– రేషన్‌కార్డుదారులకు ఏప్రిల్‌లో పంపిణీ
– ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల చర్యలు
– గోదాములకు చేరిన జిల్లాల కోటా
– పది రోజుల ముందు నుంచే రేషన్ షాపులకు తరలుతున్న బియ్యం
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఆదేశానుసారం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యాన్ని ఏప్రిల్‌లోనే చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో, జీహెచ్‌ఎంసీ పరిధిఓ రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని అందించనున్నారు. దీనికి సంబంధించి సాంకేతికపరంగా సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు ఎమ్మెల్యేస్ పాయింట్స్‌లో పెద్దఎత్తున బియ్యం నిల్వలు వచ్చాయి. దీంతో వెనువెంటనే రేషన్‌షాపులకు బియ్యాన్ని తరలిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని 20 మండలాలకు సంబంధించిన బియ్యం కోటా ఎమ్మెల్యేస్ పాయింట్‌లకు చేరింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం కోటాను.. ఒక్కో లబ్దిదారుకు 6కిలోల చొప్పున 18 కేజీలు సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 356 రేషన్ షాపులకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. గత యేడాది కూడా ఏప్రిల్ మాసంలో మూడు నెలలకు సంబంధించిన బియ్యం సరఫరా చేశారు.
గతేడాది ఉగాదికి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం మరుసటి నెలలో ఒకేసారి మూడు నెలల బియ్యం అందజేసింది. తిరిగి జులై నెల నుంచి నెలనెలా బియ్యం పంపిణీని యథావిధిగా కొనసాగించింది. ఈ యేడాది కూడా అదే తరహలో పంపిణీకి చర్యలు చేపట్టింది.
జిల్లాకు 14063.715 మెట్రిక్ టన్నులు
ఆదిలాబాద్ జిల్లాలో 2,25,843 రేషన్‌కార్డులు ఉండగా.. అందులో 7,40,557 మందికి లబ్ది చేకూరుతోంది. ప్రతి నెలా జిల్లాలో 4687.905 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో మూడు నెలలకు సంబంధించిన 14063.715 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేయనున్నారు. దీంతో జిల్లాలోని ఎమ్మెల్యేస్ పాయింట్ గోదాములు అన్నీ నిల్వలతో నిండాయి. పది రోజుల ముందుగానే రేషన్ షాపుల వారీగా అలాట్‌మెంట్ సరఫరా చేస్తున్నారు.
గోదాముల సామర్థ్యానికి మించి బియ్యం
ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 4200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉండటంతో బియ్యం నిల్వ చేసేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. నెలకు సంబంధించిన కోటాను నిల్వ చేసే సామర్థ్యం ఉన్న గోదాముల్లో మూడు నెలలకు సంబంధించిన నిల్వలు ఇబ్బందిగా మారాయి. దీంతో జిల్లాలోని 356 రేషన్‌షాపులకు వెనువెంటనే బియ్యం తరలింపు ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం జిల్లాలో 5 ఎమ్మెల్యేస్ పాయింట్స్ ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 1200 మెట్రిక్‌టన్నుల గోదాం ఉండగా ఉట్నూర్‌లో 1600 మెట్రిక్ టన్నులు, ఇచ్చోడ 500, జైనథ్ 500, బోథ్ 200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉన్నాయి.
నిల్వలనుతగ్గించటానికే మూడు నెలల కోటా సరఫరా
ఏప్రిల్ నెల నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలు బంద్ కానున్న నేపథ్యంలో వసతిగృహాలు, గురుకులాలు, పాఠశాలలకు సరఫరా చేసే సన్న బియ్యం నిల్వలు పేరుకుపోయే అవకాశం ఉంది. దీంతో నిల్వలు భద్రపర్చలేక నిరుపేదలకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని 1256 అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రతి నెలా 66.300 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసున్నారు. అదేవిధంగా 1293 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి 109.762 మెట్రిక్ టన్నులు, 171 వసతిగృహాలు, గురుకుల పాఠశాలలకు 385.900 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తారు. రెండు నెలలకు సంబంధించిన బియ్యం నిల్వ ఉంచడం ఇబ్బందిగా మారుతుందని, అందుకని మూడు నెలల కోటా ఒకేసారి సరఫరా చేస్తున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.



