Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుఇదేం రాజకీయం!

ఇదేం రాజకీయం!

- Advertisement -

జనం గోస పట్టించుకోరేం వరదలు, ఎరువుల సమస్యల్లో ప్రజలు
స్థానిక ఎన్నికలపై ఎవరి గోలవారిదే..
బీఆర్‌ఎస్‌లో కుటుంబగోల
బీజేపీలో తప్పించుకు తిరిగే ధోరణి
కాంగ్రెస్‌లో ఓట్లు, సీట్ల వేట
జనం మధ్య తిరుగుతోంది కమ్యూనిస్టులే

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో రాజకీయపార్టీలు దారితప్పుతున్నా యి. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా నిలవడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. రాష్ట్రం కేంద్రాన్ని తప్పుపడుతోంది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ కుటుంబ కలహాలతో జనం నోట్లో నానుతుందే తప్ప, అదే ప్రజల కోసం రోడ్లెక్కెందుకు వెనుకాడుతోంది. ఎన్నడూ కనీవినీ రీతిలో రాష్ట్రంలో వరదలు ముంచెత్తాయి. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వేచేసి వచ్చారు. అధికారులతో సమీక్షలు చేసి రెండ్రోజుల్లో నష్టంపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్లకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల నుంచి రూ.10 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఇక్కడి దాకా అంతా సవ్యంగానే కనిపిస్తోంది. కానీ వరద ప్రభావిత ప్రాంతాలైన ఖమ్మం, కామారెడ్డి, సంగారెడ్డి సహా పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ సహా ఏ ఒక్క నాయకుడు ప్రజల కష్టానికి తోడుగా నిలిచిన దాఖలాలు లేవు. జిల్లా ఇంచార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. కష్టాల్లో జనంలోకి వెళ్తే ఎక్కడ నిలదీస్తారో అనే భయం వారిని ప్రజాక్షేత్రం నుంచి దూరంగా ఉంచింది.

బీఆర్‌ఎస్‌ కుటుంబగోల
ఇక బీఆర్‌ఎస్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ అని ప్రభుత్వం ప్రకటించగానే, బీఆర్‌ఎస్‌ రెండు ముక్కలైంది. పార్టీ అధినేత కే చంద్రశేఖరరావు కుమార్తె కవితను చివరకు పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం, ఆమె హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌లపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయడం వంటి విషయాలు తెలిసినవే. బీఆర్‌ఎస్‌ పార్టీ ఇంటిగోల నుంచి బయటపడలేక, అటు కష్టకాలంలో ప్రజలకు చేరువకాలేక నానా అవస్థలు పడుతోంది. కేవలం ‘ఎక్స్‌’లో ప్రకటనలు, ఖండనలు, వివరణలు, విమర్శలు చేయడానికే పరిమితమైంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును శాసనసభ ఆమోదించి, మళ్లీ గవర్నర్‌ దగ్గరకు పంపింది. ఆయన దానిపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఈనెలాఖరులోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశాలకు గడవు సమీపిస్తోంది. ఊహించని విధంగా రాష్ట్రంలో వరదలు సంభవించాయి కాబట్టి, దాన్ని సాకుగా చూపి హైకోర్టు నుంచి మరికొన్ని రోజులు గడువు కోరే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. ఓట్లు, సీట్లు వంటివాటితో సంబంధం లేకుండా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడకు ప్రత్యక్షంగా వెళ్లి ఆందోళనల్లో భాగస్వామి అవుతున్నారు. అనాజ్‌పూర్‌ భూ పోరాటం సహా రాష్ట్రవ్యాప్తంగా ఆయన క్షేత్రస్థాయిలోనే పర్యటిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు తోడుగా మేం ఉన్నాం అనే భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయపార్టీలు తమ వైఖరి మార్చుకోవాలి. ప్రజాపక్షం వహించాలి.వారి కష్టాల్లో భాగస్వాములు కావాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఇష్టపూర్వకంగా కాకుండా, ఎవరూ లేరు కాబట్టి, తప్పదు కాబట్టి అనే ధోరణిలోనే ప్రజలు ఓట్లు వేయాల్సివస్తుంది. రాజకీయపార్టీల నేతలకు కర్రుకాల్చి వాతపెట్టాల్సి వస్తుందనే చర్చ ప్రజల్లో జరుగుతోంది.

నీళ్లలో జనం…గణేష్‌ నిమజ్జనానికి అమిత్‌షా
గతంలో రాష్ట్రంలో వరదలు ముంచెత్తినప్పుడు రాష్ట్రానికి సాయం అందిస్తామని మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంచనాలు వేయించింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన అంచనాలకు, కేంద్ర ప్రభుత్వ అంచనాలకు భారీ వ్యత్యాసం వచ్చింది. సరే…కేంద్ర అంచనాల ప్రకారమైన వరద సాయం చేశారా అంటే అదీ లేదు. రాష్ట్రంలో ఇన్ని రకాల సమస్యలు ఉంటే పట్టించుకోని మోడీ సర్కార్‌, గణేశ్‌ నిమజ్జనంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాని హైదరాబాద్‌కు వెళ్లాలని ఆదేశించింది. మత విశ్వాసాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, హిందూ-ముస్లిం వ్యతిరేకత వంటి విషయాలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజల కష్టాలకు కేంద్రం ఇవ్వట్లేదు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికపై సమాలోచనలు చేస్తున్న దృష్ట్యా అమిత్‌షా పర్యటన రద్దయింది.

కేంద్రమంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడ?
కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కేవీ వెంకటరమణారెడ్డి ప్రజలు కష్టాల్లో ఉంటే పత్తానే లేరు. ఆ పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలు ఎవరూ జనానికి అందుబాటులోకి రాలేదు. కేవలం వరదల్లోనే కాదు…యూరియా కొరత అంటూ రైతులు నానా అగచాట్లు పడుతుంటే ఆవైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు. ఇక రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఎన్నికై, కేంద్ర మంత్రులుగా పదవుల్ని అనుభవిస్తున్న జీ కిషన్‌రెడ్డి, బండి సంజరు ఈ కష్టకాలంలో ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. యూరియా కోసం రైతులు అగచాట్లు పడుతుంటే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి,
సకాలంలో సహకరించాల్సిన బాధ్యతను కేంద్రమంత్రులు విస్మరించారనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఈ మంత్రుల దృష్టి ఎంతసేపూ హిందూ-ముస్లిం విభజన రాజకీయాలపైనే ఉంది తప్ప, స్థానిక ప్రజల కష్టాల్లో భాగమయ్యే చొరవ లేకుండా పోయింది. గోబ్యాక్‌ మార్వాడీ ఉద్యమాన్ని ఉద్దేశించి కేంద్రమంత్రి బండి సంజరు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈతరహా రెచ్చగొట్టే, ప్రజల్ని విభజించే డైలాగులతో రాజకీయం చేయడం మినహా ఇద్దరు కేంద్రమంత్రుల నుంచి కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒరిగింది శూన్యం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad