Monday, November 3, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఈ ప్రిన్సిపాల్‌ మాకొద్దు..

ఈ ప్రిన్సిపాల్‌ మాకొద్దు..

- Advertisement -

షాద్‌నగర్‌ చౌరస్తాలో గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్ధుల ధర్నా
విద్యార్థులపై ప్రిన్సిపాల్‌ వేధింపులు.. డబ్బులు వసూలు చేస్తోందని విమర్శలు
గంటకుపైగా రోడ్డుపై బైటాయింపు, భారీగా ట్రాఫిక్‌ జామ్‌
విద్యార్థిపై చేయి చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌
గురుకుల జోనల్‌ ఆఫీసర్‌, పోలీసుల రాకతో సద్దుమణిగిన నిరసన
ప్రిన్సిపాల్‌ తీరుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
ఆందోళనకు గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

నవతెలంగాణ-షాద్‌నగర్‌
ప్రిన్సిపాల్‌ వేధింపులు భరించలేక సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం కమ్మదనం గ్రామ శివారులో నాగర్‌కర్నూల్‌ సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాలను ఓ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ప్రిన్సిపాల్‌ వేధింపులతో విసిగివేసారిన విద్యార్ధులు.. ఆదివారం షాద్‌నగర్‌ పట్టణ ముఖ్య కూడలి వరకు కాలినడకన విద్యార్థులంతా ర్యాలీ నిర్వహించారు. ‘ఈ ప్రిన్సిపాల్‌ మాకొద్దు’ అంటూ అక్కడే ఆందోళనకు దిగారు. ‘ఇష్టం వచ్చినట్టు మా దగ్గర ప్రిన్సిపాల్‌ డబ్బులు వసూలు చేస్తుంది. మాకు పెట్టే భోజన విషయంలో కూడా అన్యాయం చేస్తోంది. 20 కిలోల చికెన్‌ తెస్తే.. మా కోసం 15 కిలోల చికెన్‌ మాత్రమే వండి.. మిగతాది వాళ్ళ ఇండ్లకి తీసుకెళ్తున్నారు.

వస్తువులను కూడా తీసుకెళ్తున్నారు. చివరికి పచ్చళ్లను కూడా వదలడం లేదు’ అని విద్యార్థులు వాపోయారు. ‘మా కడుపు మార్చి వాళ్లు బాగుండటం ఏంటీ’ అని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పారు. అయితే విద్యార్థులు మాత్రం కదలకుండా రోడ్డుపైనే బైటాయించారు. ‘మాకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు’ అంటూ విద్యార్థులు పట్టుబ ట్టి కూర్చున్నారు. గంటకు పైగా రోడ్డుపై బైటాయిం చడంతో షాద్‌నగర్‌ పట్టణంలో ట్రాఫిక్‌ స్తంభించింది. విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్‌, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్‌నాయక్‌ మద్దతు తెలపగా.. వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ధర్నాలో ఉద్రిక్తత
తమకు న్యాయం చేయాలని విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థులు ఆందోళన చేస్తున్న క్రమంలో ఒక మహిళా కానిస్టేబుల్‌ విద్యార్థులతో వాగ్వివాదానికి దిగింది. ఓ విద్యార్థినిపై అకారణంగా చేయిచేసుకుంది. దాంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఏ విద్యార్థిపై చేయి చేసుకున్నా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ‘మేము న్యాయం కోసం వస్తే.. మాపైనే దాడులు చేస్తారా..’ అని పోలీసులను నిలదీశారు. అక్కడున్న ఇతర పోలీసులు, ప్రజలు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమనిగింది. ధర్నా విషయం తెలుసుకున్న గురుకులాల జోనల్‌ ఆఫీసర్‌ నిర్మల ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలపై మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు సద్దుమణిగి నిరసన విరమించారు. అనంతరం జోనల్‌ ఆఫీసర్‌ గురుకులాన్ని సందర్శించారు. పరిస్థితులపై ఆరా తీశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.

ప్రిన్సిపాల్‌ పెట్టే ఇబ్బందులను భరించలేక పోతున్నాం
ప్రిన్సిపాల్‌ శైలజ పెట్టే ఇబ్బందులను మేము భరించలేకపోతున్నాం. గతంలో సూర్యాపేట ప్రాంతంలో విధులు నిర్వహించే క్రమంలో ప్రిన్సిపాల్‌ ఎన్నో అక్రమాలకు పాల్పడింది. ఇక్కడ కూడా అలాగే వ్యవహరిస్తోంది. మెస్‌లో ఉండే అనేక వంట సామాన్లను వాహనాల్లో తరలించడం మేము అనేక సార్లు చూశాం. ఫీజుల విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రిన్సిపాల్‌కు కొంతమంది ఉపాధ్యాయులు సపోర్టుగా ఉంటూ ఆమె చేసే ప్రతి పనిని సమర్థిస్తున్నారు. ఇలాంటి ప్రిన్సిపాల్‌ ఉంటే విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించరు. కాబట్టి ఈ ప్రిన్సిపాల్‌ని వెంటనే సస్పెండ్‌ చేయాలి. ఆమోఘ, గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థి

విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం
షాద్‌నగర్‌లో నిర్వహిస్తున్న నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ సాంఘీక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు తమకు న్యాయం చేయాలని ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్‌ శైలజ విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తోంది. సమస్యల సుడిగుండంలా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల తయారైంది. విద్యార్థులు ‘మాకు న్యాయం చేయండి.. కలెక్టర్‌ రావాలి’ అంటూ నినాదాలు చేయడం చూస్తుంటే వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం.
శ్రీకాంత్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -