– 2047నాటికి జీఎస్డీపీలో 10 శాతం వాటా
– యువతకు భారీగా ఉపాధి కల్పించడమే లక్ష్యం
– అత్యాధునిక మౌలిక వసతులు, భవిష్యత్ వ్యూహాలు
– వారసత్వ సంపదపై అవగాహన పెరగాలి : గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి జూపల్లి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం కీలకం కానుందనీ, 2047 నాటికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో పర్యాటక రంగం వాటాను 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047-గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ”తెలంగాణ అనుభవాలు- వార సత్వం, సంస్కృతి – ఫ్యూచర్ రెడీ టూరిజం” అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్ర మంలో అటవీ, దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు కీలకోపన్యాసం చేశారు. 2047 నాటికి మూడు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని కేవలం సంఖ్యాత్మక సూచికగానే కాకుండా, రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి మార్గంగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి అపారమైన అవకాశాలున్నాయనీ, ఈ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి, స్వయం ఉపాధి అవకా శాలు లభిస్తాయని తెలిపారు. హాస్పిటాలిటీ, హస్త కళలు, రవాణా రంగాల్లోని వేలాది ఎంఎస్‌ఎంఈలకు ఇది జీవనాధారమని చెప్పారు. నూతన పర్యాటక విధానంలో ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించడానికి విస్తృతస్థాయి ప్రోత్సాహకాలు ఉన్నాయని తెలిపారు.
శాతవాహనుల కాలం నుంచి కాకతీయుల శిల్పకళ, కుతుబ్‌షాహీ సమాధులు, చారిత్రక కట్టడాల వరకు రాష్ట్ర నిర్మాణ కళా వారసత్వాన్ని మంత్రి కొనియాడారు. కాకతీయ కళాతోరణం వంటి అద్భుతమైన నిర్మాణ సంపదను పర్యాట కులు తప్పక సందర్శించాలని కోరారు. రాష్ట్ర పండుగలు, ఉత్సవాలు, హస్తకళలైన చేనేత, స్థానిక కళాకారుల పనితనం చిన్న వ్యాపారా లకు, సాంప్రదాయ జీవనోపాధికి మూలస్తంభా లని నొక్కిచెప్పారు. పోతన కవితల్లో ప్రతిబిం భించే తెలంగాణ ప్రజల దయ, నిజాయితీ వంటి ఉన్నత విలువలను ప్రపంచానికి చాటి చెప్పాలని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సులభంగా ప్రాంతీయ పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శిం చడం, తద్వారా సాంస్కృతిక అవగాహన, సామాజిక సుసంపన్నత లభిస్తున్నాయని చెప్పారు.
పర్యాటకులకు అన్ని రకాల వసతులను, సుదీర్ఘ ప్రయాణాలకు అనుకూలమైన రోడ్డు సౌకర్యాల కల్పనపై దృష్టి సారిస్తామని మంత్రి జూపల్లి తెలిపారు. పర్యాటక వెబ్‌సైట్ ద్వారా రవాణా, వసతి, భద్రత, ఆకర్షణల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. ప్రజలు, పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణులు అందరూ కలిసి తెలంగాణ పర్యాటక సంపదను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మెనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక రంగానికి ‘బూస్టర్ డోస్’ పర్యాటకమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



