Tuesday, June 3, 2025
E-PAPER
Homeదర్వాజఇట్లు మీ 'కడావర్‌'

ఇట్లు మీ ‘కడావర్‌’

- Advertisement -

అంత్యక్రియలు జరిపారా
కాదు కాదు అంతిమ యాత్ర బాగా జరిపారా
న్యూస్‌ పేపర్‌ అతను వచ్చాడా… తలుచుకునే ఉంటాడు
రేపటినుండి పేపర్‌ విసిరే అక్కర్లేదని
ఎప్పుడు ఏమైపోతానో తెలియని వయస్సు
కనీసం పేపరు అయినా తోడు విడువకూడదని
అడ్వాన్సే కట్టేసేవాడిని బిల్లు లేదని దిగులు లేదు
పనిమనిషి వచ్చి ఉంటది, రెండు కన్నీరు చుక్కలు
రాల్చి ఉంటది… ఒకటి నేను పోయానని
రెండోది ఓ పని పోయిందని
ఉదయపు వాక్‌ మేట్స్‌, సాయంత్రపు చాట్‌ మేట్స్‌
పూలదండలతో వచ్చి ఉంటరు
కంపు కొడుతున్న దేహాన్ని చివరి సొగసులు ఇవ్వడానికి
నిండుగా పూలు చల్లి ఉంటరు
తమలో నుండి ఒక ఆకు రాలిపోయిందని
తలలు దించి నివాళులు అర్పించి ఉంటరు
తన్నుకొస్తున్న దుఃఖాన్ని బాధల్ని అణుచుకుంటూ
చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఉంటరు, కాసింత ఊరట ఇచ్చుంటరు
అనాధగా వెళ్ళిపోతున్నాడనే బాధను దాచుకుంటూ
నా ముందు నడిచి ఉంటరు
మా వాళ్ళు అందరూ వచ్చారా…?
కెనడా … ఆస్ట్రేలియా… అమెరికా నుండి…
ఏమీ మిగిల్చలేదని కాసింత కోపంతో ఉండవచ్చు
నా వాళ్ళు కొందరు ఆన్లైన్లో కార్యక్రమాన్ని చూస్తూ ఉండవచ్చు
తాతయ్య వెళ్తున్నారు అంటూ
తన పిల్లలకి చూపుతూ వీక్షించారేమో
ఇంతవరకు ఉపయోగపడ్డాను
పోయాక కూడా ఉపయోగపడాలి అన్న తత్వం నాది
వీలునామా చూసి వాళ్లు అక్కడే ఆగిపోయి ఉంటారు
ఆ వీలునామానే భేష్‌ అని నలుగురు నా దగ్గరికి చేరి ఉంటరు
నల్ల రిబ్బన్లను ఎదపై ధరించి
నా జీవితపు రెండు మాటలు మాట్లాడి
నెమరు వేసుకొని ఉంటరు
‘అమర్‌ హై’ అంటూ చివరిగా నినదించి ఉంటరు
ఇప్పుడు ఒక కడావర్‌గా కొత్త జీవితాన్ని ఆరంభించాను
శరీర నిర్మాణ శాస్త్రాన్ని చెపుతూ ఉండిపోతాను
(కడావర్‌ అంటే మత శరీరం)
– వహీద్‌ ఖాన్‌, 9441946909

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -