నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో 4 7 2025 ఉదయం 11 గంటలకు కమలానగర్ ఆఫీసులో ప్రముఖ స్వాతంత్ర పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు జయంతి, తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ప్రముఖ వాలీబాల్ కోచ్ ఎస్ ఎస్ వి ప్రసాద్, దొడ్డి కొమరయ్య చిత్రపటానికి ట్రేడ్ యూనియన్ నాయకులు జె చంద్రశేఖర రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజలను ఏకం చేసి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి వారిని ముప్పు తిప్పలు పెట్టారని అన్నారు. అల్లూరి సీతారామరాజు విప్లవకారుడుగా స్వాతంత్ర సాధన కోసం మన్యం ప్రజలకు అండగా నిలచి బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేశారని చెప్పారు. బ్రిటిష్ పాలకులు అల్లూరి సీతారామరాజును కపటంతో మట్టుపెట్టారని అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి మనకందరకు ఆదర్శప్రాయం అని చెప్పారు. దొడ్డి కొమరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరుడుగా నిలిచి తెలంగాణ సాయుధ పోరాటానికి బీజం వేశారని అన్నారు.
ఆనాడు నిజాం సర్కార్ కు తాబేదారులుగా ఉన్న దేశ్ముఖులు ప్రజలను దోపిడీ చేస్తూ పోయారని దానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడయ్యారని చెప్పారు. ప్రముఖ వాలీబాల్ కోచ్ ఎస్ఎస్ వి ప్రసాద్ మాట్లాడుతూ.. ఈరోజు జాతీయ జెండా పింగళి వెంకయ్య వర్ధంతి కూడా ఉందని ఆయన గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడని అన్నారు. కృష్ణమాచార్యులు, శారద, పార్థసారధి, వెంకటేశ్వరరావు ప్రసంగించారు. అధ్యక్షుడు యాదగిరిరావు మాట్లాడుతూ.. నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగానూ, నిజాం సర్కార్ కు వ్యతిరేకంగానూ ప్రజలందరినీ కుల మతాలకతీతంగా సమిష్టిగా నిలిపి పోరాటం సాగించారని, కానీ నేటి పాలకులు మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నారని అన్నారు. ఆనాటి పోరాట యోదులను స్ఫూర్తిగా తీసుకొని, మతతత్వ శక్తులకు, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పారు. అనంతరం సభ్యులందరూ పోరాటయోధుల చిత్రపటాలకు పూలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ శ్రీనివాస్, కేకే ఉన్నికృష్ణన్, గౌసియా, శ్రీనివాసరావు, ఎం భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.