నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై రోజురోజుకు వివాదం రాజుకుంటుంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఏడీఆర్ సుప్రీం కోర్టులో ఈసీని నిర్ణయాన్ని సవాల్ చేసింది . తాజాగా టీఎంసీ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను ఆ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. జూన్ 24న ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని ఆమె పిటిషన్‌లో అభ్యర్థించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దాఖలు రిట్ పిటిషన్ దాఖలు చేరసినట్లు పేర్కొన్నారు. బిహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ జరుగుతోందని.. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1)(A), 21, 325, 328, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 ఎన్నికల నమోదు నియమాలు, 1960లోని నిబంధనలను ఉల్లంఘించినట్లేనన్నారు.
ఈ ఉత్తర్వులను రద్దు చేయకపోతే దేశంలో పెద్ద సంఖ్యలో అర్హులైన ఓటర్లు తమ ఓటుహక్కును కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను దెబ్బతిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్‌తో పాటు బెంగాల్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయడాన్ని నిలిపివేయాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని మహువా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తొలిసారిగా ఓటర్ల జాబితాలో ఇప్పటికే పేర్లు ఉన్నా.. గతంలో అనేకసార్లు ఓటు వేసిన ఓటర్లంతా తమ అర్హతను నిరూపించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంటుందని.. ఇది ఆర్టికల్ 326కి విరుద్ధమని పేర్కొన్నారు. ఆమె తరఫున న్యాయవాది నేహా రతి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను సవాల్ చేస్తూ ఏడీఆర్ సైతం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది.