Friday, December 5, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమొఘలుల వంకతో నేటి ముస్లింలపై ద్వేష భావన!

మొఘలుల వంకతో నేటి ముస్లింలపై ద్వేష భావన!

- Advertisement -

మొఘలులు ఈ దేశాన్ని దోచుకుపోయారని, ఇక్కడి హిందువులను బలవంతంగా మత మార్పిడి చేశారని, హిందువుల దేవాలయాలు, ప్రార్ధనా స్థలాలు దౌర్జన్యంగా కొల్లగొట్టారని ప్రస్తుత ఆరెస్సెస్‌ – బీజేపీ దేశ భక్తులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలకు అనుగుణంగానే NCERT/ CBSE వంటి సంస్థలు పాఠశాల పాఠ్యపుస్తకాల్లో సిలబస్లు మార్చి రాబోయే తరాలకు తప్పుడు విషయాలు బోధిస్తున్నాయి. మన రాజ్యాంగంలో ఉన్న 51ఎ/హెచ్‌కు విరుద్ధంగా జరుగుతున్న ఈ చర్యల్ని బాధ్యత గల పౌరులుగా మనం నిరసించాల్సిన అవసరం ఉంది. నేను సైన్సు విద్యార్థిని గనుక, ప్రతి విషయాన్ని వైజ్ఞానిక స్పృహతో అర్థం చేసుకుంటున్నాను గనుక, ఆ దృష్టి కోణంలో నుంచే కొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నాను. రొమిల్లా థాపర్‌, డి.ఎన్‌. ఝా వంటి ప్రసిద్ధ చరిత్రకారుల రచనల్లోంచి, చరిత్ర మీద మంచి పట్టు ఉన్న రాంపున్యాని ఉపన్యాసాల్లోంచి తీసుకున్న కొన్ని వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను. సమకాలీనంలో ఉన్న ముస్లింలను దేశంలోని హిందువులంతా ద్వేషించాలని గౌరవ ప్రభుత్వాధినేతలు కోరుకుంటున్నారు.

అది సాధించడానికే, ఎప్పుడో ఈ దేశాన్ని పరిపాలించిన మొఘలుల్ని విలన్లుగా చూపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కారణం, మొఘలులు ముస్లింలు గనుక! అందుకే మొఘలుల వంకతో నేటి ముస్లింలపై ద్వేష భావన పెంచాలన్న ప్రయత్నం జరుగుతూ ఉంది. ద్వేషాన్ని వ్యాప్తి చేయాలంటే తప్పకుండా అబద్ధాల అభాండాలు వారి మీద వేయక తప్పదు కదా? ముందుగా మొఘల్‌ చక్రవర్తుల గురించి క్లుప్తంగా చెప్పుకుందాం! దానితో పాటు వారి పరిపాలనా విశేషాలు కూడా చర్చించుకుందాం!! మొఘలుల వంశస్థాపకుడు మొదటిసారి భారతదేశంలో 1519లో అడుగుపెట్టాడు. ఈయన వారసులది మంగోలియన్‌ తెగ. బాబర్‌ తండ్రి వైపు తైమూర్‌కు చెందిన వాడైతే, తల్లి వైపు నుండి చెంఘీజ్‌ ఖాన్‌ వంశానికి చెందినవాడు. పన్నెండు సంవత్సరాలకే ఫరగనాకు రాజయ్యాడు. ఫరగనా ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్‌లోకి వస్తుంది. పర్షియన్‌, టర్కీ భాషలు నేర్చుకున్నాడు. అప్పుడు ఢిల్లీ సుల్తాన్‌గా ఉన్న ఇబ్రహీంలోదిని జయించిన బాబర్‌, 1526లో తన మొఘల్‌ సామ్రాజ్యాన్ని స్ధాపించాడు. 1526 నుండి 1761దాకా మొఘులులు ఈ దేశాన్ని నిరాఘాటంగా పరిపాలించారు. వీరిలో ‘అక్షర్‌ ద గ్రేట్‌’గా చరిత్రలో నిలిచిన అక్షర్‌ గురించి, వివాదాస్పదుడైన ఔరంగజేబు గురించి తప్పుక చెప్పుకోవాలి.

అక్బర్‌ దేశంలోని అన్ని మతాలకూ సమానమైన స్థాయిని ఇచ్చి అన్ని మతాల వారిని సమానంగా చూశాడు. దీన్ని ‘సులహ – ఎ – కుల్‌’ అని అన్నారు. హిందువులైన రాజపుత్రులతో బంధుత్వం కలుపుకున్నాడు. వారికి ఆస్థానంలోనూ, సైన్యంలోనూ సముచిత స్థానాన్ని కల్పించాడు. అక్బర్‌ చేసిన అతిముఖ్యమైన పని ఒకటుంది. హిందూ దేవుళ్లయిన ‘సియా రామ్‌’లను అంటే సీతారామ్‌లను నాణాలపై చెక్కించాడు. ప్రపంచ చరిత్రలో ఇలాంటి పని ఏ చక్రవర్తీ చేయలేదు. ఇతర మతాల దేవుళ్లను తమ ప్రభుత్వ నాణాల మీద ముద్రించి, చలా మణిలో ఉంచడం – ఆయనకంటే ముందుగానీ, ఆయన తర్వాత గానీ జరగలేదు. దేశంలో అధిక సంఖ్యాకులైన హిందువుల మన్నన పొందడానికీ వారి అభీష్టానికి విలువ నివ్వడానికి ఆయన ఆపని చేశాడు. ఇతర మతాలపై ద్వేషభావన పెంచే నిరంకుశుడైతే – అలా చేసేవాడు కాదు గదా? ప్రజారోగ్యం మీద దృష్టి పెట్టిన అక్బర్‌ చక్రవర్తి, చికిత్సాలయాలు ఏర్పరిచాడు. వాటితో పాటు చికిత్స పాఠశాలల్ని కూడా నెలకొల్పాడు. అంతే కాదు, ఖగోళ శాస్త్ర పరిశోధకులను ప్రోత్సహించాడు. అక్బర కాదు, జహంగీర్‌ కూడా గణిత, ఖగోళ శాస్త్రాలకు తన పాలనలో ప్రాధాన్యమిచ్చాడు.

ఛత్రపతి శివాజీని హిందూ మతోద్ధారకుడిగా ప్రచారం చేసుకుంటున్న హిందుత్వవాదులు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అంతటి ఛత్రపతి శివాజీ- అక్బర్‌ చక్రవర్తి గురించి, ఆయన పాలన గురించి వెలిబుచ్చిన అభిప్రాయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది! అక్బర్‌పై శివాజీ అభిప్రాయం ఇలా ఉంది – ”ఈ సువిశాలమైన దేశాన్ని అక్బర్‌ చక్రవర్తి తన యాభై రెండేండ్లలో ఎంతటి సంయమనంతో, సహనంతో పరిపాలించాడంటే.. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి మాత్రమే కాదు, విదేశాల నుండి వచ్చిన డచ్‌, పోర్చుగీసు, అరబ్‌ దేశాల వారిని, బ్రాహ్మణులు, శూద్రులు అని తేడా చూపకుండా సమ భావంతో సమాన స్థాయినిచ్చి గౌరవంగా చూసుకున్నాడు. ఆ యాభై రెండేండ్లలో ప్రజలందరినీ దయాదాక్షిణ్యాలతో చూసుకున్న కారణంగానే పౌరుల దృష్టిలో ఆయన ‘అక్బర్‌’ అయ్యాడు. అక్బర్‌ అంటే అత్యున్నతమైన గ్రేట్‌ అని అర్థం! ప్రజలు ఆయనను ”జగత్‌ గురు”- అని వ్యవహరించారు.

అందుకే ఆయన ఎటు చూస్తే అటు విజయాలు దరిచేరేవి. ”ఖురాన్‌ ‘- ఈశ్వరవాణి. అందులో అల్లా ముస్లింలకే పరిమితం కాదు. ఈ విశ్వానికే ఈశ్వరుడు – అని చెప్పబడింది. అందువల్ల, హిందూ, ముస్లిం అంతా ఒక్కటే!” – చత్రపతి శివాజీ. లి జిజియా పన్ను విధించినపుడు తన నిరసనను తెలియజేస్తూ శివాజీ ఔరంగ జేబుకు రాసిన ఉత్తరంలోని అంశాలు ఇవి. మీ పూర్వీకులు ఎంతో గొప్ప విశాల హృదయంతో పరిపాలిస్తే- తమరేమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారూ? – అని ప్రశ్నిస్తూ రాసింది ఆ ఉత్తరం. వివాదాస్పదుడైన ఔరంగజేబు పరిపాలనా కాలంలో ప్రపంచ జీడీపీలో భారత దేశపు జీడీపీ సుమారు ఇరవై అయిదు శాతం ఉండేది. అంటే వాణిజ్యరంగం ఎంతగా దూసుకుపోయిందో తెలుస్తుంది. వ్యవసాయరంగంలో కూడా గణనీయమైన ప్రగతిని సాధించింది. చెరకు, పత్తి, నూనెగింజల ఉత్పత్తిని మొఘలులు ప్రోత్సహించారు. అందుకే, ఆ కాలంలో భారతదేశం పత్తి ఎగుమతి, వస్త్రవ్యాపారం విపరీతంగా పెంచుకోగలిగింది. ఇక్కడి మఖ్‌మల్‌ వస్త్రాలకు, సిల్కు వస్త్రాలకు ఆకర్షింపబడి డచ్‌వారు, బ్రిటీష్‌ వారి ఈస్ట్‌ ఇండియా కంపనీ తరచూ వ్యాపార నిమిత్తం మన దేశానికి వస్తుండేవారు.

ఔరంగజేబు తన మొదటి ఇరవై ఒక్క ఏండ్లలో హిందువులపై జిజియా పన్ను విధించలేదు. ఆ తర్వాత కాలంలో ధనాగారం ఖాళీ అయి, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు మరోమార్గం లేక జిజియా పన్ను విధించాడు. తప్పనిసరై తీసుకున్న ఆ నిర్ణయాన్ని అస్థానంలోని హిందూ అధికారులు కూడా ఆమోదించారు. ఎవరూ తమ అసహనాన్ని వెలిబుచ్చలేదు. అన్ని శాఖలలో ఔరంగజేబు ఆ స్థానంలో సుమారు ముప్పయి రెండు శాతం హిందూ అధికారులు ఉండేవారు. ఇలాంటి ఈ పన్ను హిందువుల పైనే ఎందుకు వేశాడూ? ఇతర మతాల వారిపై ఎందుకు వేయలేదూ? అంటే- అక్కడ మతాల ప్రాధాన్యం కాదు. జనాభా ప్రాధాన్యత కారణమైంది. ఎక్కువ పన్నులు వసూలై, కోశాగారానికి ఎక్కువ డబ్బులు రావాలంటే – అధిక సంఖ్యాకులైన వారి మీదే పన్నువేయాలి! అల్ప సంఖ్యాకుల మీద వేస్తే, డబ్బు స్వల్పంగానే వసూలవుతుంది కదా? ఆ రోజుల్లో దేశ జనాభా 110-150 మిలియన్లు ఉండొచ్చని ఒక అంచనా. అయితే అది ప్రపంచ జనాభాలో ఇరవై అయిదు శాతం ఉండేది.

ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకోవాలంటే- మొఘలుల కాలంలోనే భారత దేశంలో నగరాలు ఏర్పడి, అభివృద్ధి అయ్యాయి. పదిహేను శాతం ఈ దేశ ప్రజలు ఆనాడే నగరాలలో ఉండేవారు. యూరప్‌తో పోల్చిచూస్తే- ఆ రోజుల్లోనే మన భారత దేశంలో ఆధునిక నగరాలు అధిరంగా ఉండేవి. నగరాలు ఎలా అభివృద్ధి అవుతాయీ? రోడ్లు, రవాణా సౌకర్యాలు మెరుగు పడ్డాయి గనక, నగరాలు అభివృద్ధి అయ్యాయి. రోడ్లు, రవాణా సౌకర్యాలు, నగరాలు అభివృద్ధి అయ్యాయి గనకనే వ్యాపారం బాగా సాగింది. ఆ వ్యాపారం కోసమే విదేశీయులు వచ్చారు. ఇంత గొప్పగా సాగిన ఆ పరిపాలనా కాలాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌సీఈఆర్టీ పిల్లల పాఠ్యపుస్తకాల్లోంచి ఎందుకు తొలగించినట్లూ ? అందులో ఉన్న హేతుబద్ధత ఏమిటీ? కారణం – ఈ ప్రభుత్వానికి ముస్లింలపై ఉన్న ద్వేష భావన ఒక్కటే కనిపిస్తోంది! అది ఒక బహిరంగ రహస్యం!! అయినా చరిత్ర అనేది కొన్ని సంఘటల్ని గుదిగుచ్చిన దారం.

దాని మధ్యలో ఒక ముక్క తెంపి అతుకేస్తే, అది అతుకులాగే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఈ నేలను, ఈ దేశాన్ని ప్రేమించేవారు, కాలక్రమంలో ఇక్కడ జరిగిన అన్ని సంఘటనలు ఒక వరుస క్రమంలో తెలుసుకోవాలని అనుకుంటారు. మనమైనా మన తర్వాత రాబోయే తరాలైనా అలాగే అనుకుంటారు. సగం తెలుసుకుని, సగం వదిలేస్తే, కొంతమంది ఆఫ్‌ నాలెడ్జ్‌ రాజకీయ నాయకుల్లాగా మిగిలిపోతారు. వచ్చే తరాలు అలా తయారు కావడానికి మనం ఒప్పుకోం కదా? గడిచిన కాలంలో కొన్ని సంఘటనలు జరిగిపోయాయి. అందులో మన ప్రమేయం లేదు. మంచిని మంచిగా, చెడుని చెడుగా స్వీకరించాల్సిందే! మంచి కనిపిస్తే స్ఫూర్తి పొందాలి. చెడు కనిపిస్తే, అందులోంచి పాఠాలు నేర్చుకుని అలాంటిది మళ్లీ జరగకుండా జాగ్రత్త పడాలి. అంతే!! రొమిల్లా థాపర్‌ ప్రసిద్ధ భారత చరిత్ర కారిణి ఒక ప్రకటనలో తన అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంలో ఆవిషయాలు తెలుసుకోవడం అవసరం : 1960-70 దశకంలో ఆమె ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల రచయితగా ఉన్నారు. ఆమెతో పాటు ఆ రోజుల్లో అర్జున్‌ దేవ్‌, ఆర్‌.ఎస్‌.శర్మ, సతీష్‌ చంద్ర, బిపిన్‌ చంద్రలు ఉన్నారట.

ఆ చరిత్రకారులంతా ఇప్పుడు బతికిలేరు. బతికి ఉన్న రొమిల్లా థాపర్‌ వయసు 93 సంవత్సరాలు. ఆ రోజుల్లో తాము ప్రతి చిన్న విషయాన్నీ క్షుణ్ణంగా చర్చించి, పాఠ్య పుస్తకాల్లో చేర్చేవాళ్లమని – ప్రతి దానికీ కమిటీలు ఉండేవనీ ఆమె చెప్పారు. ఆపుస్తకాలు ఎలా తయారయ్యేవో కూడా ఆమె వివరించారు. చిన్న క్లాసుల్లో కొద్దిగా ప్రాథమిక అంశాలు పరిచయం చేసి, పెద్ద క్లాసులకు వెళుతున్న కొద్దీ, ఆ విషయాల్ని విస్తృతపర్చి రాసేవారమని-ఆమె చెప్పారు. అలా తయారుచేసిన పుస్తకాలు పిల్లల్లో ఆసక్తిని పెంచి, వారితో కొత్త ప్రశ్నలు అడిగించే విధంగా ఉండేవని – అంతేకాకుండా ఆ పాఠ్య పుస్తకాలు ఉపాధ్యాయులకు సమాజం సంస్కృతి పట్ల కొంత సమాచారం అందించి – వారు క్లాసులో చెప్పాల్సిన అంశాలకు ఒక పరిధిని ఏర్పరిచే విధంగా తాము తయారు చేసేవారమని ఆమె చెప్పారు. ఇక, ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు – అహేతుకంగా సిలబస్‌ మార్చిన విషయంలో కమిటీలు లేవు. చర్చల్లేవు. నిష్ణాతులైన వారి అభిప్రాయాలు తెలుసుకున్నదీ లేదు. కేవలం బుల్డోజర్‌ నిర్ణయాలు తప్ప, మరింకేమీ లేదు – అని ఆమె తన ఆవేదన వెలిబుచ్చారు – రొమిల్లా థాపర్‌ ప్రపంచ స్థాయి గౌరవాన్ని అందుకున్న చరిత్ర కారిణి ! ఆమె చెప్పిన విషయాలు మనం సీరియస్‌ గా తీసుకుని, ఆలోచించుకోవాల్సి ఉంది!! ఇది ఆయా తరగతుల పిల్లల స్థాయి తగ్గించడం కాదు- ఎన్సీఈఆర్టీ/సీబీఎస్‌ఈ వంటి సంస్థలే తమ స్థాయిని తగ్గించుకున్నాయి- వీటిని దుర్వినియోగం చేసిన కారణంగా కేంద్రప్రభుత్వమే తన స్థాయిని తగ్గించుకున్నట్లయ్యింది!
-సుప్రసిద్ధ సాహితీ వేత్త, జీవశాస్త్రవేత్త.

డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -