వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర్ రాజు
నవతెలంగాణ – మిర్యాలగూడ
ఏపీ లోని పల్నాడు జిల్లా కారంపూడిలో ఓ మెడికల్ షాప్ నుంచి మత్తు మాత్రలు తెచ్చి విక్రయిస్తున్న ఇద్దరు యువకులతో పాటు మెడికల్ షాప్ నిర్వాహకుడిని శనివారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరించారు. పట్టణంలోని సీతారాంపురం కాలనీకి చెందిన మచ్చ నవీన్, నక్క మహేష్ అనే ఇద్దరు యువకులు గంజాయి మత్తు పదార్దాలకు బానిసలుగా మారారు. కొద్ది రోజులుగా పోలీసు లు గంజాయి పై ఉక్కు పాదం మోపడంతో మత్తు కోసం స్పాష్మో ప్రొక్సవన్ ప్లస్ అనే మత్తు మాత్రలకు అలవాటు పడ్డారు. వైద్యుడి ప్రిస్కిప్షన్ లేకుండా మాత్రలు విక్రయించక పోవడంతో ఏపీ లోని పల్నాడు జిల్లా కారంపూడిలోని వీరభద్ర మెడికల్ షాప్ నుంచి వాటిని కొని తెచ్చి మత్తుకోసం వాడే వారు. 8 టాబ్లెట్లు ఉండే ఒక్కో స్ట్రిప్ రూ. 150 లకు కొనుగోలు చేసిన టాబ్లెట్లను వీరిద్దరూ వినియోగించడంతో పాటు అధికధరలకు ఇతరులకు విక్రయిస్తున్నారు.
శనివారం తెల్లవారు జామున ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీ చేస్తుండగా రెండు కవర్ల తో అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరితో పాటు మెడికల్ షాప్ నిర్వాహకుడు శెట్టి హనుమంత రావులు పట్టుబడగా తహసీల్దార్ ఎదుట పంచ్ ల సమక్షంలో అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 280 మత్తు మాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మెడికల్ షాప్ యజమాని శెట్టి జయ రామచంద్ర ప్రసాద్ పరారిలో ఉన్నట్లు తెలిపారు.ఎవరైనా నిషేధిత గంజాయి, మత్తు పదార్ధాలు వినియోగించినా విక్రయించినా, తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితులను గుర్తించడంలో చాక చక్యంగా వ్యవహరించిన ఒన్ టౌన్ సీఐ నాగభూషణ రావు, ఎస్సై సైదిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాజా రాం, కానిస్టేబుల్లు వీరబాబు, నర్సింహా, ప్రసాద్, శ్రీను, హుస్సేన్ లను అభినందించారు.


