Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeఆటలురష్యాకు అలా.. ఇజ్రాయిల్‌కు ఇలా!

రష్యాకు అలా.. ఇజ్రాయిల్‌కు ఇలా!

- Advertisement -

– ప్రపంచ క్రీడా సమాఖ్యల ద్వంద్వ వైఖరి
– గాజాలో క్రీడా సదుపాయాలపై దాడులు
– అయినా ఇజ్రాయిల్‌పై చర్యలకు వెనకడుగు

ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం మొదలైంది. రోజుల వ్యవధిలోనే రష్యాపై ప్రపంచ క్రీడా సంఘాలు నిషేధం విధించాయి. రష్యాతో పాటు బెలారస్‌ అథ్లెట్లపై ఆంక్షలు వేశారు.
అక్టోబర్‌ 2023లో గాజాపై ఇజ్రాయిల్‌ యుద్ధం మొదలెట్టింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. గాజా, వెస్ట్‌బ్యాంక్‌లో క్రీడా మైదానాలు, మౌళిక సౌకర్యాలను నిర్వీర్యం చేసింది. వందలాది మంది క్రీడాకారులను చంపేసింది. అయినా, ఇజ్రాయిల్‌పై చర్యలు తీసుకునేందుకు ప్రపంచ క్రీడా సమాఖ్యలు వెనకాడుతున్నాయి?
రాజకీయాలు, క్రీడలను ముడిపెట్టవద్దు.
ఏ పరిస్థితుల్లోనైనా క్రీడలను ప్రత్యేకంగానే పరిగణించాలి. కానీ ఈ విషయంలో రష్యాకు ఒక రూల్‌ ఇజ్రాయిల్‌కు మరొక రూలా?
ఎందుకీ ద్వంద్వ వైఖరి?!

శ్రీనివాస్‌ దాస్‌ మంతటి
662
ఇజ్రాయిల్‌ దాడిలో (అక్టోబర్‌ 2023 నుంచి) ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనా క్రీడాకారులు, కుటుంబ సభ్యులు.
321
ఇజ్రాయిల్‌ దాడిలో దుర్మరణం చెందిన ఫుట్‌బాల్‌ క్రీడాకారులు, కోచ్‌లు, అడ్మినిస్ట్రేటర్లు, రిఫరీలు, క్లబ్‌ సభ్యులు.
278
ఇజ్రాయిల్‌ వైమానిక దాడిలో ధ్వంసమైన క్రీడా మైదానాలు, స్పోర్ట్స్‌ క్లబ్‌ హౌస్‌లు. ఇందులో 268 గాజా మైదానాలే. పాలస్తీనా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యాలయం సైతం దాడిలో ధ్వంసమైంది.
మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో క్రీడాకారులు, క్రీడా మైదానాలు, స్పోర్ట్స్‌ మౌలిక సదుపాయాలపై దాడులు చేసిన దాఖలాలు ఏమీ లేవు. అయినా, ప్రపంచ క్రీడా సమాఖ్యలు అంతరాత్జీయ క్రీడా పోటీల్లో పాల్గొనకుండా రష్యాపై నిషేధం విధించాయి. ఇజ్రాయిల్‌పై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా.. కాలయాపన చేస్తున్నాయి.
రష్యా, ఇజ్రాయిల్‌ అంశంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ఫుట్‌బాల్‌ (ఫిఫా), యూనియన్‌ ఆఫ్‌ యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్స్‌ (యుఈఎఫ్‌ఏ)లు ద్వంద్వ వైఖరి పాటించటంలో రాజకీయ కారణాలే కనిపిస్తాయి.

రష్యాపై అత్యుత్సాహం
2022 ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఆరంభమైంది. రోజుల వ్యవధిలోనే ఫిఫా, యుఈఎఫ్‌ఏ రష్యాపై వేటు వేశాయి. రష్యాతో ఫుట్‌బాల్‌ ఆడేందుకు యూరోపియన్‌ ఫెడరేషన్లు (పొలాండ్‌, స్వీడన్‌, చెక్‌ రిపబ్లిక్‌) నిరాకరించాయి. ఒలింపిక్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ రష్యా, బెలారస్‌ అథ్లెట్లపై నిషేధం విధించాలని ప్రపంచ క్రీడా సమాఖ్యలను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఆదేశించింది. ఇదే ఇజ్రాయెల్‌ అంశంలో అటు ఫిఫా, అటు ఐఓసీ చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. అక్టోబర్‌ 2023 నుంచి ఇజ్రాయెల్‌ దాడిలో 662 మంది క్రీడాకారులు ప్రాణాలు కోల్పోయారు, క్రీడా మైదానాలు ధ్వంసమైనవని పాలస్తీనా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (పీఎఫ్‌ఏ) ఫిఫా, యుఈఎఫ్‌ఏకు విన్నవించింది. ఇజ్రాయిల్‌పై చర్యలు తీసుకోవాలని 2014 నుంచి కోరుతుంది. ఒలింపిక్‌ స్ఫూర్తికి ప్రత్యక్షంగా విఘాతం కలిగినా.. వేగంగా చర్యలు తీసుకోకుండా పీఎఫ్‌ఏ వినతిని క్రమశిక్షణ సంఘానికి సిఫారసు చేసి చేతులు దులుపుకున్నాయి. చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణ సంఘానికి ఎటువంటి కాల పరిమితి నిర్దేశించలేదు.

బౌగోళిక రాజకీయ ప్రభావం
క్రీడలు, రాజకీయాలను వేరుగా చూడాలని క్రీడా సమాఖ్యలు కోరుతున్నాయి. రష్యా అంశంలో క్రీడా సమాఖ్యలు అవసరం లేకపోయినా స్పందించాయి. ఇదే ఇజ్రాయిల్‌ విషయాన్ని క్రీడా సంఘాలు క్లిష్టమైన రాజకీయ సమస్యగా చూడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పాలస్తీనా పక్షాన నిలబడేందుకు క్రీడా సమాఖ్యలు తటపటాయిస్తున్నాయి. ఐఓసీ, ఫిఫా, యుఈఎఫ్‌ఏ వివక్ష పూరిత వైఖరిని ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు ఎండగడుతున్నారు. పాలస్తీనా పీలే సులేమాన్‌ మరణంపై యుఈఎఫ్‌ఏ చేసిన ట్వీట్‌పై ఫుట్‌బాల్‌ స్టార్‌ మహ్మద్‌ సలా వేలేత్తి చూపాడు. ఎక్కడ, ఎలా, ఏ పరిస్థితుల్లో సులేమాన్‌ చనిపోయాడనే వివరాలు సైతం చెప్పాలని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించాడు. దీంతో పాలస్తీనాలో క్రీడాకారులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు, మానవ హక్కుల ఉల్లంఘన మరోసారి చర్చనీయాంశమైంది. అగ్రరాజ్యం అమెరికా సహా పశ్చిమ దేశాలతో ఇజ్రాయెల్‌ మంచి సంబంధాలు కలిగి ఉంది. ఫుట్‌బాల్‌, క్రీడా సమాఖ్యల్లో ఇజ్రాయిల్‌తో స్నేహంగా మెలిగే ఆఫీస్‌ బేరర్లు ఉన్నారు. దీంతో ఆ దేశంపై చర్యలు తీసుకునేందుకు కాలయాపన చేస్తున్నారు.
అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) చార్టర్‌ ప్రకారం, ఫిఫా ఆర్టికల్‌ 3 ప్రకారం (మానవ హక్కులు), యుఈఎఫ్‌ఏ ఆర్టికల్‌ 11 ప్రకారం (వివక్ష లేని) ఇజ్రాయిల్‌పై నిషేధం విధించేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అయినా స్వతంత్ర కమిటీ విచారణ, క్రమశిక్షణ సంఘం నివేదిక, రాజకీయ సున్నితత్వం, తటస్థ వైఖరి అంటూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ, ఫిఫా తమ సమగ్రతను ప్రశ్నార్థకం చేసుకుంటున్నాయి.

పాలస్తీనా పీలే హత్య
పాలస్తీనా పీలేగా పిలువబడే సులేమాన్‌ ఆల్‌ ఒబెద్‌ ఆగస్టు 6న గాజాలో ఇజ్రాయెల్‌ దాడిలో దారుణంగా చంపబడ్డాడు. గాజా హుమానిటేరియన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని శిబిరంలో ఆహారం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇజ్రాయిల్‌ సైనికులు కాల్చి చంపారని తెలుస్తోంది. సులేమాన్‌కు ఐదుగురు పిల్లలు, భార్య ఉన్నారు. ఈ దాడిలో సులేమాన్‌తో పాటు మరో 18 మంది ప్రాణాలను ఇజ్రాయిల్‌ సైన్యం బలితీసుకుంది. 41 ఏండ్ల సులేమాన్‌ ప్రొఫెషనల్‌ ఫుల్‌బాల్‌లో 100కు పైగా గోల్స్‌ చేశాడు. 1984 మార్చి 24న గాజాలో జన్మించిన సులేమాన్‌.. 2007లో పాలస్తీనా తరఫున జాతీయ జట్టుకు అరంగేట్రం చేశాడు. నేషనల్‌ టీమ్‌కు 24 మ్యాచుల్లో ఆడిన సులేమాన్‌ రెండు గోల్స్‌ కొట్టాడు. 2010 వెస్ట్‌ ఆసియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ చాంపియన్‌షిప్‌లో యెమన్‌పై సీసర్‌-కిక్‌ గోల్‌ సులేమాన్‌ కెరీర్‌లో ప్రత్యేకం. మైదానంలో సులేమాన్‌ నైపుణ్యం, ప్రతిభతో అభిమానులు అతడిని ముద్దుగా పాలస్తీనా పీలేగా పిలుచుకునేవారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img