రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్.చోంగ్తు
నిమ్స్‌లో ట్రామా కేర్ ఫెసిలిటీపై ఓరియంటేషన్ ప్రోగ్రామ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రవ్యాప్తంగా ట్రామా కేర్ సదుపాయాలను సమర్థవంతంగా అభివృద్ధి చేయడం అత్యంత అవసరమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్. చోంగ్తు అన్నారు. ట్రామా కేర్ సేవలను బలోపేతం చేయడం, సమన్వయంతో అమలు చేయడమే లక్ష్యంగా సోమవారం నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్ ఆస్పత్రి) ట్రామా బ్లాక్ ఆడిటోరియంలో ”ట్రామా కేర్ ఫెసిలిటీపై ఓరియం టేషన్ ప్రోగ్రామ్” నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. సమయానుకూల చికిత్స, ప్రొటోకాల్ ఆధారిత వైద్యం, సేవల సమగ్ర సమన్వయం ద్వారానే ప్రమాద బాధితుల ప్రాణం కాపాడొచ్చని తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ట్రామా కేర్ విభాగాన్ని బలోపేతం చేయడం అత్యంత ప్రాధాన్యమన్నారు. రాష్ట్రంలోని ప్రతి వైద్య కళాశాల, జిల్లా ఆస్పత్రి ట్రామా మేనేజ్‌మెంట్‌లో తమ పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించాల్సిన అవసరాన్ని వివరించారు. ”గోల్డెన్ అవర్”లో సరైన చికిత్స అందించడం అత్యంత కీలకమని, నిమ్స్ వంటి తృతీయ స్థాయి సంస్థలు ట్రామా కేర్ నెట్‌వర్క్‌లో మార్గదర్శక పాత్ర పోషించాలని సూచించారు. నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ నగరి బీరప్ప మాట్లాడుతూ.. ప్రమాద బాధితులకు వేగవంతమైన, ప్రమాణిత చికిత్స అందించడానికి సమన్వయ పూర్వక వ్యవస్థ అవసరమన్నారు. నిమ్స్ తృతీయ స్థాయి వైద్య సంస్థగా రాష్ట్ర ట్రామా కేర్ నెట్‌వర్క్‌లో నోడల్ సెంటర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ట్రామా సెంటర్లకు సాంకేతిక మార్గదర్శకత్వం, శిక్షణా కార్యక్రమాలు అందించడంలో నిమ్స్ ముందంజలో ఉందని చెప్పారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ జి.సునీల్ కుమార్ మాట్లాడుతూ.. తృతీయ స్థాయి వైద్య సంస్థలు ట్రామా కేర్ విభాగంలో శిక్షణ, సామర్థ్యాభివృద్ధి, రీసెర్చ్‌లో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ట్రామా లెవల్-2, లెవల్-3 సెంటర్లను అనుసంధానం చేసి బలమైన రిఫరల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఉంది. ప్రతి 20 కిలోమీటర్ల పరిధిలో సమగ్ర ట్రామా కేర్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చేయడం ద్వారా ప్రమాదాల వల్ల జరిగే నిరోధించగల మరణాలను తగ్గించి, రోగుల ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం సాధ్యమవుతుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజరు కుమార్, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలోని సీనియర్ అధికారులు, వివిధ వైద్య కళాశాలల సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు ట్రామా మేనేజ్‌మెంట్‌లోని ముఖ్య అంశాలపై సదస్సులు నిర్వహించారు. వీటిలో ఎయిర్‌వే మేనేజ్‌మెంట్, రిససిటేషన్, న్యూరోట్రామా, ఆర్థోపెడిక్ ట్రామా, బ్లడ్ బ్యాంక్ సపోర్ట్, టెలి మెడిసిన్, డిజాస్టర్ ప్రిపేర్‌డ్‌నెస్ వంటి అంశాలపై చర్చించారు.
ట్రామా కేర్ సదుపాయాల అభివృద్ధి అవసరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



