Tuesday, July 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీవో 49పై ఆదివాసీల కన్నెర్ర

జీవో 49పై ఆదివాసీల కన్నెర్ర

- Advertisement -

– జీవో రద్దు చేయాలంటూ ఐటీడీఏల ఎదుట ధర్నా
– హక్కు పత్రాలు ఇచ్చి కనీస వసతులు కల్పించాలి : తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్‌
– రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు
నవతెలంగాణ-ఏటూరు నాగారం ఐటీడీఏ/విలేకరులు

ఆదివాసీ గిరిజనులను అడవుల నుంచి వెళ్లగొట్టడానికి కుట్రపూరితంగా ప్రవేశపెట్టిన జీఓ 49పై ఆదివాసీలు కన్నెర్రజేశారు. జీవోను రద్దు చేయాలంటూ సోమవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు ఐటీడీఏల ఎదుట ధర్నా నిర్వహించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని ఆదిలాబాద్‌, ఇంద్రవెల్లి, సిరికొండ, గాదిగూడ, నిర్మల్‌, పెంబి, సారంగపూర్‌, ఖానాపూర్‌, వేమనపల్లి, నెన్నెల, కోటంపల్లి, జన్నారం, దండేపల్లి, ఆసిఫాబాద్‌, దహెగం, జైనూర్‌, భద్రాచలం, బయ్యారం, మహాముత్తారం ప్రాంతాల్లో నిరసనలు, ధర్నాలు చేపట్టి వినతిపత్రాలు అందించారు. హక్కు పత్రాలు ఇచ్చి కనీస వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ఉట్నూరు ఐటీడీఏ ఎదుట జరిగిన ధర్నాలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్‌, భద్రాచలంలో మాజీ ఎంపీ మిడియం బాబూరావు, ఏటూరునాగారం ఐటీడీఏ ఎదుట జరిగిన ధర్నాలో రాష్ట్ర కమిటీ సభ్యులు జజ్జరి దామోదర్‌ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో చిత్ర మిస్రాకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులను అడవుల నుంచి వెళ్ళగొట్టేందుకు అటవీ సంరక్షణ, జంతు జీవ వైవిద్యం పరిరక్షణ పేరుతో జీఓ నెంబర్‌ 49 తీసుకొచ్చాయన్నారు. దీనివల్ల మహారాష్ట్రలోని తడోబా అంగేరి రిజర్వు ఫారెస్ట్‌లతో తెలంగాణలోని ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా కలిపి రిజర్వు ఫారెస్ట్‌గా ప్రకటించిందన్నారు.దీనివల్ల 339 ఆదివాసీ గ్రామాలు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 49 జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.


ఏటూర్‌ నాగారం మండలం కొమరం భీం కోయగూడెం, లక్ష్మీ దేవర నాయకులగూడెం, గూడసవాసులపై ఫారెస్ట్‌ అధికారుల దాడులు నిలిపివేయాలని, వారికి హక్కుపత్రాలు ఇచ్చి కనీస వసతులు కల్పించాలన్నారు. ఐటీడీఏ ద్వారా ఆదివాసులకి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ ఉంది చిరంజీవి, జిల్లా కమిటీ సభ్యులు కోటే కృష్ణారావు, కోరం చిరంజీవి, తోలం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -