బాబా సాహెబ్ 69వ వర్థంతి కార్యక్రమంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ : బీఆర్ అంబేద్కర్ 69వ వర్థంతిని పురస్కరించుకుని శనివారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. పార్లమెంటు ఆవరణలోని ప్రేరణ స్థల్‌లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ”మహాపరినిర్వాన్ దివస్ నాడు, మన రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం మహౌన్నత విజేత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్‌కు వినయపూర్వక నివాళులు అర్పిస్తున్నా” అని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అంబేద్కర్ దార్శనిక నాయకత్వం, న్యాయం, సమానత్వం, రాజ్యాంగవాదం పట్ల అచంచలమైన నిబద్ధత జాతీయ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మానవ గౌరవాన్ని నిలబెట్టడానికి, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి అంబేద్కర్ తరతరాలుగా ప్రేరణనిచ్చారని తెలిపారు. ”విక్షిత్ భారత్ నిర్మాణానికి మనం కషి చేస్తున్నప్పుడు ఆయన ఆదర్శాలు మన మార్గాన్ని వెలిగిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
”ఆయన జీవిత విలువలను, దేశానికి ఆయన ఇచ్చిన గొప్ప బహుమతి అయిన భారత రాజ్యాంగాన్ని మనం సమర్థించుకోవాలి, పరిరక్షించాలి” అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజ్యాంగ నిర్మాతకు, సామాజిక న్యాయం కోసం అలుపెరుగని స్వరానికి తమ ఘన నివాళి అని పేర్కొన్నారు. ”బాబాసాహెబ్ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదరభావం ఆదర్శాలను సమర్థించారు. అణచివేతకు గురైన అణగారిన వర్గాలతో సహా ప్రతి భారతీయుడి హక్కులను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించారు. బాబాసాహెబ్ ఆదర్శాలు దేశానికి ఎప్పటికీ మార్గనిర్దేశం చేస్తాయి” అని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. కేంద్ర సామాజిక న్యాయ మంత్రి వీరేంద్ర కుమార్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తదితరులు పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
బీఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళ్లు
- Advertisement -
- Advertisement -



