– గ్రామ కార్యకర్తల సమావేశంలో తీర్మానం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులను సస్పెండ్ చేయాలని మండలంలోని కోన సముందర్ కాంగ్రెస్ నాయకులు తీర్మానం చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మహేందర్ అధ్యక్షతన గ్రామ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చెంగల అశోక్ ఓటమికి కారణమైన గుడిసె అంజమ్మ, రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన కండె క్రాంతి లను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కార్యకర్తల అభీష్టం మేరకు చేసిన తీర్మానం ప్రతిని మండల అధ్యక్షునికి, జిల్లా అధ్యక్షునికి, బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు పంపించినట్లు ఈ సందర్భంగా మహేందర్ తెలిపారు.
గ్రామంలో కాంగ్రెస్ర్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఎవరైనా సరే సహించేది లేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జైడి శ్రీనివాస్, సామ భూమా రెడ్డి, చెంగల అశోక్, ఉపసర్పంచ్ భలే రావు శంకర్, గట్టు హనుమండ్లు, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్, బట్టు సతీష్, సందీప్, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



