Thursday, November 6, 2025
E-PAPER
Homeజాతీయంనేడే తొలివిడత సమరం

నేడే తొలివిడత సమరం

- Advertisement -

బీహార్‌లోని 121 నియోజకవర్గాల్లో పోలింగ్‌
1,314 మంది అభ్యర్థులు.. 3.75కోట్ల మంది ఓటర్లు


పాట్నా : బీహార్‌ తొలి విడత సమరానికి రంగం సిద్ధమైంది. 243 స్థానాలకుగాను తొలి దశలో 121 నియోజకవర్గాలకు గురువారం ఓటింగ్‌ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అధికారం నిలబెట్టుకోవాలని పావులు కదుపుతున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే, మళ్లీ సీఎం పీఠం దక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నది. మరోవైపు ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్‌బంధన్‌ మధ్య గట్టిపోటీ నెలకొంది. అయితే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సారథ్యంలోని జనసు రాజ్‌ పార్టీ తొలిసారి బిహార్‌ బరిలో దిగింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావంపై ఉత్కంఠ నెలకొంది.

18 జిల్లాలో పోలింగ్‌..
బీహార్‌ 243 నియోజకవర్గాలు ఉండగా 18జిల్లాల పరిధిలోని 121 స్థానాలకు గురువారం పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న ఓటింగ్‌, సాయంత్రం 6గంటలకు ముగియనుంది. భద్రతా కారణాలతో సిమ్రిబఖ్తియార్‌పుర్‌, మహిషి, తారాపుర్‌, ముంగర్‌, జమల్‌పుర్‌, సూర్యగర్హ్‌ నియోజకవర్గం లోని 56 పోలింగ్‌ బూత్‌ల్లో ఓటింగ్‌ సాయంత్రం 5గంటలకే ముగియనుంది. తొలి విడతలో 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 3.75కోట్ల మంది బీహారీలు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. అందులో 122 మంది మహిళా అభ్యర్థులు కాగా జన్‌ సురాజ్‌ పార్టీ తరఫున ఓ ట్రాన్స్‌జెండర్‌ కూడా బరిలో ఉన్నారు.

45వేల 341 పోలింగ్‌ కేంద్రాలు
తొలి విడతలో ఓటువేయనున్న 3.75 కోట్లమంది కోసం కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) 45వేల 341పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో 36వేల 733 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 10.72లక్షల మంది తొలిసారి ఓటు వేయనున్నారు. ఈ విడతలో ఎన్డీయే భాగస్వామ్యపక్షం జేడీయూ అత్యధికంగా 57 స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి 48 మంది,ఎల్జేపీ తరపున 14 మంది, రాష్ట్రీయ లోక్‌మోర్చా తరఫున ఇద్దరు బరిలో ఉన్నారు. మహాగట్‌బంధన్‌కు సంబంధించి ఆర్జేడీ అత్యధికంగా 73చోట్ల పోటీచేస్తుండగా కాంగ్రెస్‌ నుంచి 24మంది, సీపీఐ(ఎంఎల్‌) సీపీఐ(ఎం) తరఫున 14 మంది రంగంలో ఉన్నారు. తొలిసారి బీహార్‌ ఎన్నికల బరిలో దిగిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సారథ్యంలోని జన్‌సురాజ్‌ పార్టీ నుంచి 119 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాజపకర్‌, బచ్వారా, బెల్దౌర్‌, గౌరాబొరం, బీహార్‌ షరీఫ్‌ స్థానాల్లో మహాగట్‌బంధన్‌లోని భాగస్వామ్య పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్‌, వీఐపీ, వామపక్ష కూటమి అభ్యర్థులు బరిలో దిగారు.

బరిలో 16 మంది మంత్రులు
బీహార్‌ తొలి విడతలో ప్రధాన కూటముల తరఫున పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. నీతీశ్‌కుమార్‌ సర్కార్‌లోని 16 మంది మంత్రులు మరోసారి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అందులో ఉపముఖ్యమంత్రులు సామ్రాట్‌ చౌదరీ, విజరు కుమార్‌ సిన్హాసహా బీజేపీకి చెందిన 11మంది మంత్రులు ఉన్నారు. సామ్రాట్‌ చౌదరీ తారాపుర్‌ నుంచి, విజరుకుమార్‌ సిన్హా లఖిసరారు నుంచి పోటీ చేస్తున్నారు. మహాగట్‌బంధన్‌ సీఎం అభ్యర్థి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్‌ మూడోసారి రాఘోపుర్‌ నుంచి బరిలో నిలిచారు. ఆయన సోదరుడు, మాజీమంత్రి తేజ్‌ప్రతాప్‌యాదవ్‌ మహువా నుంచి పోటీచేస్తున్నారు.

11న 122 స్థానాలకు రెండోవిడత పోలింగ్‌
ఈనెల 11న మిగతా 122స్థానాలకు రెండోవిడతలో పోలింగ్‌ జరగనుంది. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ తర్వాత తొలిసారి బిహార్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2020 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 125 స్థానాలు గెలుపొంది అధికారం చేపట్టగా మహాగట్‌బంధన్‌ 110సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -