నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నేడు (మంగళవారం) గాంధీభవన్‌లో జరగనుంది. పార్టీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులతో పాటు, ఇదివరకు ఆ పదవుల్లో కొనసాగిన నాయకులు కూడా పాల్గొననున్నారు.
ఈ మీటింగ్ లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా, పట్టణ అధ్యక్షులకు మహేశ్‌గౌడ్ నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే పదవీకాలం పూర్తి చేసుకున్న అధ్యక్షులను పార్టీ సన్మానించనుంది. ఆ తర్వాత త్వరలో జరగబోయే పంచాయతీలు సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జరుపుకోవాల్సిన ‘ప్రజాపాలనా విజయోత్సవాల’ నిర్వహణపై కూడా నేతలు దృష్టి సారించనున్నారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్‌లు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.



