Monday, January 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రయాణ కష్టాలు

ప్రయాణ కష్టాలు

- Advertisement -

ఊరికి వెళ్తున్నామన్న ఆనందం కాస్త ఉసూరుమనేలా ట్ర్రిప్‌
తిరుగు ప్రయాణంలోనూ తప్పని తిప్పలు
అధిక చార్జీలు..అంతకు మించిన అవస్థలు

హైదరాబాద్‌ : సంక్రాంతి సెలవులు వచ్చేయడంతో నగర వాసులంతా పల్లె బాట పట్టారు. పండుగకు ఇంకా మూడు రోజుల సమయం ఉన్నప్పటికీ రహదారులన్నీ ఇప్పటికే వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. కిలోమీటర్ల మేర బారులు తీరుతూ చీమల మాదిరిగా కదులుతున్నాయి. సంక్రాంతి, దసరా పండుగల సమయంలో ఇలాంటి దృశ్యాలు మనకు సర్వసాధారణమే. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ముఖ్యంగా భాగ్యనగరమైతే దాదాపుగా ఖాళీ అయిపోతుంది. రోడ్లన్నీ నిర్మానుష్యమవుతాయి. ప్రయాణమంటేనే రోజువారీ బిజీ జీవితం నుంచి కాసింత ఊరట పొందడానికి, బంధుమిత్రులతో ఉల్లాసంగా గడపడానికి జరిపేది. ఓ వారం రోజుల పాటు యాంత్రిక జీవనాన్ని మరచిపోయి హాయిగా, ఆనందంగా సొంతూళ్లలో గడిపి నూతనోత్సాహంతో తిరిగి నగరానికి చేరుకుంటారు. అయితే ఇప్పుడు ఈ ప్రయాణాలు నరకాన్ని తలపిస్తున్నాయి. సొంత వాహనాలు ఉన్న వారి పరిస్థితి అటుంచితే బస్సులు, రైళ్లు, ఇతర వాహనాలలో వెళ్లే వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది.

రెండు మూడు నెలల ముందు టిక్కెట్‌ రిజర్వేషన్‌ చేయించుకుంటే కానీ సీటు దొరకదు. అది లేకుంటే అంతే సంగతులు. స్పెషల్‌ బస్సుల పేరిట దోపిడీ మొదలవుతుంది. ప్రయివేటు ట్రావెల్స్‌ వారైతే ఛార్జీకి మూడు నాలుగు రెట్లు అదనంగా వసూలు చేసి జేబులు ఇక్కడే ఖాళీ చేస్తారు. రైలులో అయితే కనీసం నిలబడడానికి కూడా చోటుండదు. ఊరికి వెళుతున్నామన్న ఆనందం ఆవిరైపోతుంది. తిరుగు ప్రయాణంలోనూ ఇదే పరిస్థితి. కిక్కిరిసిన రైళ్లు,బస్సులు…నత్తనడక నడుస్తున్న వాహనాలు…అధిక ఛార్జీలు… ఇవన్నీ ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. జాతీయ రహదారులపై పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. తరచూ ట్రాఫిక్‌ జామ్‌లు తప్పడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై కొన్ని చోట్ల మరమ్మతు పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం సిబ్బందికి తలకు మించిన భారమవుతోంది. సొంత వాహనాలలో ప్రయాణిస్తున్న వారు నరకాన్నే అనుభవిస్తారు. బయటికి దిగలేక, లోపల కూర్చోలేక నానా అవస్థలు పడుతుంటారు. శారీరక అలసట అనివార్యమవుతుంది. చికాకులు తప్పవు.

ప్రయాణాన్ని పూర్తి చేసుకొని గమ్యస్థానం చేరిన వారికి నిరుత్సాహం, అలసట తప్పవన్నది సైకాలజిస్టుల అభిప్రాయం. బంధుమిత్రులు, స్నేహితులతో కాలం గడుపుదామని గంపెడాశతో వస్తే దారిలో ఎదురైన చేదు అనుభవం వారి ఉత్సాహంపై నీళ్లు చల్లుతుంది. రిలాక్స్‌ అవడం మాట అటుంచి అశాంతికి లోనవుతారు. సెలవులన్నీ ఇట్టే గడిచిపోయి తిరిగి కాంక్రీట్‌ జంగిల్‌కి చేరుకున్న వారిలో ఏ మాత్రం సంతోషం కన్పించదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -