యాను.

ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికవ్వడం ఎలా అనిపిస్తుంది?
చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్రం నుండి వివిధ విభాగాలకు చెందిన 120 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నుండి 49 మంది ఉన్నారు. గురుకుల సొసైటీ నుండి ముగ్గురు ఎంపికయ్యారు. విద్యార్థులు ఎకనామిక్స్‌లో 100శాతం ఉత్తీర్ణత సాధించినందుకు ఒకరిని ఉత్తమ అధ్యాపకురాలుగా ఎంపిక చేశారు. ఆ ఒక్కరు నేనే కావడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మా గురుకుల సొసైటీలో ప్రమోషన్లు ఉండవు. కనుక దీన్నే నేను గొప్ప ప్రమోషన్‌గా భావిస్తున్నాను. ఈ ఆవార్డు రావడం అధ్యాపక వృత్తికి దక్కిన అత్యంత గౌరవంగా భావిస్తున్నాను. సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని శిల్ప కళావేదిక ఆడిటోరియం (శిల్పారామం)లో నిర్వహించిన కార్యక్రమంలో స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ చేతుల మీదగా అవార్డు అందుకున్నాను. ఈ 29 ఏండ్ల కాలంలో నా విద్యార్థులు 100శాతం ఫలితాలు సాధించారు. 60 మంది చార్టెడ్‌ అకౌంట్‌గా తయారయ్యారు. అనేక మంది విద్యార్థులు స్వదేశ, విదేశాల్లో మేనేజర్లుగా విధులు నిర్వహిస్తూ సమాజానికి సేవలు అందిస్తున్నారు. ఇటీవల గ్రూప్‌2 కు అజిం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసానికి ఎంపికయ్యారు. గురుకుల విద్యార్థులకు జనరల్‌ నాలెడ్జ్‌ పెంపొందించేందుకు ‘నాలెడ్జ్‌ స్కోప్‌’ అనే పుస్తకాన్ని కూడా రాశాను.

  • చిలువేరు అంజయ్య, నవతెలంగాణ, సంస్థాన్‌ నారాయణపురం.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad