Monday, July 28, 2025
E-PAPER
Homeజాతీయంహరిద్వార్‌లో ఘోరం

హరిద్వార్‌లో ఘోరం

- Advertisement -

మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట
ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు
కరెంట్‌ షాక్‌ పుకారుతో ప్రమాదం? అధికారుల దర్యాప్తు
రాష్ట్రపతి, ప్రధాని, సీఎం సంతాపం
హరిద్వార్‌ :
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గల మానసాదేవి ఆలయం వద్ద ఘోరం జరిగింది. ఆలయం మెట్ల మార్గంలో ఆదివారం ఉదయం తొక్కిసలాట చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. ఆరుగురు భక్తులు చనిపోయిన విషయాన్ని హరిద్వార్‌ జిల్లా కలెక్టర్‌ మయూర్‌ దీక్షిత్‌ ధ్రువీకరించారు. ఇందులో నలుగురు యూపీకి చెందినవారు కాగా ఒకరు ఉత్తరాఖండ్‌, మరొకరు బీహార్‌కు చెందినవారున్నారు. ఇక గాయపడినవారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. మిగతావారికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని అధికారులు వివరించారు. ఐదుగురికి తీవ్ర గాయాలైనట్టు తెలిపారు. ఆలయం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారి వినరు శంకర్‌ పాండే తెలిపారు. క్షతగాత్రుల్లో ఎనిమిది మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. శ్రావణమాసం నేపథ్యంలో ఉత్తరాదిన ఆలయాలను భక్తులు పెద్ద ఎత్తున సందర్శించుకుంటారు. దీంతో మానసాదేవి ఆలయానికి కూడా ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది.

కారణమేంటి..?
ఆలయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన వెనుక గల కారణాలేంటి అనేదానిపై పోలీసులు, అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఆలయ మెట్ల సమీపంలో ఓ ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ వైర్‌ తెగి నడకదారిపై పడినట్టు ఒక పుకారు వ్యాపించింది. అప్పటికే అక్కడ భక్తులు కిక్కిరిసి ఉన్నారు. దీంతో ఈ పుకారుతో వారిలో గందరగోళం, ఆందోళన నెలకొన్నది. అది కాస్తా తొక్కిసలాటకు దారి తీసినట్టు తెలుస్తున్నది. అయితే విద్యుత్‌ వైర్‌ తెగిపడి విద్యుద్ఘాతం జరిగిందా? లేక అది పుకారేనా? అన్న విషయంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఒకరు మాత్రం కరెంట్‌ షాక్‌కు గురై కాలిన గాయాలతో బాధపడుతున్నట్ట ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మిగతావారంతా తొక్కిసలాట వల్లే గాయపడ్డారని తెలుస్తున్నది.

తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ.. బాధను వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందనీ, అధికారులతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని ఆయన వివరించారు. ఉత్తరాఖండ్‌ పోలీసు విభాగానికి చెందిన స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌)తో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యల్లో నిమగమయ్యారని సీఎం తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -