Thursday, December 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమరో ఏడు దేశాలపై పర్యాటక నిషేధం

మరో ఏడు దేశాలపై పర్యాటక నిషేధం

- Advertisement -

పదిహేను దేశాలపై ప్రవేశ ఆంక్షలు
అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయం
జనవరి 1 నుంచి అమలు

వాషింగ్టన్‌ : గతంలో 19 దేశాలపై పర్యాటక నిషేధం, ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో 20 దేశాలను ఆ జాబితాలో చేర్చారు. ఏడు దేశాలతో పాటు పాలస్తీనీయులపై పూర్తి స్థాయిలో పర్యాటక నిషేధాన్ని విధించారు. మరో పదిహేను దేశాల వారిపై ప్రవేశ ఆంక్షలు పెట్టారు. దేశ భద్రత, ప్రజల రక్షణ, బలహీనమైన తనిఖీ వ్యవస్థలు, అధిక వీసా ఓవర్‌స్టే రేట్లను ఇందుకు కారణాలుగా చూపారు. ట్రంప్‌ తాజా నిర్ణయంతో పర్యాటక నిషేధం, ప్రవేశ ఆంక్షలు విధించిన దేశాల సంఖ్య 39కి చేరింది.

అధ్యక్ష భవనం ఏం చెప్పిందంటే…
ప్రధానంగా ఉగ్రవాద కార్యకలాపాలు, అంతర్గత ఘర్షణ, అధిక వీసా ఓవర్‌స్టే రేట్ల కారణంగా తాజా నిర్ణయం తీసుకున్నామని అధ్యక్ష భవనం తెలిపింది. ఉగ్రవాద ముప్పు ఎక్కువగా ఉన్నందున బుర్కినా ఫాసో, మాలీ, నైగర్‌, నైజీరియా దేశాలపై చర్యలు తీసుకున్నామని చెప్పింది. కొన్ని దేశాల బీ-1, బీ-2, విద్యార్థి వీసా ఓవర్‌స్టే రేట్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. సంవత్సరాల తరబడి పౌర అశాంతి నెలకొన్న సిరియాలో పాస్‌పోర్టులు, పత్రాలు జారీ చేసేందుకు కేంద్ర అథారిటీ ఏదీ లేదని తెలిపింది. ‘విదేశీ పౌరుల ప్రవేశాన్ని నిరోధించడానికి ఆంక్షలు, పరిమితులు అవసరం. ఎందుకంటే వారు ఎదుర్కొనే ప్రమాదాలను అంచనా వేయడానికి, ఆయా దేశాల ప్రభుత్వాల సహకారం పొందడానికి, మన వలస చట్టాలను అమలు చేయడానికి, ఇతర ముఖ్యమైన విదేశాంగ విధానం, జాతీయ భద్రత, ఉగ్రవాద నిరోధక లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన సమాచారం అమెరికా వద్ద లేదు’ అని అధ్యక్ష భవనం ఫ్యాక్ట్‌-షీట్‌ వివరించింది. తాజా ప్రకటన నుంచి చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు, ప్రస్తుత వీసా హోల్డర్లు, దౌత్యవేత్తలు, అథ్లెట్లు, అమెరికా ప్రయోజనాల కోసం పని చేసే వ్యక్తులకు మినహాయింపు ఇచ్చారు.

నిషేధానికి గురైన దేశాలు
శ్వేతసౌధం ఫ్యాక్ట్‌-షీట్‌ ప్రకారం బర్కినా ఫాసో, మాలీ, నైగర్‌, దక్షిణ సూడాన్‌, సిరియా దేశాలపై పర్యాటక నిషేధం విధించారు. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన పర్యాటక పత్రాలు ఉన్న వారిని కూడా జాబితాలో చేర్చారు. దీనితో పాటు లావోస్‌, సియర్రా లియోన్‌పై పూర్తి స్థాయిలో నిషేధం విధించారు. గతంలో ఈ రెండు దేశాలపై పాక్షిక ప్రవేశ ఆంక్షలు ఉండేవి. తాజాగా విధించిన నిషేధం, ఆంక్షలు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. ప్రస్తుతం 19 దేశాలపై అమలులో ఉన్న పర్యాటక నిషేధం, ఆంక్షలను 30 దేశాలకు విస్తరించాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తోందని రెండు వారాల క్రితమే హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం కార్యదర్శి క్రిస్టీ నోయమ్‌ తెలిపారు. అయితే ఎన్ని దేశాలపై నిషేధాన్ని విధిస్తారో ఆమె అప్పుడు తెలపలేదు.

పాక్షిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాలు
తాజా ఆదేశాల ద్వారా ట్రంప్‌ ప్రభుత్వం పదిహేను దేశాలు..అంగోలా, ఆంటిగ్వువా, బర్బుడా, బెనిన్‌, ఐవరీ కోస్ట్‌, డొమినికా, గాబన్‌, ది గాంబియా, మలావీ, మారిటేనియా, నైజీరియా, సెనగల్‌, టాంజానియా, టాంగా, జాంబియా, జింబాబ్వేలపై పాక్షిక ఆంక్షలు విధించింది. బురండీ, క్యూబా, టోగో, వెనిజులాపై గతంలో విధించిన పాక్షిక ప్రవేశ ఆంక్షలు కొనసాగుతాయి. నూతన ఆదేశాల ప్రకారం పాక్షిక ఆంక్షల నుంచి విముక్తి పొందిన ఏకైక దేశం తుర్క్‌మెనిస్తాన్‌. ఆ దేశస్తుల ఇమ్మిగ్రేషన్‌ యేతర వీసాలపై ఆంక్షలను తొలగించారు.

ఇమ్మిగ్రేషన్‌ అణచివేత చర్యలు ముమ్మరం
అమెరికా గతంలోనే 12 దేశాలు… ఆఫ్ఘనిస్తాన్‌, బర్మా, ఛాద్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగో, ఈక్వెటోరియల్‌ గునియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్‌, లిబియా, సోమాలియా, సూడాన్‌, ఎమన్‌లపై పర్యాటక నిషేధాన్ని విధించింది. గత నెల 26న వాషింగ్టన్‌ డీసీలో ఇద్దరు నేషనల్‌ గార్డ్స్‌ సభ్యులపై దాడి జరిపి హత్య చేసిన తర్వాత ట్రంప్‌ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్‌ అణచివేత చర్యలను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే తాజాగా మరికొన్ని దేశాలపై పర్యాటక నిషేధం, ప్రవేశ ఆంక్షలు విధించింది. దాడికి పాల్పడిన వ్యక్తి ఆఫ్ఘన్‌ జాతీయుడు. అతను ఒకప్పుడు సీఐఏతో సంబంధమున్న ఓ యూనిట్‌లో పనిచేశాడు. 2021లో అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వైదొలిగిన తర్వాత అతను అమెరికాలో ప్రవేశించాడు. ఇమ్మి గ్రేషన్‌ తనిఖీ అనంతరం ఈ సంవత్సరం ప్రారంభంలో అతనికి అమెరికా ఆశ్రయం కల్పించింది. కాగా ఈ నెల 13న సిరియాలో జరిగిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు, ఆ దేశానికే చెందిన ఓ పౌరుడు మరణించారు. ఈ ఘటనల నేపథ్యంలో అమెరికా అక్రమ వలసలపై అణచివేత చర్యలను ముమ్మరం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -