Thursday, September 18, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువణికిన ఉత్తర తెలంగాణ

వణికిన ఉత్తర తెలంగాణ

- Advertisement -

– నీటి మునిగిన తండాలు
– భారీ వర్షాలు..వరదలు
– చెరువుల్ని తలపించిన కాలనీలు
– స్తంభించిన జనజీవనం
– పదిమంది మరణించినట్టు డీజీపీ ప్రకటన
– సీఎం ఏరియల్‌ సర్వే
– అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం
– సహాయచర్యల్లో ఎయిర్‌ఫోర్స్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు
– మరో మూడ్రోజులు అతిభారీ వర్షాలే : ఐఎమ్‌డీ హెచ్చరిక

నవతెలంగాణ హైదరాబాద్‌:-
భారీ వర్షాలు, వరదలతో ఉత్తర తెలంగాణ వణికిపోయింది. రోడ్లు, కాలనీలు, ఇండ్లు, చెరువులు, కుంటలు, కాల్వలు అనే తేడా లేకుండా అన్నీ జలమయం అయ్యాయి. గతంలో ఎన్నడూ ఈ తరహా జలవిపత్తును చూడలేదని స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేశారు. గతంలో లోతట్టు ప్రాంతాలే ముంపునకు గురయ్యేవి. ఇప్పుడు లోతట్టు, మెరక ప్రాంతాలనే తేడా లేకుండా అన్నీ నీటమునిగాయి. వరద భీభత్సానికి స్థానిక అధికార యంత్రాంగం చేష్టలుడిగిపోయింది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ప్రాణనష్టాన్ని నివారించాలనే ఏకైక లక్ష్యంతో అధికారులు పనిచేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, హైడ్రా సిబ్బంది సహాయ చర్యలకు ఆటంకాలు ఏర్పడటంతో, ప్రభుత్వం దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అధికారుల్ని సంప్రదించింది. దీనితో ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు ఏరియల్‌ సర్వే చేసి, ప్రమాదంలో ఉన్న అనేకమందిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పీసీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ గౌడ్‌ హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కామారెడ్డిలో అధికారులతో సమీక్ష నిర్వహించాలని సీఎం భావించారు. కానీ ఆయన హెలికాప్టర్‌ దిగేందుకు అనువైన ఖాళీస్థలం లేకపోవడంతో, తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశారు. ఆ స్థాయిలో వర్షాలు, వరదలు ఉత్తర తెలంగాణను ముంచెత్తాయి. పంటలు నీట మునిగాయి. వందలాది మూగజీవాలు వరదల్లో కొట్టుకుపోయాయి. వరద ప్రాంతాలన్నీ హృదయవిదారక దృశ్యాలతో చలింపచేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో పదిమంది మరణించారని డీజీపీ జితేందర్‌ ప్రకటించారు. వచ్చే మూడ్రోజులు కూడా ఇదే తరహా భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -