ఎన్‌ఐసీ ఉండగా జోహౌ ఎందుకు?
కేంద్రం సమాధానం చెప్పాలి : సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆందోళన
న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యులు సహా ప్రభుత్వ అధికారిక ఈ-మెయిల్ సేవలు ఎన్‌ఐసీ నుంచి ప్రయివేటు కంపెనీ జోహౌ కార్పొరేషన్‌కు అప్పగిం చడంపై సర్వత్రా ప్రశ్నలు వెల్లువెత్తు తున్నాయి. మోడీ ప్రభుత్వ చర్యను తప్పుబడుతున్నాయి. ఈ విషయంలో సీపీఐ(ఎం) ఇప్పటికే కేంద్రం తీరును ప్రశ్నించింది. ఆ పార్టీ ఎంపీ జాన్ బ్రిట్టాస్ మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారిక ఈ-మెయిల్ సేవలను ఎన్‌ఐసీ నుంచి జోహౌకు అప్పగించడం ఎందుకు అవసరమైందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలతో పాటు ఏ ఎంపీ కూడా ఎన్‌ఐసీ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేయలేదనీ, అలాంటప్పుడు ఈ మార్పు ఎందుకు అవసరమైందని ఆయన సందేహాన్ని వ్యక్తం చేశారు. ఎన్‌ఐసీ ఇక సమర్థంగా పని చేయలేదని ప్రభుత్వం భావిస్తోందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి నిజంగా మోడర్నైజేషన్ కావాలనిపిస్తే.. ఎన్‌ఐసీకి నిధులు ఇచ్చి మెరుగుపర్చవచ్చనీ, కానీ ప్రయివేటు కంపెనీకి ఇవ్వడం అవసరం లేదని చెప్పారు. ఎన్‌ఐసీ వ్యవస్థలు భద్రంగా, సమర్థవంతంగా పని చేస్తున్నాయని కవచ్ అథంటికేషన్ సిస్టమ్‌ను ఆయన ఉదహరించారు. ఎన్‌ఐసీ ప్రభుత్వ డేటా స్వాధీనతను కాపాడే సంస్థగా ఉన్నప్పుడు.. దానిని పక్కనబెట్టి ప్రయివేటు కంపెనీకి ఈ-మెయిల్ నిర్వహణ అప్పగించడం గోప్యతకు ముప్పుగా ఉంటుందన్నారు. పార్లమెంట్ కమ్యూనికేషన్లు, ప్రభుత్వ సంభాషణలు ఇప్పుడు కార్పొరేట్ కాంట్రాక్టుపై ఆధారపడటం ప్రమాదకరమని జాన్ బ్రిట్టాస్ హెచ్చరించారు. జోహౌ కంపెనీ నాయకత్వం మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా పలుమార్లు మాట్లాడిందనీ, అది కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపి ఉండొచ్చని ఆయన అన్నారు. ఈ విషయంలో సీపీఐ(ఎం) ఎంపీ భారత ఉపరాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్‌కు ఇప్పటికే లేఖ కూడా రాశారు. ఈ మార్పుతో పార్లమెంటరీ కమ్యూనికేషన్ల గోప్యత, స్వతంత్రత ప్రమాదంలో పడొచ్చని పేర్కొన్నారు. ఎన్‌ఐసీ లాంటి విశ్వసనీయ ప్రభుత్వ సంస్థను పక్కనబెట్టి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కోర్ ఈమెయిల్ సేవలను ప్రయివేటు కంపెనీకి అప్పగించడం ఆందోళనకరమని వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి వివరాలు, పారదర్శకంగా వెల్లడించాలని కోరారు.
గోప్యతకు ముప్పు
- Advertisement -
- Advertisement -



