నవతెలంగాణ – హైదరాబాద్: విజయవాడలో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయనే అనుమానంతో ముగ్గురు యువకులను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వించిపేటకు చెందిన ఇద్దరు 21 ఏండ్ల యువకులతో పాటు భవానీపురానికి చెందిన 20 ఏండ్ల యువకుడిని అధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉగ్రమూలాలపై కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర సీఐ సెల్ అధికారులు నిరంతర నిఘా చేపట్టారు.
ఈ నిఘాలో భాగంగా సోషల్ మీడియా కార్యకలాపాలపై దృష్టి సారించిన అధికారులకు, ఈ ముగ్గురు యువకులు ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నట్లు తెలిసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, వారి నివాసాల్లో సోదాలు నిర్వహించి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.



