నష్టాల్లో పండ్లు, కూరగాయల సరఫరదారులు
పశ్చిమాసియాలో ఆందోళనల ఎఫెక్ట్
న్యూఢిల్లీ : అమెరికా సామ్రాజ్రవాదంతో పశ్చిమాసియా అట్టుడికిపోవడంతో భారత ఎగుమతిదారులు ఊహించని నష్టాలను చవి చూస్తున్నారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్ చేస్తోన్న మారణకాండ ఎగుమతి రంగాన్ని కుదేలు చేస్తోంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో భారీ లాభాలను ఆశించిన బియ్యం, పండ్లు, కూరగాయల ఎగుమతిదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. హర్ముజ్ జలసంధి మూతపడటంతో రవాణా ఖర్చులు రెట్టింపు అయ్యాయి. దీనివల్ల ఎగుమతి ఒప్పందాలన్నీ ఆర్థికంగా భారంగా మారాయి. మరోవైపు విమాన రవాణా చార్జీలు 40 శాతం మేర పెరిగాయి.
గల్ఫ్‌దేశాల విమానాశ్రయాలు మూతతో పాడైపోతున్న కూరగాయలు
గల్ఫ్ దేశాల విమానాశ్రయాలు మూతపడటంతో బెండకాయ, సొరకాయ, బేబీ కార్న్ వంటి త్వరగా పాడైపోయే వస్తువుల ఎగుమతులు నిలిచిపోయాయి. దాదాపు 3,000 కంటైనర్లు ముంద్రా, కాండ్లా రేవుల్లోనే పేరుకుపోగా, నిల్వ ఛార్జీలు భారంగా మారుతున్నాయి. యూరప్, అమెరికాకు వెళ్లాల్సిన సరుకు కూడా ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో ప్రయాణ సమయం 45 రోజులకు పెరిగింది. ఫలితంగా సరుకు నాణ్యత దెబ్బతిని ఆర్డర్లు రద్దయ్యే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. వేల కోట్ల రూపాయల చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉండటంతో ప్రభుత్వ జోక్యం లేకపోతే అనేక ఎగుమతి సంస్థలు దివాలా తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు.
పడిపోయిన బియ్యం ధరలు..
గత 72 గంటల్లోనే బాస్మతి బియ్యం ధరలు దేశీయ మార్కెట్లో 7-10 శాతం మేర పడి పోవడంతో ఎగుమతిదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎగుమతి రవాణా ఖర్చులు 20 శాతం పెరగడమే కాకుండా నౌకల ఇంధన ధర టన్నుకు 520 నుంచి 580 డాలర్లకు చేరడం, యుద్ధ రిస్క్ కారణంగా ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారమవ్వడంతో ఎగుమతిదారుల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది.
విదేశీ వాణిజ్యం దెబ్బతినే ప్రమాదం
నౌకలు రద్దయినప్పుడు లేదా సరుకు నిలిచిపోయినప్పుడు పోర్టుల్లో వసూలు చేసే స్టోరేజ్, డెమరేజ్ చార్జీలను వెంటనే మాఫీ చేయాలని ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ (ఐఆర్‌ఈఎఫ్) కేంద్రాన్ని కోరింది. అదే విధంగా కోవిడ్ సమయంలో ఇచ్చిన విధంగానే వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, బ్యాంకింగ్ వెసులుబాటు కల్పించాలని డిమాండ చేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వేల కోట్ల రూపాయల విదేశీ వాణిజ్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.



