గత పదేండ్లుగా భారత సమాజంలో సకల రంగాలు, భిన్న సామాజిక వర్గాలు బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు శక్తుల దాడులకు గురవుతున్నాయి. దేశంలో ప్రత్యామ్నాయ భావజాలం కలిగిన సంస్థలు, వ్యక్తులు ఉండటం ఈ సనాతన వాదులకు గిట్టదు. తీవ్ర అసహనాన్ని ప్రదర్శించటమే కాక, ప్రగతిశీల శక్తులపై దాడులకు తెగబడుతున్నారు. రాజ్యం రాజ్యాంగబద్ధ చట్టానికి వ్యతిరేకంగా ఈ ఫాసిస్టు శక్తులకు అండగా నిలుస్తున్నది. ప్రశ్నించే గొంతులను, కలాలను హతమారుస్తున్నారు. దబోల్కర్ మొదలు గౌరీ లంకేష్ వరకు ఈ చర్యల పరంపర కొనసాగుతూనే ఉంది. దళిత అణగారిన వర్గాల వారు బాగా చదువుకోవటం, మంచి స్థితికి చేరుకోవటం సనాతన ధర్మం సహించలేదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల విషయంలో చూశాం. ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై సనాతన ధర్మం తలకెక్కించుకున్న ఒక న్యాయవాది బూటు విసరి దాడి చేసిన ఘటన అత్యంత ఆందోళనకరం. ఇది ప్రస్తుతం దేశంలో నెలకొన్న దుస్థితిని తెలుపుతోంది. దాడిచేసిన వ్యక్తి ”సనాతన ధర్మానికి అవమానం జరిగితే సహించం” అంటూ కోర్టు హాలులో చేసిన నినాదాలను బట్టి దాడికి ప్రేరణ ఏమిటో… ఎవరో… సులభంగానే అర్థం చేసుకోవచ్చు.
జస్టిస్ గవాయ్ పై దాడి ఘటన అదేదో సాదాసీదాగా, యాదృచ్ఛికంగా జరిగినది కాదు. పోనీ ఈ వ్యక్తి మతిస్థిమితం లేనివాడా? కానేకాదు. ఒక న్యాయవాది, అందులో అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి పై బూటుతో దాడి చేయడమంటే అతని సనాతన ధర్మం ఎంత నెతికిక్కితే ఈ పని చేసి ఉంటాడు? వందేండ్ల సంఘ పరివార్ హిందూ ప్రజల మెదడులకు ఎక్కించిన విద్వేష విషమిది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ పదకొండేండ్లలో రాజ్యాంగబద్ధ వ్యవస్థల విధ్వంసం సైద్ధాంతికంగా ఒక పథకం ప్రకారం జరుగుతోంది. న్యాయవ్యవస్థను సైతం వదిలిపెట్టలేదు. ఇంకా లోతుల్లోకి వెళితే ప్రధాని న్యాయమూర్తి గవాయ్‌ది దళిత సామాజికవర్గం. దళితుడు బాగా చదువుకుని అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి కావడాన్ని సనాతన ధర్మం అంగీకరించదు, సహించదు. దీనికి ఉదాహరణ ఆయన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక మే నెలలో తొలిసారి సొంత రాష్ట్రం మహారాష్ట్రలోని ముంబాయి పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఆయన్ని విస్మరించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముంబాయి పోలీస్ కమిషనర్ వంటి ముఖ్యులు గవాయ్ పర్యటనలో పాల్గొనకుండా అవమానపరిచారు. తర్వాత మహారాష్ట్ర సర్కార్ పొరపాటు జరిగిందని, సుప్రీంకోర్టులో తప్పు ఒప్పుకొని విచారం వ్యక్తపరిచింది.
అలాగే అక్టోబర్ 5న మహారాష్ట్రలోని అమరావతిలో ఆరెస్సెస్ నిర్వహించిన శత శతాబ్ది వార్షికోత్సవానికి రావాలని గవాయ్ తల్లిదండ్రులను ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని వారు తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. అప్పటినుండి మహరాష్ట్రలోని సంఘపరివార్ శక్తులు సోషల్ మీడియాలో వీరిపై వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. అదిగాక బీహార్లో ఓటర్ల సవరణ, తమిళనాడు విషయంలో గవర్నర్ల తీరుపై గవాయ్ జారీ చేసిన ఉత్తర్వులు కూడా రాజకీయ నేపథ్య కారణాలు కూడా ఉండవచ్చు. ఇవన్నీ ఆయనపై దాడికి పురిగొల్పి ఉండవచ్చు. అత్యున్నత స్థాయి వ్యక్తులపైనే ఈ అమానుష దాడి జరిగితే ఇక సామాన్య ప్రజల పరిస్థితేమిటి…? ఎంతటి వారినైనా వదిలి పెట్టమని సనాతనుల హెచ్చరికగా ఈ ఘటనను పరిగణించాలి. కోర్టు హాలులో విధి నిర్వహణలో ఉన్న గవాయ్‌పై దాడిని అగ్రకుల ఆధిపత్య అహంకారంగానూ, సనాతన ధర్మ ఉన్మాద సంస్కృతిలో భాగమే! ఇంత అవమానం జరిగినా ”ఆ న్యాయవాదిని వదిలివేయండి, కేసు కూడా పెట్టొద్దు”అని జస్టిస్ గవాయ్ అన్నారంటే ఆయన ఉదారత, స్వచ్ఛమైన విలువలతో పెరిగిన ఆయన జీవన విధానం, శ్రమజీవుల సంస్కృతిలో భాగంగా చూడాలి.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు స్వతంత్ర న్యాయవ్యవస్థ మూలస్తంభం. చట్టసభలు చేసే శాసనాలు, కార్యనిర్వాహక వర్గం చేసే పనులు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో, లేదో సమీక్షిస్తూ, ప్రజల రాజ్యాంగబద్ధ హక్కులను రక్షిస్తుంది. సమైక్య వ్యవస్థ, సామాజిక ఆర్థిక న్యాయం, లౌకికతత్వం లాంటి రాజ్యాంగ విలువలు , పునాదులను కాపాడుతుంది. ప్రభుత్వాలు చేసే చట్ట విరుద్ధ పాలన, అవినీతి, అధికార దుర్వినియోగం లాంటివాటికి పగ్గాలు వేస్తుంది. ప్రజల హక్కులను పరిరక్షిస్తుంది. దీనికిగాను న్యాయమూర్తులు నిర్భీతిగా, నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించగలిగితేనే న్యాయం గెలుస్తుంది. కానీ, న్యాయమూర్తులను భయపెట్టే విధంగా కొన్నేళ్లుగా మన దేశంలో జడ్జిలపై వ్యక్తిగత దూషణలు, భౌతిక దాడులకు తెగబడే విధంగా ఓ భయానక వాతావరణం సృష్టించబడింది. దీనికి పరాకాష్ట జస్టిస్ గవాయ్ పై జరిగిన ఈ దాడి. నిస్పాక్షిక న్యాయ వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే ఇలాంటి చర్యలను దేశ ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలి. సనాతన చందసవాదశక్తుల్ని అన్ని రకాలుగా ఎదిరించాలి, ఓడించాలి.
షేక్ కరిముల్లా
9705450705