నీటి గుంటల్లో పడి ఐదుగురు మృతి
నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో ఘటనలు
నవతెలంగాణ-దేవరకొండ/ బొంరాస్‌పేట్
బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకునే దసరా పండుగ రోజు ఆ గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో నీటి గుంటల్లో పడి ఐదుగురు మృతిచెందిన ఘటనలు గురువారం జరిగాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నుంచి నల్లగొండ జిల్లా చందంపేట మండలం దేవరచర్ల గ్రామానికి దసరా పండుగకు వచ్చిన బంధువుల్లో ముగ్గురు డిండి వాగులో మునిగిపోయి మృతి చెందారు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి మండలం చినర గ్రామానికి చెందిన కేతావత్ రాము(38), వినుకొండ మండలం గుడిగనమాల తండాకు చెందిన భరత్(22), కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన నాగేశ్వరరావు నాగమణి దంపతుల కుమారుడు ఉమా సాయి కాంత్(11) తమ బంధుమిత్రులతో కలిసి మంగళవారం చందంపేట మండలం దేవరచర్ల గ్రామానికి చెందిన కేతావత్ గుణనాయక్ ఇంటికి దసరా పండుగ సందర్భంగా వచ్చారు.
బుధవారం ఉదయం గ్రామానికి సమీపంలో ఉన్న డిండి వాగులో స్నానం చేయడానికి వెళ్లారు. అక్కడ ఉమా సాయికాంత్ కాలు జారి వాగులో పడిపోయాడు. అది గమనించిన రాము, భరత్ బాలుడ్ని కాపాడే ప్రయత్నంలో వాగులోకి దుకారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాము, భరత్ వాగులో మునిగి మృతి చెందారు. దాంతో గ్రామానికి చెందిన కొంతమంది యువకులు వారి మృతదేహాలను బయటకు తీశారు. సాయికాంత్ ఆచూకీ తెలియక పోవడంతో గ్రామస్తులు వాగులో గాలింపు చేయగా శుక్రవారం ఉదయం బాలుని మృతదేహం లభించింది. భరత్ ఎంబీబీఎస్ ఫస్టియర్ పూర్తి చేయగా, రాముకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉమాసాయి కాంత్ ఆరవ తరగతి చదువుతున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న దేవరకొండ ఏఎస్పీ మౌనిక, డిండి రూరల్ సీఐ బీసన్న, చందంపేట ఎస్‌ఐ లోకేష్‌యాదవ్.. సంఘటన విషయాలను తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసినట్టు సీఐ బీసన్న తెలిపారు.
ప్రాణాలు తీసిన అలుగు సరదా
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం అల్లిఖాన్‌పల్లి గ్రామానికి చెందిన విద్యార్థినులు ఊదరి ప్రణతి(13), కొత్తపల్లి రుక్షిత (12) గ్రామ సమీపంలోని చెరువు అలుగును చూసేందుకు వెళ్లారు. అక్కడ కాసేపు సరదాగా గడిపిన వారు.. అలుగు దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు జారి చెరువులో పడిపోయారు. పెద్ద గుంత ఉండటం గమనించకపోవడంతో నీటిలో మునిగిపోయారు. గమనించిన తోటి స్నేహితులు గట్టిగా అరిచారు. అటుగా వెళ్లే వారిని సాయం కోరగా వారు వచ్చి నీటిలో పడిన ప్రణతి, రుక్షితను బయటకు తీయగా.. వారు అప్పటికే వారు మృతిచెందారు. విద్యార్థినుల స్నేహితుల అర్ధనాదాలు అందరి హృదయాలను కలచివేశాయి. దుద్యాల ఉన్నత పాఠశాలలో వీరిద్దరూ 8, 9వ తరగతి చదువుతున్నట్టు స్థానికులు తెలిపారు.