నవతెలంగాణ హైదరాబాద్: ఇక నుంచి రోడ్డుపై చెత్త వేస్తే భారీ మూల్యమే చెల్లించాల్సివస్తుంది. తస్మాత్ జాగ్రత్త. రోడ్డుపై చెత్త వేస్తే 18 రోజులు జైలు శిక్ష పడటం ఖాయం అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. సెక్షన్ 70 (బి), 66 సీపీ యాక్ట్ కింద అభియోగం కోర్టులో నిరూపణ జరిగితే జైలు ఊచలు లెక్కించాల్సిందే అని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో ఇప్పుడు రోడ్లపై చెత్త వేస్తున్న వారిపై నిఘాను పెంచారు. రోడ్లపై చెత్త వేస్తున్న హాట్‌స్పాట్‌లను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
రోడ్ల మీద చెత్త వేయడం అంత పెద్ద నేరమా? దానికి మరి ఇంతగా పోలీసులు వ్యవహరించాలా? హెచ్చరిస్తే సరిపోదా అని అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయినా ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? రోడ్లపై చెత్త వేయడం అనేది చిన్న విసయంగానే కనిపిస్తుంది. కానీ దానివల్ల ఎదురవుతున్న దుష్పరిణామాలు చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. రోడ్లపై చెత్తా చెదారం వేయడంతో వీధి కుక్కలు వాటి కోసం ఎగబడటం అటుగా వెళ్తున్న పిల్లులపై ఎడబడటం, వారిని గాయపర్చడం వంటి వాటితో పాటు, జంతువులు ఆ వ్యర్థాలను తీసుకుని వెళ్లి దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, ఇండ్ల ముందు వదిలేస్తుండడంతో తీవ్ర ఉద్రికత్తలకు దారితీస్తుంది. ఇటీవల కొన్ని సంఘటనల్లో ఇది నిర్ధారణ కావడంతో పోలీసులు రోడ్డుపై చెత్త వేసే వారిపై కఠినంగా ఉండాలని బీఎన్ఎస్ సెక్షన్ 292 తో పాటు సెక్షన్ 66,70(బి)సీపీ యాక్ట్ కింద అభియోగాలను నమోదు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలో డీసీపీ విజయ్ కుమార్ చేపట్టిన డ్రైవ్ అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.